Feb 13,2021 07:08

    త్తరాఖండ్‌ లోని చమోలి జిల్లాలో ఈ నెల 7వ తేదీన జరిగిన ఘోరమైన విపత్తు కారణంగా ఇప్పటికే 36 మంది మరణించగా, మరో 150 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. చనిపోయిన వారిలో ఎక్కువమంది జల విద్యుత్‌ ప్రాజెక్టులు, వివిధ మౌలిక సదుపాయాల వద్ద పనిచేస్తున్న కార్మికులే కావడం విచారకరం. రైని గ్రామం సమీపంలో రిషిగంగ నదిపై నిర్మిస్తున్న చిన్న 13.2 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం కాగా, ఆ సమీపంలోనే ధౌలిగంగపై నిర్మిస్తున్న అతి పెద్ద 520 మెగావాట్ల తపోవన్‌ పవర్‌ ప్లాంట్‌ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ పని చేసే కార్మికులు చాలా మంది బురద ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రయోజనాల కోసమేనని భావిస్తున్నప్పటికీ కానీ, అవే ఇప్పుడు విపత్తుకు గురయ్యాయి. ఇటువంటి నిర్లక్ష్యపూరితమైన అభివృద్ధికర కార్యకలాపాలే ఇటువంటి విపత్తులకు ప్రథమ కారణాలుగా నిలవకపోయినా, అటువంటి విపత్తులకు పెద్దఎత్తున దోహదపడడం విచారకరం.
   ప్రస్తుత విపత్తు వెనుక గల అసలు కారణాలు, పరిస్థితులు ఇంకా బయటపడాల్సి వుంది. తొలుత ఊహించినట్లుగా హిమానీ నదం వల్ల ఏర్పడిన సరస్సు ఒక్కసారిగా కట్టలు తెంచుకుందనే భావన నిజం కానట్లుగా కనిపిస్తోంది. భారత్‌, విదేశాల్లోని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా జరిపిన అధ్యయనాలు చూసినట్లైతే, భారత నిపుణుల బృందాల ప్రాథమిక పరిశీలన ప్రకారం పెద్ద కొండచరియ విరిగిపడడం, దానికితోడు ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో మంచు, రాళ్ళుతో ఏర్పడిన మంచు పెళ్ళలు విరిగిపడడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అసలే అస్థిరంగా వున్న రాళ్ళతో కూడిన మంచుపెళ్ళపై గ్లేసియర్‌లో ఒక భాగం విరిగిపడడం వల్ల వరుసగా ఈ సంఘటనలన్నీ చోటు చేసుకుని వుండవచ్చని కూడా అనుమానిస్తున్నారు.
   సరే కారణాలేమైనా కానివ్వండి, ఈ విపత్తును అర్ధరహితంగా మానవుడు చేసే అభివృద్ధి కార్యకలాపాల అవశేషంగా చూడాల్సి వుంటుంది. అన్ని హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ, పర్యవసానాలు గురించి అస్సలు పట్టించుకోకుండా ఈ అభివృద్ధి చర్యలు చేపడుతున్నారు. పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ హిమాలయాల్లో ఇటువంటి పరిస్థితులకు ప్రధానంగా కారణమయ్యే, లేదా దోహదపడే అంశాలు రెండు వున్నాయి. అవేమంటే వాతావరణ మార్పులు, ఆలోచనారహితంగా ఈ ప్రాంతంలో చేపట్టే మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం. మానవుల వల్ల పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ వేగంగా హిమనీ నదాలు, ధృవ ప్రాంతపు మంచు దిబ్బలు కరిగిపోవడానికి దారి తీస్తున్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇటీవల భారత్‌లోనూ, అంతర్జాతీయంగా జరిగిన అధ్యయనాలు చూసినట్లైతే గత దశాబ్దాల్లో కన్నా ప్రస్తుతం ఈ మంచు కరిగిపోయే రేటు ఎక్కువగా వుందని వెల్లడవుతోంది. భారత్‌లో చూసినట్లైతే తూర్పు హిమాలయాల కన్నా పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో గ్లేసియర్లు చాలా వేగంగా కరుగుతున్నాయి. ఇలా గ్లేసియర్‌ (హిమానీ నదం) కరిగిపోవడం వల్ల పెద్ద మొత్తంలో సరస్సుల్లాంటివి ఏర్పడతాయి. ఒక్కోసారి వీటి కట్టలు తెగిపోయి పెద్ద మొత్తంలో నీరు కిందకు ప్రవహించడంతో ఆకస్మాత్తుగా వరదల్లాంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. ప్రస్తుత విపత్తులో ముందుగా ఊహించిన కారణం అదే. పశ్చిమ హిమాలయాల్లో ఇటువంటి క్రమం చాలా వేగంగా చోటు చేసుకుంటుండడం వల్ల అస్థిరతకు, ఆకస్మిక వరదలు పెరిగే అవకాశాలకు దారి తీస్తోంది.
