
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుప్పకూలింది. టన్నెల్ కింద 36 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. బ్రహ్మఖల్ -యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుండి దండల్‌గావ్ వరకు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌లో 150 కి.మీ భాగం మేర తెల్లవారుజామున 4.00 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ నిర్మాణం శనివారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారికి బయటకు రావడానికి మార్గం మూసుకుపోయింది. సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద ఉత్తర కాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు 26 కి.మీ ప్రయాణాన్ని తగ్గించాలనే లక్ష్యంగా ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.