Feb 08,2021 20:10

చమోలీ(ఉత్తరాఖండ్‌) : ఉత్తరాఖండ్‌లో ఆదివారం సంభవించిన జలప్రళయ విషాదం.. భారీ ప్రాణనష్టంతోపాటు ఆస్తి నష్టాన్నీ మిగిల్చింది. రాష్ట్ర పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 202 మంది గల్లంతవ్వగా, వారిలో 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి జాడ ఇంకా లభ్యం కాలేదు. మరణించిన వారిలో ఇద్దరిని మాత్రమే ఇప్పటి వరకు గుర్తించినట్లు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు తెలిపారు. గల్లంతైన వారిలో జలప్రళయం సంభవించిన నదులపై పలు ప్రాజెక్టులకు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఉండగా, నదికి ఇరువైపులా ఉండే గ్రామాలకు చెందిన వారు ఉన్నారు.
ధ్వంసమైన వంతెనలు, ఆనకట్టలు, రహదారులు
భారీ వరదల ధాటికి అలకనంద, ధౌలీ గంగ, రుషి గంగ నదులపై పలు ప్రాంతాల్లో ఉన్న వంతెనలు, ఆనకట్టలు, రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్‌టిపిసికి చెందిన తపోవన్‌-విష్ణుగాడ్‌, రిషిగంగ హైడల్‌ పవర్‌ ప్రాజెక్టులు ధ్వంసం కాగా, మరో రెండు విద్యుత్‌ కేంద్రాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల ధ్వంసం కారణంగా నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. నదుల తీరప్రాంతాల్లో ఉన్న పలు ఇతర కట్టడాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఉత్తరాఖండ్‌ ప్రళయంలో 202 మంది గల్లంతు! - 19 మృతదేహాలు లభ్యం
కొనసాగుతున్న సహాయక చర్యలు
వరదల్లో గల్లంతైన వారితో పాటు తపోవన్‌ ప్రాంతంలో ఉన్న టన్నెల్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఐటిబిపి దళాలు శ్రమిస్తున్నాయి. విపత్తు ఉధృతి తగ్గిన అనంతరం ఆదివారం సాయంత్రం సమయంలో 16 మంది కార్మికులను రక్షించిన విషయం తెలిసిందే. సొరంగాల్లో భారీ స్థాయిలో మట్టి పేరుకుపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు రూ.20 కోట్లతో ఉపశమన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ సిఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సోమవారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
గల్లంతైన వారి జాబితా..
ఆకస్మిక వరదల్లో 202 మంది గల్లంతవ్వగా, 19 మంది మృతదేహాలను గుర్తించినట్లు రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. గల్లంతైన వారిలో రిత్విక్‌ అసోసియేట్స్‌కు చెందిన వంద మంది, రిత్విక్‌ కంపెనీకి చెందిన 21 మంది, ఓం మెటల్‌ కంపెనీ నుంచి 21 మంది, రిషిగంగ కంపెనీ నుంచి 46 మంది, హెచ్‌సిసి కంపెనీ నుంచి ముగ్గురు, తపోవన్‌, రింగి, కార్చావ్‌ గ్రామాలకు చెందిన ఇద్దరేసి, రేని గ్రామానికి చెందిన ఐదుగురు ఉన్నారు.
స్తంభించిన రాకపోకలు
మలారీ లోయ, తపోవన్‌ ప్రాంతంలో ఉన్న రెండు భారీ వంతెనలు పూర్తిగా కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రేని గ్రామం వద్ద ఉన్న మరో కీలక వంతెన సైతం కొట్టుకుపోయినట్లు ఐటిబిపి అధికార ప్రతినిధి చెప్పారు. చైనా సరిహద్దుల్లోని బోర్డర్‌ పోస్టులకు వెళ్లేందుకు ఈ వంతెనే కీలకం. సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్‌ఓ) ఆధ్వర్యంలో ఉన్న మరో నాలుగు వంతెనలు కూడా భారీగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 13 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. నదికి ఆవలివైపు ఉన్న కొన్ని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వర్షమేమో అనుకున్నాం : విపత్తు నుంచి బయటపడ్డ కార్మికుడు
తపోవన్‌ టన్నెల్‌ నుంచి బయటపడిన రాకేష్‌ భట్‌ ఆ భయాందోళకర పరిస్థితులను మీడియాకు వివరించారు. 'టన్నెల్‌లోకి నీరు రావడం చూసి అది వర్షం అనుకున్నాం. కొద్దిసేపటికి తగ్గుతుందిలే అని భావించాం. పెద్దయెత్తున బురద, ఇతర శిథిలాలు అధిక వేగంతో వస్తుండడంతో.. ఏదో ప్రమాదం జరుగుతోందని గ్రహించాం' అని తెలిపారు. ' ఫోన్‌ ద్వారా అధికారులకు సంప్రదించి దాదాపు ఆరుగంటల పాటు భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని గడిపాం. అనంతరం బలగాలు వచ్చి రక్షించిన వారిలో మొదటి వ్యక్తిని నేనే..' అంటూ రాకేష్‌ భట్‌ ఒకవైపు ఆనందంతో, మరోవైపు విషాదంతో మాట్లాడారు. మరో కార్మికుడు రాజేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆకస్మికంగా సంభవించిన వరద ఘటన హాలీవుడ్‌ సినిమాలోని సీన్‌ను తలపించిందన్నారు.
ఐరాస ప్రధాన కార్యదర్శి విచారం
ఉత్తరాఖండ్‌ ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ విచారం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకస్మిక వరదల ఘటనపై గుటెరస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఇస్రో, డిఆర్‌డిఓ సాయంతో కారణాల అన్వేషణ
ఈ ఘోర విపత్తుకు పూర్తి కారణాలను అన్వేషిస్తామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ తెలిపారు. ఇప్పటికే డిఆర్‌డిఓ బఅందం కారణాలను అన్వేషిస్తోందని, ఇస్రో సాయాన్ని కూడా కోరామని చెప్పారు. కారణాలు పూర్తిగా తెలిశాక భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.