Aug 30,2022 07:54

బెంగళూరు : తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా కర్ణాటక బిజెపి ప్రభుత్వం పాఠ్యపుస్తకాల కాషాయీకరణను కొనసాగిస్తోంది. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడైన విడి సావర్కర్‌ను ఆకాశానికెత్తేస్తూ 8వ తరగతి కన్నడ సెకండ్‌ లాంగ్వేజ్‌ పాఠ్యపుస్తకంలో ఒక పాఠాన్ని ప్రవేశపెట్టింది. ఈ పాఠం రచయిత కె.టి.గట్టి, అండమాన్‌ జైల్లో బంధీగా వున్న సావర్కర్‌ను దర్శించేందుకు జైలుకు వెళ్లి అక్కడి తన అనుభవాన్ని వర్ణించారు. ఈ పాఠంలోని ఒక పేరాగ్రాఫ్‌ సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అయింది. సావర్కర్‌ బందీగా వున్న జైలు గది గురించి రచయిత వర్ణిస్తూ, ''సావర్కర్‌ వున్న జైలుకు కనీసం తాళం చెవి కన్నం కూడా లేదు. కానీ, ఎలాగో కొన్ని బుల్‌బుల్‌ పిట్టలు ఆ గదిలో ఎగురుతున్నాయి. వాటి రెక్కలపై కూర్చుని సావర్కర్‌ తన మాతృభూమిని ప్రతిరోజూ సందర్శించి వస్తున్నారు.'' అని పేర్కొన్నారు. ఈ చాప్టర్‌లోని ఈ పేరాగ్రాఫ్‌కు కొంతమంది సోషల్‌ మీడియా యూజర్ల నుండి విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. వారు ఆ రచయితను, కర్ణాటక ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొంతమంది పక్షిపై సావర్కర్‌ కూర్చుని వుండేలా వున్న ఫోటోలను ట్వీట్‌ చేశారు. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని, అత్యంత అధ్వానమైన రాజకీయ ప్రచారమిదని మరికొంతమంది ట్విట్టర్‌లో విమర్శలు చేశారు.