Nov 29,2020 11:48

లడ్డూ :
కావాల్సిన పదార్థాలు :

ఉసిరికాయ తురుము - కప్పు, బెల్లం తురుము- కప్పు, డ్రైఫ్రూట్స్‌- రుచికి సరిపడా, పచ్చికోవా- టేబుల్‌ స్పూను, పచ్చికొబ్బరి తురుము- కప్పు, నెయ్యి- టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం:

  • పాన్‌లో నెయ్యి వేసి, కాగాక డ్రైఫ్రూట్స్‌ వేగించి తీయాలి. అందులోనే ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి తురుము, పచ్చికోవా వేసి వేగించాలి.
  • మరో పాన్‌లో అరకప్పు నీళ్లుపోసి అందులో బెల్లం తురుము వేసి పాకం పట్టాలి. లేతపాకం వచ్చాక ఉసిరి తురుము, కొబ్బరి తురుము మిశ్రమం వేసి, బాగా కలుపుతూ ఉడికించాలి.
  • మిశ్రమం దగ్గరగా వచ్చాక వేగించిన డ్రైఫ్రూట్‌ ముక్కలు వేయాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి కాస్త చల్లారాక నెయ్యి రాసుకుంటూ లడ్డుల్లా చుట్టాలి.


రోటి పచ్చడి
కావాల్సిన పదార్థాలు :

కొత్తిమీర-200 గ్రాములు, ఉసిరికాయలు-200 గ్రాములు, పచ్చిమిరపకాయలు-100 గ్రాములు, అల్లం-చిన్నముక్క, ఉప్పు- టీస్పూను.
తయారుచేసే విధానం:

  • ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడగాలి.
  • ఉసిరికాయల్లోని గింజలు తీసేసి  వాటిని చిన్న ముక్కలుగా తరగాలి.
  • పచ్చిమిరపకాయలు, అల్లం సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత అన్నింటినీ ఒకేసారి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చివరిలో తాలింపు మీ ఇష్టం. అంతే ఉసిరి రోటిపచ్చడి రెడీ.


సాంబార్‌
కావాల్సిన పదార్థాలు:

ఉసిరికాయలు - 100 గ్రాములు, కందిపప్పు (ఉడికించినవి) - కప్పు, సాంబారు పొడి - రెండు టీస్పూన్లు, పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - రెండు,
కరివేపాకులు - కొన్ని, ఆవాలు - టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం:

  • ఉసిరికాయల్ని కడిగి గింజలు తీసి ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా తరగాలి.
  • గిన్నెలో కప్పు నీళ్లుపోసి ఉసిరిముక్కల్ని ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత వాటిని మెత్తగా మెదపాలి. అందులోనే సాంబార్‌పొడి, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి ఉడికించాలి.
  • తరువాత ఉడికించిన కందిపప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి, మళ్లీ ఉడికించాలి.
  • అన్ని పదార్థాలు బాగా కలిసిపోయిన తరువాత గిన్నెను స్టవ్‌ మీద నుంచి కిందకు దింపాలి.
  • పాన్‌లో నూనె తీసుకొని, తాలింపు గింజలు వేయాలి. అందులోనే కరివేపాకునూ వేసుకోవాలి.
  • ఆవాలు చిటపటమంటున్నప్పుడు సాంబార్‌లో తాలింపు వేస్తే ఉసిరి సాంబారు రెడీ.