Dec 26,2020 07:12

ఉపాధ్యాయుల బదిలీలు 2017లో జరిగాయి. సాధారణ ఎన్నికల కోడ్‌ 2019లో ముగిసినా విద్యా శాఖ బదిలీలకు సన్నద్ధం కాలేదు. ఉపాధ్యాయుల బదిలీలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు నాడు ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. ఈలోగా విద్యా సంవత్సరం ప్రారంభమైపోయిందని...మధ్యలో బదిలీలు ఏమిటని ...2020లో బదిలీలు చేస్తామని...ముఖ్యమంత్రి చెప్పారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు అడగడం లేదు. దీనికి బాధ్యత ఉపాధ్యాయులది కాదు. మే-జూన్‌ నెలల్లో పాఠశాలలు ప్రారంభించే నాటికి బదిలీలు చేయడం ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఉపాధ్యాయ సంఘాలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వేసవి సెలవుల్లో బదిలీలు చేయలేకపోతున్నది.


మార్చి 19 నుండి పాఠశాలలు మూతబడ్డాయి. బదిలీల కోసం ఉపాధ్యాయులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు విడుదల చేయలేదు. ముఖ్యమంత్రి బదిలీలకు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడమే ఒక ఆలస్యమైతే, విద్యా శాఖ ప్రతిపాదనలు ఆమోదించడానికి బదిలీల ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయం లోనే మూడు నెలలు పైగా మురిగిపోయింది. ఈలోగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వారికి కావలసిన ప్రభుత్వ బదిలీలు చేసుకున్నారు. బదిలీ ఉత్తర్వులు విడుదలైతే ప్రభుత్వ బదిలీలు చేయడం సాధ్యం కాదని మఖ్యమంత్రి బదిలీ ఉత్తర్వులకు క్లియరెన్సు ఇవ్వలేదు. పోరాడి సాధించుకొన్న కౌన్సిలింగ్‌ పద్ధతికి భిన్నంగా జరిగిన బదిలీలన్నీ ప్రభుత్వ అవినీతి, అక్రమ బదిలీలే.
 

ప్రజాస్వామ్య దృక్పథమేది?
బదిలీ ఉత్తర్వులలో ఏమైనా మార్పులు చేయదలిస్తే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి చేస్తే బదిలీ సమస్యలు ముందే పరిష్కారమవుతాయి. అధికారులు తాము అనుకొన్నట్లు ఉత్తర్వులు రూపొందించడం, తర్వాత పదే పదే మార్పులు చేయడం, ఏది మార్చినా ఉపాధ్యాయులు కొందరికో, ఎందరికో నష్టం జరిగిందని బాధపడటం జరుగుతుంది. స్పష్టమైన బదిలీల కోడ్‌ రూపొందించాలని సంఘాలు డిమాండు చేస్తున్నా, దానికి ప్రభుత్వం గతంలో అంగీకరించినా నేటికీ అమలు కావడం లేదు. ప్రతి సంవత్సరం బదిలీలు జరగకపోవడంతో ఈ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఎట్టకేలకు అక్టోబరు 12న బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా రెండున్నర నెలలు గడిచినా ఈ పక్రియ కొనసాగుతూనే వుంది.


మరోవైపు మున్సిపల్‌ ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమ, రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులు, ఇంటరు, డిగ్రీ, పాలిటెక్నిక్‌ అధ్యాపకుల బదిలీల ఫైళ్లు అధికారులు, ముఖ్యమంత్రి మధ్య గింగిరాలు కొడుతూనే వున్నాయి తప్ప ఉత్తర్వులు విడుదల కావడంలేదు. ప్రతిదానికి ఫైనాన్స్‌, ముఖ్యమంత్రి అనుమతి అంటే విచిత్రంగా లేదూ! మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు ఎందుకివ్వడం లేదంటే 'మా ప్రభుత్వ బదిలీలు చేసుకొన్న తర్వాత ఇస్తా'మని మున్సిపల్‌ మంత్రే చెబుతున్నారు. ప్రతిదానికి చట్టం, నియమ నిబంధనలను వల్లెవేసే ప్రభుత్వానికి అడ్డగోలు బదిలీలు చేసుకొనే అధికారం ఎక్కడిది? ఇదేమైన జగనన్న బదిలీ పథకమా?
 

ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలేమిటి?
ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడితే, మెసేజ్‌ పెడితే, లేఖలు రాస్తే, పత్రికా ప్రకటనలిస్తే, చార్జి మెమోలు, సస్పెన్షన్లు. ఉద్యమానికి పిలుపునిస్తే హౌస్‌ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. నాయకులతో మాట్లాడడానికి నిరాకరణ. ధర్నాలు, పికిటింగ్‌లు, చలోలు చేసుకొంటే చేసుకోండి. మేం మాట్లాడం. మార్చేది లేదనడం. ఇదేమి రాజ్యం. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పరిస్థితి లేదే. చలో డైరెక్టరేట్‌, చలో సెక్రటేరియట్‌ అని వేలాది మంది సమస్యల సైరన్‌ ఊదినా స్పదించడం లేదు ఎందుకని?
 

