Feb 09,2021 06:55

ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలని రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్‌ 94(3) లో పేర్కొన్నారు. ఈ చట్టం చేసి నేటికి ఏడు సంవత్సరాలు అవుతోంది. సంవత్సరానికి రూ. 50 కోట్ల చొప్పున మూడు సంవత్సరాలిచ్చి తరువాత అది కూడా ఆపేశారు. ఈ కాలంలో ఉత్తరాంధ్ర సాధించిన అభివృద్ధి ఏమీ లేదు సరికదా వెనుకబాటు, వలసలు మరింత పెరిగాయి.
    కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి, అందులో భాగంగా ఉత్తరాంధ్రకు మరోసారి తీరని దగా చేసింది. ఈసారి బడ్జెట్లో కూడా మొండి చేయి చూపింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలు ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధాని నిర్మాణానికి నిధులు, కోల్పోయిన ఆదాయ భర్తీ, కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు వంటి అనేక అంశాలులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది.
   ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలని రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్‌ 94(3) లో పేర్కొన్నారు. ఈ చట్టం చేసి నేటికి ఏడు సంవత్సరాలవుతోంది. సంవత్సరానికి రూ. 50 కోట్ల చొప్పున మూడు సంవత్సరాలిచ్చి తరువాత అది కూడా ఆపేశారు. ఈ కాలంలో ఉత్తరాంధ్ర సాధించిన అభివృద్ధి ఏమీ లేదు సరికదా వెనుకబాటు, వలసలు మరింత పెరిగాయి. నీటి ప్రాజెక్టుల నిర్మాణం ''ఎక్కడ వేసిన గొంగళి అక్కడే'' అన్న చందంగా వుంది. గ్రామీణ పేదరికం మరింత పెరిగింది.
  విభజన చట్టం సెక్షన్‌ 93, షెడ్యూల్‌ 13 ప్రకారం ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు ఏర్పరచాలి. వీటికి అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో ఈ సంస్థల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికీ స్వంత భవనాలు సమకూరక వేరే ప్రదేశాల్లో నడుస్తున్నాయి. ఉదాహరణకు ఐఐఎం కు రూ. 691.58 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ. 665 కోట్లు అవసరమైతే, కేటాయించింది మాత్రం రూ. 100 కోట్లు లోపు మాత్రమే. గిరిజన యూనివర్సిటీకి అయితే ఇంకా ఘోరం. రూ. 400 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే కేంద్రం ఇచ్చింది శూన్యం. దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో కూడా ఇంకా ఖరారు చేయలేదు. మొదట విజయనగరం జిల్లా కొత్తవలస అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 526 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. అయితే ఈ ఏడేళ్ళ లోనూ నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఇప్పుడు కొత్తవలస కాదు- సాలూరు అంటున్నారు. పనులే ప్రారంభం కాలేదు కాబట్టి ఇక నిధుల సమస్యే లేదు. ఇలా అయితే ఈ విద్యా సంస్థల నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేను?
  ఇక రైల్వే జోన్‌ సంగతయితే ఇంకా ఘోరం. పునర్విభజన చట్టం షెడ్యూల్‌ 13లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 2018 వరకు కేంద్ర ప్రభుత్వం దాని ఊసే ఎత్తలేదు. ఎన్నికల ముందు ప్రకటన చేసి ఒక అధికారిని నియమించి కొంత హడావిడి చేశారు. అయితే ఇప్పటికీ దానికి అతీగతీ లేదు. ఈ సంవత్సరం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదు. చావు కబురు చల్లగా చెప్పినట్లు...