Jul 20,2022 11:38

లక్నో :   తోపుడి బండిపై వస్త్రాలు విక్రయించే ఒక సాధారణ వ్యక్తికి ఇద్దరు గన్‌మెన్‌లు భద్రత కల్పిస్తుండటం యుపిలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన వెనుక తిరుగుతూ ఇద్దరు గన్‌మెన్లు ఎకె 47 రైఫిళ్లతో భద్రత కల్పిస్తుండటంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. 

వివరాల ప్రకారం.. ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్‌ దయాళ్‌ అనే వ్యక్తి తోపుడు బండిపై వస్త్రాలు విక్రయించేవాడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌సింగ్‌ సోదరుడు జుగేంద్రసింగ్‌ను కలిసి తన భూమికి పట్టా ఇప్పించాలని కోరాడు. ఈ విషయంలో రామేశ్వర్‌ దయాళ్‌ కు జుగేంద్రసింగ్‌కు మధ్య వివాదం చెలరేగింది. తనను కులం పేరుతో జుగేంద్ర సింగ్‌ దూషించాడంటూ రామేశ్వర్‌ దయాళ్‌  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   రామేశ్వర్‌  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురిని విచారణకు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. జుగేంద్ర సింగ్‌తో పాటు రామేశ్వర్‌ దయాళ్‌ కోర్టుకు హాజరయ్యారు. అయితే రామేశ్వర్‌ దయాళ్‌  భద్రత కల్పించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  వెంటనే రామేశ్వర్‌ దయాళ్‌ కు  బాడీగార్డులను నియమించాలని ఆదేశించింది. దీంతో స్థానిక పోలీసులు  రామేశ్వర్‌ దయాళ్‌కి  ఇద్దరు గన్‌మెన్‌లతో భద్రత కల్పించారు.