ఏది సామాజిక బాధ్యత ?
ఉపాధ్యాయ పోస్టులు వేలాదిగా ఖాళీలు వున్నాయిగాబట్టి, తగినంత మంది ఉపాధ్యాయులు లేరు కాబట్టి, సామాజిక బాధ్యతగా బదిలీలలో ఎక్కడికైనా వెళ్ళాల్సిందే అంటుంది ప్రభుత్వం. పాఠశాల విద్యలో పాతికవేల పోస్టులు తక్షణం భర్తీచేయడం సామాజిక బాధ్యత కాదా? ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి వెంటనే డియస్సీ ప్రకటన చేయవచ్చుగదా. ఈలోగా తక్షణం ఒక్కనెలలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లతో 25 వేల ఖాళీలు భర్తీ చేయవచ్చుగదా. ఖాళీ పోస్టులు నింపకుండా ప్రభుత్వం వేల కోట్ల బడ్జెట్‌ మిగుల్చుకోవడమే గదా. విద్యాశాఖ శాంక్షన్‌ పోస్టులలో రూ. 10 వేల జీతంతో (రెగ్యులర్‌ ఉపాధ్యాయులైతే సరాసరి రూ. 40 వేలు) విద్యార్హతలు కలిగిన అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించడానికి ఆర్థికశాఖ (ప్రభుత్వం) ఆటంకాలు ఏమిటి? ఉచిత విద్య, నాణ్యమైన విద్య, సామాజిక బాధ్యత, రాజ్యాంగ బాధ్యత అంటే...ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయడం. తగినన్ని పోస్టులు మంజూరు చేయడం. బదిలీల సమస్యే కాదు. ఒకవైపు విద్యార్థులు పెరిగితే ఉపాధ్యాయుల పోస్టులు తగ్గించడం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అవసరమైనంత మంది ఉపాధ్యాయులను వుంచండి అంటే ఉన్న ఉపాధ్యాయులనే తగ్గించి సర్దుబాటు చేసి బదిలీలు చేయడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చెబుతోంది. 'బదిలీలు జరిగి మూడేళ్ళు గడిచింది. ఖాళీ పోస్టులన్నీ చూపించి బదిలీ చేయండి. రిలీవరు వచ్చిన తర్వాతనే రిలీవు అవుతాము (చేస్తారు). కాబట్టి వేకెన్సీలన్నీ చూపించండి' అంటే...పాఠశాలలు మూతబడతాయనే చర్చ ఏమిటి? నిందలు ఉపాధ్యాయుల మీదకు నెట్టేసి తమ తప్పు లేదని ప్రభుత్వం చెప్పడమా?
 

ప్రత్యక్ష కౌన్సిలింగ్‌ పద్ధతిలోనే బదిలీలు
విద్యాశాఖలో 2015లో తొలిసారిగా వెబ్‌కౌన్సిలింగ్‌ జరిగింది. కొన్ని అనుభవాలు రావడంతో 2017లో వెబ్‌ కౌన్సిలింగ్‌పై ఇప్పటిలాగే పెద్ద వ్యతిరేకత వచ్చింది. చివరకు ప్రభుత్వం ప్రత్యక్ష కౌన్సిలింగ్‌ పద్ధతిలో బదిలీలు చేసింది. వెబ్‌ కౌన్సిలింగ్‌ వెతలేమిటో ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి అర్ధమైంది. అయినా పంతాలకు పోవడం తప్ప ప్రభుత్వం పరిష్కారానికి రావడం లేదు. ఒక ఉపాధ్యాయుడు తనకు ఏ వేకెన్సీ వస్తుందో తెలియని 2 వేల వేకెన్సీలను... క్రమపద్ధతిలో సెల్‌ఫోన్‌ లోనో, కంప్యూటర్‌ ద్వారానో, నెట్‌ సెంటర్లకో వెళ్ళి...ఎంత సమయం వెచ్చించి ఆప్షన్‌ ఇవ్వాలి? అలా చేసినప్పటికీ ఉత్తర్వులు చేతికి అందేవరకు ఆందోళనే. నెట్‌, సర్వర్లు, కరెంట్‌ సమస్యలతో అర్ధరాత్రో, ఉదయమో సబ్‌మిట్‌ చేస్తూనే వున్నారు. అయినా అసంతృప్తి, ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
 

పంతాలకు పోవద్దు-పరిష్కరించండి
బదిలీల ప్రక్రియ ప్రారంభం నుండి ఉపాధ్యాయులు, సంఘాలు, రకరకాల ఆందోళనలు చేస్తూ వచ్చాయి. ఎమ్మెల్సీలు, సంఘాలతో ఒకటి, రెండు దఫాలు చర్చలు జరిగాయి. అయినా కొలిక్కిరాలేదు. ఇప్పటికైనా ఉపాధ్యాయుల ఆందోళన అర్ధం చేసుకొని ప్రత్యక్ష కౌన్సిలింగ్‌కు అనుమతించాలి. వేకెన్సీలు అన్నీ చూపించి బదిలీలు చేయాలి. బదిలీ ఉత్తర్వుల అమలుకు పాఠశాలలో 50 శాతమో, రిలీవరు వచ్చిన తరువాత రిలీవు చేయడమనే పద్ధతి ఎలాగూ వుంది. దీనితోబాటు తక్షణమే డియస్సీ-2020 నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. ఈలోగా ప్రత్యామ్నాయ ఏర్పాటుగా అన్ని ఖాళీలకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలి. ఆవిధంగా 'నాడు-నేడు'తో జరిగిన అభివృద్ధికి తోడుగా, తగినంత మంది ఉపాధ్యాయులు వుంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అవుతుంది. ప్రజలకూ ఈ విషయమై గట్టి నమ్మకం కలుగుతుంది.
                                                  * ఐ. వెంకటేశ్వరరావు (పిడియఫ్‌ ఎమ్మెల్సీ, సెల్‌ : 94903 00570)