పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒకవైపు వృద్ధి జరుగుతున్నప్పుడు రెండోవైపున అచ్చమైన పేదరికం కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని గురించి మార్క్స్ తన 'పెట్టుబడి' గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు.
''ఒకవైపు సంపద పోగుబడుతున్న సమయంలోనే మరోవైపు హీనమైన పరిస్థితులు, కార్మికులపై పీడన, బానిస చాకిరీ, అజ్ఞానం, క్రూరత్వం, నైతిక పతనం పోగుబడతాయి. ఏ వర్గమైతే తాను చేసిన ఉత్పత్తినే ''పెట్టుబడి'' రూపంలో అందిస్తుందో, ఆ వర్గమే ఈ హీన పరిస్థితులను ఎదుర్కొంటుంది.'' ఇంకా మార్క్స్ ఇలా అన్నాడు ''ఉత్పాదక పెట్టుబడి పెరుగుతున్నకొద్దీ తమకు పనులు కావాలని డిమాండు చేసే హస్తాల అరణ్యం ఇంకా విస్తరిస్తుంది. అయితే అందులోని హస్తాలు మాత్రం అంతకంతకూ వొట్టి పుల్లల్లా తయారౌతాయి'' (వేతన శ్రమ, పెట్టుబడి).
మన భారతదేశ అనుభవం సైతం దీనినే ధృవపరుస్తోంది. నయా ఉదారవాద కాలంలో చాలా వేగంగా పెట్టుబడి పోగుబడిందని, ఫలితంగా జిడిపి వేగంగా పెరిగిందని అందరూ అంగీకరిస్తారు. మన దేశ ఆర్థిక చరిత్రలో ఒక కొత్త శకానికి తెర తీసిన కాలంగా చాలా మంది దీనిని పరిగణి స్తారు. అయితే సరిగ్గా ఇదే కాలంలో అచ్చమైన పేదరికం కూడా పెరిగింది. వలస పాలన కాలంలోని చివరి 50 సంవత్సరాలలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత చాలా దారుణంగా పడిపోయింది. స్వతంత్రం వచ్చాక ఆ పరిస్థితిని మార్చి క్రమంగా తలసరి ఆహార ధాన్యాల లభ్యతను పెంచుకుంటూ వచ్చాం. 1991 నాటికి ఇది ఒక స్థాయికి చేరుకుంది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకూ 1991 నాటి స్థాయికి చేరుకోలేదు.
ఆహారధాన్యాల వినియోగానికి సంబంధించిన గణాంకాలు ఇంకా స్పష్టంగా పరిస్థితిని తెలియజేస్తున్నాయి. దేశంలో సరళీకరణ విధానాల అమలు ప్రారంభం అయ్యాక మొదటిసారి భారీగా జాతీయ శాంపిల్ సర్వేను 1993-94లో నిర్వహించారు. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక స్థాయికి దిగువనే ఉండిపోయిన ప్రజానీకం 58 శాతం ఉన్నారు. అంటే వీరంతా తలకు 2200 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని రోజుకు పొందలేకపోయిన వారు. మళ్ళీ అటువంటి భారీ స్థాయిలో శాంపిల్ సర్వే జరిగింది 2011-12లో. అప్పుడు వచ్చిన గణాంకాలను చూస్తే వీరి శాతం 58 నుండి 68 కి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక స్థాయి (అంటే తలకు రోజుకు 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందలేకపోవడం)కి దిగువన ఉన్నవారు 1993-94లో 57 శాతం ఉంటే వీరి సంఖ్య 2011-12 నాటికి 65 శాతానికి పెరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే నయా ఉదారవాద కాలంలో అచ్చమైన పేదరికం (దీనిని కొలవడానికి అత్యంత ప్రాథమికమైన కొలబద్ద ఆకలే) పెరిగింది. అధికారికంగా కూడా పేదరికాన్ని ఆహార లభ్యతను బట్టే అంచనా వేస్తారు. అయితే ఇటీవల ఈ విధంగా అంచనా వేయడం ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. అందుకే దీనిని కప్పిపుచ్చి రకరకాల గిమ్మిక్కులతో పరిస్థితిని అందంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
అసమానతలపై జరిగిన ఇతర అధ్యయనాలు కూడా ఈ నిర్ధారణనే బలపరుస్తున్నాయి. ఫ్రెంచి ఆర్థికవేత్తలు పికెట్టీ, ఛాన్సెల్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో అత్యంత సంపన్నులైన ఒక శాతం వ్యక్తుల ఆదాయం జాతీయ ఆదాయంలో 22 శాతంగా ఉంది. ఇది 2013 నాటి పరిస్థితి. అదే 1982లో చూసుకుంటే వీరి వాటా 6 శాతం మాత్రమే ఉంది. సరళీకరణ కాలంలో మన దేశంలో అసమానతలు ఎంత తీవ్రంగా పెరిగాయో ఇది తెలియజేస్తోంది. వాస్తవానికి ఈ కాలంలో ఇది పేదరికం పెరగడానికి కూడా దారితీసింది.
ఈ పేదరికం ఏ తీరున పెరుగుతుందో మార్క్స్ స్పష్టంగా వివరించి చెప్పారు. చిన్న తరహా ఉత్పత్తిదారులు, ముఖ్యంగా రైతులు దివాలా ఎత్తి ఉద్యోగాల కోసం పట్టణాలకు వలసపోతారు. అక్కడ వీరందరికీ సరిపడా ఉద్యోగాలు ఉండవు. పట్టణాల్లో అప్పటికే ఉన్నకార్మికుల కుటుంబాల లోనూ ఉద్యోగార్ధులు పుట్టుకొస్తారు. వీరంతా కలిసి పెద్ద నిరుద్యోగ సైన్యం అవుతారు. ఉద్యోగాల కోసం అప్పటికే పనులు చేస్తున్నవారితో వీరంతా పోటీ పడతారు. అందుకే వీరిని రిజర్వు కార్మిక సైన్యం అని మార్క్స్ అన్నారు. ఈ పోటీ వలన కార్మికులు తమ జీతాలను పెంచుకోడానికి బేరసా రాలాడే శక్తిని కోల్పోతారు. దాని పర్యవసానంగా అసమానతలు, పేదరికం పెరుగుతాయి.
వృద్ధి రేటు పెరిగినప్పుడు దాని కారణంగా పేదరికం, అసమానతలు పెరిగితే, ఆ వృద్ధిరేటు తగ్గినప్పుడు పేదరికం, అసమానతలు తగ్గాలి కదా అని వాదించేవారున్నారు. ఈ వాదన తప్పు. నిజానికి వృద్ధితోబాటు పేదరికం పెరుగుతుంది. అదే సమయంలో వృద్ధి తగ్గినప్పుడు పేదరికం మరింత ఎక్కువగా పెరుగుతుంది. పెట్టుబడిదారీ వృద్ధి జరుగుతున్నప్పుడు చిన్న ఉత్పత్తిదారులు, రైతులు దివాలా తీసి, ఆ క్రమంలో పేదరికం పెరుగుతుంది. వారు తమ భూములను, ఇతర ఆస్తులను కోల్పోకపోయినా వారి ఆదాయాలు తగ్గిపోతూంటాయి. అందుచేత తగ్గిన ఆదాయా లతో బతకలేక వలసలు పోతారు. అదే వృద్ధిరేటు తగ్గిపోయినప్పుడు అలా తగ్గినందు వల్ల...ఈ చిన్న ఉత్పత్తిదారుల ఆదాయాలేమీ పెరిగిపోవు సరికదా మరింత తగ్గిపోతాయి. అయితే అలా తగ్గిపోడానికి కారణాలు వేరు.
ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక రైతు పండించిన పంట విలువ రూ.200 అనుకుందాం. ఆ పంటను సాగు చేసేందుకు రూ.100 పెట్టుబడి అయిందనుకుందాం. అప్పుడు అతని నికర ఆదాయం రూ.100 అవుతుంది. వృద్ధి జరుగుతున్న క్రమంలో వైద్యం ప్రైవేటీకరణ అయినప్పుడు అతని వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆ తర్వాత వృద్ధి రేటు తగ్గిందనుకుందాం. అలా తగ్గినంత మాత్రాన అతని వైద్య ఖర్చులేమీ తగ్గిపోవుకదా. కాని వృద్ధిరేటు తగ్గినందువలన అతని పంటకు అంతకు ముందు వరకూ వచ్చిన ధర మాత్రం రాదు. ఫలితంగా అతని నికర ఆదాయం తగ్గిపోతుంది. వృద్ధిరేటు పెరుగుతున్న కాలంలో... వైద్యం ప్రైవేటీకరణ వలన అతని ఆదాయం తగ్గిపోతే ఇప్పుడు, వృద్ధిరేటు తగ్గిన కారణంగా అతని పంటకు రేటు తగ్గిపోయి, అతని ఆదాయం మరింత తగ్గుతుంది. వృద్ధిరేటు పెరిగినప్పుడు అతని పేదరికం పెరిగింది. ఇప్పుడు వృద్ధిరేటు తగ్గినందువలన అతని పేదరికం మరింత పెరిగింది. అదే విధంగా ఒక కార్మికుడు పొందే ఆదాయం రెండు అంశాల మీద ఆధారపడి వుంటుంది. ఒకటి- అతనికి ఒక పనిదినానికి వచ్చే వేతనం. రెండవది- అతనికి పని దొరికే దినాల సంఖ్య. వృద్ధి రేటు పెరుగుతన్న కాలంలో అతనికి రోజుకు ఇచ్చే వేతనం తగ్గి అతని పేదరికం స్థాయి పెరుగుతుంది. వృద్ధిరేటు తగ్గినప్పుడు అతని రోజువారీ కూలీ రేటు ఏమీ పెరగదు సరికదా అతనికి దొరికే పని దినాలు సైతం తగ్గిపోతాయి. అందువలన వృద్ధిరేటు తగ్గినప్పుడు అతని పేదరికం మరింత పెరుగుతుంది. ఆర్థిక మాంద్యమూ, ఉత్పత్తి తగ్గిపోవడమూ ఆ విధంగా అదనపు పాత్ర పోషించి వృద్ధి సమయంలోనే పెరుగుతున్న పేదరికాన్ని ఆ తర్వాత కాలంలో (వృద్ధి రేటు తగ్గిన కాలంలో) మరింత పెంచుతాయి.
ఒకవేళ మళ్ళీ వృద్ధిరేటు పుంజుకుంటే అప్పుడైనా పేదరికం తగ్గవచ్చు కదా? అనడిగేవారున్నారు. నిరుద్యోగం తగ్గి ప్రజల ఆదాయాలు పెరిగితే పేదరికం కొంత తగ్గవచ్చునని అనిపిస్తుంది. కాని ఇది పొరపాటు అభిప్రాయమే అవుతుంది.
ఇప్పుడు నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం ఎదుర్కుంటున్న సంక్షోభం పది, పదిహేనేళ్ళకు ఓమారు వచ్చే సంక్షోభం వంటిది కాదు. ఇది వ్యవస్థీకృతమైన సంక్షోభం. నయా ఉదారవాద విధానానికి ఇక ముందు దారులన్నీ మూసుకుపోయాయి. కోవిడ్-19 మహమ్మారి ముసురుకోక మునుపే వృద్ధిరేటు పతనం వలన పేదరికపు స్థాయి బాగా పెరిగింది. దీని నుండి ఆటోమేటిక్‌గా బైటపడడం సాధ్యం కాదు. ప్రజల కొనుగోలుశక్తిని పెంచితే తప్ప కోలుకోవడం సాధ్యం కాదు. దీనికి పయా ఉదారవాద విధానం అనుమతించదు. అందుచేత తిరిగి గతంలో మాదిరిగా వృద్ధిరేటు సాధించడం కుదరదు.
ఈ మాంద్యం కాలంలో పేదరికం ఏ విధంగా పెరిగిందో తెలియజేసే సమాచారాన్ని మీకు ఇస్తాను. 2011-12 సంవత్సరంలో గ్రామీణ, పట్టణ పేదరికం ఏ విధంగా ఉండిందో మీకు ముందే తెలియజేశాను. ఆ తర్వాత మళ్ళీ 2017-18లో సర్వే చేశారు. 2011-12తో పోల్చితే 2017-18 నాటికి గ్రామీణ ప్రజల వినిమయ శక్తి 9 శాతం పడిపోయిందని ఆ సర్వే నిర్ధారించింది. ఆ గ్రామాల్లోని ధనవంతుల సంపద ఎటూ పెరిగే వుంటుంది గనుక గ్రామీణ పేదల వినిమయ శక్తి ఇంకా ఎక్కువే తగ్గిపోయి వుండాలి. ఈ నిర్ధారణ ఎంత కీలకమైనదంటే కేంద్ర ప్రఢుత్వం వెంటనే ఆ సర్వే వివరాలను ప్రజలకు అందకుండా దాచిపెట్టింది. అవే వివరాలు ప్రజలకు తెలిస్తే ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోలేక చాలా ఇరుకున పడి వుండేది.
ఇక రెండో సమాచారం దీర్ఘకాలంగా పీడిస్తున్న నిరుద్యోగం గురించి. కోవిడ్-19 రాకమునుపే నిరుద్యోగం 6 శాతం చేరుకుంది. మన దేశంలో చాలా ఉద్యోగాలను ఇంకా చాలా ఎక్కువమంది వంతులుగా చేస్తూంటారు. అందుచేత అచ్చమైన నిరుద్యోగులు 2 లేదా 2.5 శాతం మామూలుగా ఉంటారు. అది కాస్తా ఏకంగా 6 శాతం చేరిందంటే దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అంచనా వేయవచ్చు. మొత్తంగా చూస్తే అటు పేదరికమూ, ఇటు నిరుద్యోగమూ ప్రస్తుత మాంద్యం మనకి అందించిన ఫలాలని చెప్పాలి.
(స్వేచ్ఛానుసరణ)