జోన్‌ ప్రతిపాదన ఇంకా పరిశీలన లోనే ఉందని, ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని తాజాగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఇంతకంటే నయవంచన మరేదైనా ఉంటుందా? స్వయంగా ప్రధానమంత్రే రైల్వే జోన్‌ ఇస్తామని విశాఖలో ఎన్నికల ముందు హామీ ఇఛ్చి, నేడు మాటల గారడీ చేయడం ద్రోహం కాక మరేమిటి? జోన్‌ ఇవ్వలేదు సరికదా వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి, బ్రిటిష్‌ కాలంలోనే స్థాపించిన వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను మాత్రం ఎత్తేయడానికి నిర్ణయించారు. ఇదెంత మోసం? విభజన చట్టం సెక్షన్‌ 93లో విశాఖ, విజయవాడ నగరాలలో మెట్రో రైల్‌ నిర్మాణం చేబడతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రో మొదటి దశకు రూ.10,617 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ఏడేళ్ల లోనూ కేంద్ర ప్రభుత్వం ఆ మాటే ఎత్తలేదు. ఇది పచ్చి మోసం కాక మరేమిటి?
   చట్ట ప్రకారం ఇవ్వాల్సినవి, ప్రజలు కోరుకున్నవి ఇవ్వలేదు కానీ విశాఖ ఫిష్షింగ్‌ హార్బర్‌ను మాత్రం ఆధునీకరిస్తామని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. పోనీ ఎదో ఒకటి వచ్చింది కదా అని సంబరపడదామనుకుంటే పప్పులో కాలేసినట్లే. అమాత్యులు ఏం పలికినా దాని వెనుక ఏదో పరమార్ధం వుంటుందన్నట్లు ఫిష్షింగ్‌ హార్బర్‌ ప్రకటన వెనుక కూడా ఒక రహస్యముంది. అదేమిటంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ మత్స్య విధానంలో దేశంలోని ఫిష్షింగ్‌ హార్బర్లను ప్రైవేటు సంస్థలతో కలిసి పిపిపి పద్ధతిలో అభివృద్ధి చేస్తామని ఉంది. దీనర్ధమేమిటంటే విశాఖ ఫిష్షింగ్‌ హార్బర్‌ను ఆధునీకరణ పేరుతో కార్పొరేట్‌ పరం చేయడమే అమాత్యుల అసలు ఉద్దేశం.
    ఇవి చాలవన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో రెండు ఘాతుకాలకు పాల్పడింది. తెలుగు రాష్ట్రాలకే మణిహారంగా నిలిచిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును పూర్తిగా అమ్మేయాలని నిర్ణయించింది. ఇప్పటి దాకా సొంత గనులివ్వకుండా మాడ్చి, వాటాలమ్మడానికి ప్రయత్నించి, ఇప్పుడు ఏకంగా తెగనమ్మడానికే సాహసించింది. ఇది మోడీ ప్రభుత్వ ద్రోహానికి పరాకాష్ట. లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ, సుమారు లక్ష 50 వేల కోట్ల రూపాయల విలువ కలిగిన 22,372 ఎకరాల భూమి, ఆధునిక యంత్ర సామగ్రి, నిపుణులైన సిబ్బంది కలిగిన ఈ ప్లాంట్‌ను పుస్తక విలువ కట్టి చౌకగా తన తాబేదార్లకు ధారాదత్తం చేయాలని ప్రభుత్వ కుట్ర. ఇదే కాని జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక ఎండమావే. 'మాకొద్దు మొర్రో' అని గోల పెడుతున్నా, ఆలకించకుండా అణు విద్యుత్‌ ప్లాంటును శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటుకు పనులు వేగవంతం చెయ్యాలని ఇటీవలే ప్రధానమంత్రి కార్యాలయం హుకుం జారీ చేసింది. వీసమెత్తు మంచి కూడా చేయని మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు తీరని హాని చేసే ఇటువంటి చర్యలకు మాత్రం పూనుకోవడం నయవంచన కాక మరేమిటి?
   కేంద్ర ప్రభుత్వ ఈ దుశ్చర్యలను ఎదుర్కోవడమే నేడు ప్రజల ముందున్న ప్రధాన సవాలు. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ఉద్యమించడంతో పాటు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన స్టీల్‌ప్లాంటును ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడానికి ప్లాంట్‌ కార్మికులు చేస్తున్న పోరాటాలకు ప్రజలు అండగా నిలవాలి. రాజకీయాలకతీతంగా సాగే మహౌద్యమం ద్వారానే మోడీ ప్రభుత్వ కపట విధానాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం.
 

(వ్యాసకర్త 'ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక' ప్రధాన కార్యదర్శి)
ఎ. అజ శర్మ

ఉత్తరాంధ్రకు మరోసారి ద్రోహం