ప్రపంచ కుబేరులు, వారి రాజకీయ ప్రతినిధులు, బ్యాంకర్లు స్విట్జర్లాండ్ లోని పర్వతప్రాంత విడిది దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) పేరుతో సమావేశమైన రోజునే అంతర్జాతీయ చారిటీ ట్రస్టు 'ఆక్స్‌ఫామ్' విడుదల చేసిన నివేదిక అనేక చేదు నిజాలను బయటపెట్టింది. కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న తరుణంలో భారతదేశం లోని వందమంది శతకోటీశ్వరుల వద్ద రూ.12,97,822 కోట్ల మేర అదనపు సంపద పోగు పడింది. ఈ సంపదను 13.8 కోట్ల మంది నిరుపేద భారతీయులకు పంచితే ఒక్కొక్కరికి 94,045 రూపాయలు చొప్పున వస్తుంది. మరీ దిగ్భ్రాంతిగొలిపే అంశమేమిటంటే దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని సంపాదన ఒక గంటకు రూ.90 కోట్లు. ఒక్క చెమట చుక్క కూడా రాల్చని ఈ అపర కుబేరుడు ఒక సెకనులో ఆర్జించిన డబ్బును అంతగా నైపుణ్యం లేని ఒక సాధారణ కార్మికుడు సంపాదించాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుందట. అదే ఒక గంటలో అంబానీ సంపాదించినదాన్ని అందుకోవాలంటే పది వేల సంవత్సరాలు పడుతుందట. ఒక వైపు కోట్లాదిమంది పేదలు బతుకు భారమై ఈసురోమని అంటుంటే మరోవైపు అపర కుబేరుల వద్ద సంపద గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్నది. ఈ అసమానతల వైరస్ కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరమైనదని ఆక్స్‌ఫామ్ చేసిన హెచ్చరిక వాస్తవ పరిస్థితికి తగినట్టుగా ఉన్నది. కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో అంటే గత మార్చి నుండి ఇప్పటివరకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఈ అసమానతలకు ఎలా ఆజ్యం పోశాయో ఇప్పటికే అనేక రిపోర్టులు, సర్వేలు తెలియజేశాయి. దేశంలోని అత్యంత కుబేరులుగా ఉన్న మొదటి 11 మంది ఆర్జించిన సంపదపై ఒక శాతం పన్ను విధించినా, ఆ డబ్బుతో జనఔషధి మందులను పేద, మధ్యతరగతి ప్రజలకు చాలా చౌకగా అందుబాటులో ఉంచవచ్చు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్ మూలంగా ఒక్క ఏప్రిల్ నెలలోనే గంటకు లక్షా డెబ్బై వేల మంది సాధారణ పౌరులు ఉపాధి కోల్పోయారు. ఆ సమయంలో శత కోటీశ్వరుల వద్ద సంపద 35 శాతం మేర పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉపాధి లేక, ఆకలి దప్పులను తట్టుకోలేక వలస కార్మికులు కాలినడకన వందలవేల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తే వారిని ఆదుకోడానికి ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం దండిగా లాభాలు చేకూర్చేేందుకు పలు రాయితీలు ఇచ్చింది. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో అసంఖ్యాక ప్రజానీకానికి వెచ్చించింది రూ. రెండు లక్షల కోట్లు మాత్రమే. తక్కినదంతా బడా కార్పొరేట్ల బొక్కసాలు నింపడానికే సరిపోయింది. ఇది చాలదనట్టు రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, బొగ్గు గనులు వంటి కీలకమైన రంగాలను ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు పూనుకుంది. పెట్టుబడిదారుల దోపిడీ యథేచ్ఛగా సాగించేందుకు వీలుగా 44 కార్మిక చట్టాలను చుట్టచుట్టి నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించేసింది. ఇంకోవైపు దేశంలో 60 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు అత్యంత నిరంకుశంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. విద్య, ఆరోగ్యం వంటి మౌలిక రంగాలపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించింది. ఆర్థిక అసమానతలు ఇంతగా పెరిగిపోవడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ముదనష్టపు విధానాలే కారణం. నయా ఉదారవాద విధానాలు అనుసరించిన చోటల్లా ఆర్థిక అసమానతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద తిమింగలాలైన వాల్‌మార్ట్, షెల్, యాపిల్ వంటి పది బహుళజాతి కంపెనీల ఆదాయం ప్రపంచంలోని నూట ఎనభై దేశాల్లో ప్రభుత్వాలు ఆర్జించే ఆదాయంతో సమానం. ఈ సంపదనంతా సమాజ పరం చేసిననాడు పేదరికం, ఆకలి, నిరుద్యోగం వంటి సమస్యలను పారదోలవచ్చు. సకల అనర్ధాలకూ మూలమైన నయా ఉదారవాద విధానాలకు ప్రపంచవ్యాపితంగా ప్రతిఘటన పెరుగుతున్నది. కరోనా తరువాత ఈ ప్రతిఘటన మరింత వేగం పుంజుకున్నది. స్వాతంత్య్రానంతర భారత దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రైతాంగ ఉద్యమాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. ఆర్థిక అసమానతలు అనే ఈ వైరస్‌కు మూలమైన నయా ఉదార విధానాలను వెనక్కి తీసుకునేందుకు పెట్టుబడిదారీ ప్రభుత్వాలు అంగీకరించవు. వాటిని తిప్పికొట్టేందకు ప్రజా పోరాటాలను ఉధృతం చేయడమే మార్గం.










