- ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మన సంస్కృతి, సంప్రదాయం, కళలను ప్రతిబింబించేలా విజయనగరం పట్టణంలో శోభాయాత్ర ఘనంగా జరిగింది. విజయనగరం ఉత్సవాల శ్రీకారం చుడుతూ, ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి కోట, సింహాచలం మేడ మీదగా గురజాడ కళాక్షేత్రం వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అమ్మవారి గుడి వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ ర్యాలీని ప్రారంభించిన అనంతరం, కోట దగ్గర్నుంచి ర్యాలీలోని కళారూపాల ప్రదర్శనను తిలకించారు. సుమారు 71 కళారూపాలు, అంశాలతో ఈ ర్యాలీ సాగింది. ర్యాలీలో చిన్నారుల రోలర్ స్కేటింగ్, అమ్మవారి ఘటాలు, వేద పండితుల వేదోచ్చరణ, పవిత్ర నాదస్వరం, ఎన్సిసి బృందాల కవాతు, విద్యార్థుల ప్రదర్శనలు, థింసా నృత్యం, తప్పెట గుళ్ళు, కోలాటాలు, బిందెల నృత్యం, చెక్కభజనలు, గంగిరెద్దులు, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, పులి వేషాలు, సాము గరిడీలు తదితర కళారూపాల ప్రదర్శనతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. గురజాడ కళాక్షేత్రంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయం, కళల పరిరక్షణకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. పండుగకు వచ్చే లక్షలాదిమంది భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయనకు ఆ పైడితల్లమ్మ వారి ఆశీస్సులు సదా ఉండాలని ఆకాంక్షించారు.డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ, వివిధ కళల్లో నిష్ణాతులు, ప్రావీణ్యం ఉన్న వారి ప్రోద్బలంతో, పెద్దల ఆదేశాలకు అనుగుణంగా, మన సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వివిధ కళారూపాలతో, కళాకారులతో పట్టణానికి కొత్త శోభ వచ్చిందని పేర్కొన్నారు. అత్యంత వైభవంగా మూడు రోజులు పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు సంకల్పించామని, దీనికి అన్ని వర్గాలు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, మన కలలు సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శనకు ఇదొక గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, అందరి భాగస్వామంతో అన్ని వర్గాలను అలరించే విధంగా ఉత్సవాలను, ఉత్సవ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని చెప్పారు.జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజయనగరం ఉత్సవాలు మన వైభవానికి, సంస్కృతికి ప్రతిబింబాలని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, సంస్కృతి, కళలు , సంప్రదాయాల పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, ఎస్పీ దీపికా పాటిల్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, వివిధ వేదికలు, కార్యక్రమాల ఇన్చార్జులు సుధాకరరావు, రాజ్ కుమార్, వి. టి . రామారావు, ఇతర అధికారులు, శాఖల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- ఆకర్షణీయంగా పుష్పాలతో కళా ఆకృతులు
విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మహారాజ ప్రభుత్వ సంగీత ముఖ్య కళాశాలలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ పుష్ప ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సేకరించబడినటువంటి వివిధ రకాల పుష్పాలతో ఆలంకరించబడ్డాయి. వివిధ కళా ఆకృతిలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంది.