May 29,2023 22:27
  • రెండు దశాబ్దాల పాలన పొడిగింపు

ఇస్తాంబుల్‌ : టర్కీ అధ్యక్షులుగా రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో టీర్కిలో గత 20 ఏళ్లగా కొనసాగుతున్న ఎర్డోగన్‌ పాలనకు పొడిగింపు లభించినట్లయింది. చివరి విడత కౌంటింగ్‌లో ఎర్డోగన్‌కు 52 శాతం ఓట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యర్థి కెమల్‌ కిలిక్‌డరోగ్లుకు 48 శాతం ఓట్లు లభించాయని తెలిపారు. ఆదివారం రాత్రి ఈ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు వెల్లడైన తరువాత సోమవారం ఎర్డోగాన్‌ మాట్లాడుతూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. 'మనం ఐక్యత, సంఘీభావంతో కలిసికట్టుగా పనిచేయాలి' అని తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ఎర్డోగన్‌కు వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ శుభాకాంక్షలు చెబుతూ నాటోలో మిత్రదేశాలుగా కలిసిపనిచేయడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షులు మాక్రాన్‌, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర నాయకులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.