Jan 19,2023 08:57
  • ఇప్పటికే 97 శాతం 
  • పనిదినాలు పూర్తి
  • మరో 30 లక్షల పనిదినాల అదనపు లక్ష్యం
  • గతేడాది కంటే తగ్గిన వేతనం

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూడడంతో ఇది సాధ్యమైంది. జిల్లాలో ఇప్పటి వరకూ 97 శాతం పని దినాలు పూర్తయ్యాయి. మిగిలిన మూడు శాతం పది దినాలతోపాటు మరో 30 లక్షల పనిదినాలు అదనంగా కల్పించేందుకు డ్వామా అధికారులు ప్రణాళిక రూపొందించారు. పారిశ్రామిక, సేవా రంగాల్లో అత్యంత వెనుకబాటు, పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడం, వ్యవసాయ రంగంలోనూ పెద్దగా జీవనోపాధి లేకపోవడంతో ఉపాధి హామీ విజయనగరం జిల్లా వాసులకు వరంగా మారింది. జిల్లాలో 3.51 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కూలీలు ఎక్కువగా ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతున్నారు. దీంతో, ప్రతి జాబ్‌కార్డుపైనా ఏడాదికి వంద రోజులు పని గ్యారెంటీగా కల్పిస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది జిల్లాలో కోటీ 45 లక్షల పని దినాలు కల్పించాలనిది లక్ష్యం. ఇప్పటి వరకూ కోటీ 41 లక్షల పనిదినాలు కల్పించారు. 2,053 జాబ్‌కార్డులపై ఇప్పటికే వంద రోజులు పనిదినాలు పూర్తయ్యాయి. 81 నుంచి 99 రోజులు ఉపయోగించుకున్నవారు 34,948 మంది, 71 నుంచి 80 రోజులపాటు ఉపయోగించుకున్నవారు 22,717 మంది, 50 రోజులు పని పొందినవారు దాదాపు 50 వేల వరకూ ఉన్నట్టు సమాచారం. చేసిన పనులకు సంబంధించి కూలీలకు ఈ నెల నాల్గో తేదీ నాటికి రూ.283.17 కోట్ల కూలి చెల్లింపు జరిగింది. జూన్‌ నుంచి ఖరీఫ్‌ పంటలు ముమ్మరంగా సాగడం, మధ్యమధ్యలో వర్షాలు కారణంగా పనులకు కొంతమేర ఆటంకం కలిగింది.
ప్రస్తుతం ఆ పనులన్నీ పూర్తి కావడం, సంక్రాంతి పండగ హడావుడి కూడా ముగియడంతో పనులు ముమ్మరంగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు కూడా విజయనగరం జిల్లాకు 30 లక్షల పనిదినాలు పెంచుకోవాలని సూచించారు. ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించే దిశగా జిల్లాలో డ్వామా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు కూడా జిల్లాకు పెరగనున్నాయి. ఉపాధి హామీ కూలీలకు అందిన మొత్తంపై 60 శాతం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు రూ.169 కోట్ల మేర జనరేట్‌ అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు వినియోగించుకున్నది రూ.93 కోట్లు మాత్రమే. మిగిలిన మూడు శాతం పని దినాలతోపాటు అదనంగా నిర్దేశించిన పనిదినాల లక్ష్యాన్ని కూడా చేరుకుంటే మరింతగా ఎక్కువగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది రూ.159 నుంచి రూ.175లోపే కూలి
ఈ ఏడాది పనికి తగ్గ ఫలితం దక్కడ లేదని ఉపాధి కూలీలు చెబుతున్నారు. గతేడాది ఒక్కపూట కష్టపడితే సగటు పని దినానికి రూ.250 నుంచి రూ.257 వరకు అందేదని, ఈ ఏడాది రెండు పూటలా పని తప్పనిసరి చేశారని, కూలి మాత్రం రూ.159 నుంచి రూ.175 మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం విధించిన కఠిన నింబంధనలే ఇందుకు కారణమని అంటున్నారు.
అదనపు లక్షాన్నీ చేరుకుంటాం
ఈ ఏడాది ప్రతి జాబ్‌కార్డుదారునికీ వంద రోజులు పని కల్పించడంతో అదనపు లక్ష్యాన్నీ చేసుకోవడానికి కృషి చేస్తున్నాం.ఉపాధి పనులు కూలీల జీవనానికి ఎంతో తోడ్పాటునందిస్తున్నాయి. కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. దీనివల్ల లక్ష్యానికి అనుగుణంగా పనిదినాలు కల్పించగలుగుతున్నాం.
-జి.ఉమాపరమేశ్వరి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌, విజయనగరం