   ఈ ప్రాంతంలో బాధ్యతారహితంగా రోడ్లు, విద్యుత్‌ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు పెరుగుతుండడంతో ఈ సమస్య కూడా తీవ్రతరమవుతోంది. అత్యంత సాధారణ పరిస్థితుల్లో కూడా తరచుగా కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు, ఫలితంగా టన్నుల కొద్దీ రాళ్లు, ఇతర శిధిలాలు పడడం వంటివి హిమాలయ పర్వత సానువుల్లో చాలా సర్వసాధారణమని మనకు తెలుసు. కొండ ప్రాంతాల్లో ఆవాసాల విస్తరణ వల్ల ఇప్పటికే ప్రాంతీయ పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతోంది. అంటే రహదారులు నిర్మించడం, జలవనరులు తరిగిపోవడం, చెట్లను నరికివేయడం వంటి చర్యల వల్ల ఆ ప్రాంతంలో నేల గుల్లబారుతోంది. కొండచరియలు విరిగిపడడం వల్ల పడే రాళ్ళు రప్పలతో నీటి ప్రవాహానికి అవరోధం ఏర్పడి స్థానిక కాలవలు, నదుల్లో ఒక్కసారిగా ఆకస్మిక వరదలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాగుతున్న నిర్మాణ ప్రాజెక్టుల వల్ల ఈ విధ్వంసం మరింత ప్రమాదకరమైన స్థాయిలకు వెళ్ళింది.
   ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ సంఖ్యలో జల విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు వంద వరకు డ్యామ్‌లు వున్నాయి. ఇంకా మరిన్ని నిర్మాణంలో వున్నాయి. వీటిల్లో చాలావరకు రన్‌ ఆఫ్‌ ది రివర్‌ ప్రాజెక్టులే. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి కొంతమేరకు నీటిని నిల్వ చేసుకునేవిగానే వున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం, 450కి పైగా జల విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మించాలన్నది ఆలోచనగా వుంది. అంటే ప్రతి కొద్ది డజన్ల కిలోమీటర్లకు ఒక ప్రాజెక్టు చొప్పున నిర్మించడమన్నమాట! ఈ డ్యామ్‌లు, జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల చెట్లు కూల్చివేయడం (నష్టపరిహారంగా మరో చోట చెట్లు పెంచడం వంటి చర్యలేమీ లేకుండానే), పెద్ద ఎత్తున నిర్మాణాలు, తరచుగా డైనమైట్లు పేల్చడం, ఇతర ప్రశ్నించదగిన పలు టెక్నిక్‌లను ఉపయోగించడం వల్ల ఇప్పటికే అస్థిరంగా వున్న కొండ ప్రాంతాలు మరింత అస్థిరంగా తయారయ్యాయి. ఈ పరిణామాల పట్ల స్థానికులు, గ్రామస్తులు తీవ్రంగా నిరసనలకు, ఆందోళనలకు దిగుతూనే వున్నారు. నిర్మాణ సందర్భంగా వచ్చిన శిధిలాలు, రాయీ రప్పా వంటి వాటిని నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో పోసేస్తున్నారు. లేదా రోడ్ల పక్కన పోసేస్తారు. అవి అంతిమంగా కలిసేది నదుల్లోనే.
   పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం కూడా సాగుతోంది. 2016లో రూ.14 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన చార్‌ ధామ్‌ ప్రాజెక్టు కింద ఉత్తరాఖండ్‌ లోని నాలుగు ప్రధాన యాత్రా స్థలాలను కలుపుతూ 800 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. చార్‌థామ్‌ మహా మార్గ్‌ హైవే, హోటళ్ళు, ఇతర మౌలిక సదుపాయాలు వీటిలో వున్నాయి. వంద కిలోమీటర్ల దూరం పరిధిలో 53 ప్రాజెక్టులుగా అసలు ప్రాజెక్టును విభజిస్తున్నట్లు మభ్యపెట్టి మరీ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారు. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు ఏర్పడిన కమిటీ రోడ్డు వెడల్పును 10 మీటర్లకు పెంచింది. దీంతో కొండను 24 మీటర్ల మేరా తొలిచారు. అంతకన్నా ఆందోళన కలిగించే అంశమేమంటే రోడ్డును కట్‌ చేయడం, కొండ ప్రాంతాన్ని తొలచడమనేది చాలా నాటుగా, ప్రమాదకరమైన పద్ధతిలో చేపట్టారు. డైనమైట్లు పెట్టి పేల్చడం వంటి చర్యలు అందులోవే. వీటివల్ల కొండ నిట్టనిలువునా చీలిపోవడంతో కొండచరియలు విరిగిపడే అవకాశాలు పెరిగాయి. కొత్తగా చెట్లు పెంచడం వంటి చర్యలేమైనా చేపడితే అవి కనీసం ఇటువంటి పరిస్థితులను కొంతమేరకు నిలువరించడానికైనా వీలు వుండేది. మరింత లాభాలు ఆర్జించాలన్న కంపెనీల తాపత్రయం, వేగం తప్ప భద్రత, రక్షణ అనేది వారికి ప్రాధాన్యతాంశంగా లేకుండా పోయింది.
   ఇప్పటిక అస్థిరంగా వున్న ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా జరుగుతున్న ఈ విధ్వంసానికి తోడు భవిష్యత్‌లో వరదలు వచ్చే అవకాశాలను మరింత పెంచుతోంది. శిధిలాల వల్ల నదీ తీరం పెరుగుతోంది, వరదలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. ఫలితంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మించే పట్టణాలు, మౌలిక సదుపాయాలన్నీ నీట మునుగుతున్నాయి. 2013లో జరిగిన విపత్తులో మనం చూసింది అదే.
   2013లో సంభవించిన పెను విపత్తులో కేదార్‌నాథ్‌ పట్టం దారుణంగా దెబ్బతింది. చుట్టుపక్కల పర్యావరణం గురించి కనీసపు ఆలోచన కూడా చేయకుండా, మళ్లీ ఇలాంటి ఆకస్మిక వరదలకు కారణమవుతామనే భయం కూడా లేకుండా ఈ పట్టణాన్ని పునర్నిర్మించారు. ఇటువంటి సున్నితమైన ప్రాంతంలో పట్టణాలు, ఆవాసాలు నిర్మిస్తే వాటిని తట్టుకునే సామర్ధ్యం వుందా లేదా అని కూడా కాస్తంత ఆలోచన చేయలేకపోయారు. ఆలయానికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు కిందిస్థాయిలో నివాస సదుపాయాలను నిర్మించడం వంటి ప్రత్యామ్నాయ సూచనలను కొట్టి పారేశారు.
   ఈ ప్రాంతంలో అత్యంత తీవ్రంగా వుండే వాతావరణ మార్పులు, కొండచరియలు విరిగిపడడం, ఏటవాలు ప్రాంతాలు, గ్లేసియర్‌ మార్పులు వంటి వాటిని నిరంతరంగా పర్యవేక్షించడమనేది లేకుండా పోయింది. ఉత్తరాఖండ్‌ పర్వత ప్రాంతాల్లో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి భద్రత, పర్యావరణ సమీక్ష జరగాల్సి వుంది. ఎటువంటి జాప్యం లేకుండా ఈ వినాశకరమైన చర్యలను తక్షణమే నిలుపుచేయాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విపత్తులు జరగక తప్పదు, మనం చూడక తప్పదు.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)