Oct 24,2023 14:46

చెన్నై :  తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎన్‌పిఎస్‌సి) చైర్మన్‌ నియామకంపై స్టాలిన్‌ ప్రభుత్వ సిఫారసును గవర్నర్‌ మరోసారి తిరస్కరించారు. టిఎన్‌పిఎస్‌సి చైర్మన్‌గా మాజీ డిజిపి సి.శైలేంద్ర బాబుని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్‌ను గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి మంగళవారం రెండోసారి తిప్పి పంపారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులు 'రాజ్యాంగ నిబంధనలు- ప్రవర్తన'కు విరుద్ధంగా ఉన్నాయని గవర్నర్‌ ఆరోపించారు. 'రాజ్యాంగ మరియు సంస్థాగత నిబంధనలు' కు అనుగుణంగా ఫైల్‌ను తిరిగి పంపాలని ఆదేశించారు.

శైలేంద్ర బాబు డిజిపిగా ఈ ఏడాది జూన్‌లో పదవీవిరమణ చేశారు. దీంతో ఆయనను టిఎన్‌పిఎస్‌సి చైర్మన్‌గా, మరికొంతమంది పేర్లను కమిటీలో సభ్యులుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదన పంపింది. అయితే ఏ ప్రాతిపదికన సభ్యులను ఎంపిక చేశారంటూ రెండు నెలల అనంతరం రాజ్‌ భవన్‌ ఈ ప్రతిపాదనను తిప్పి పంపింది. ఈ ప్రక్రియలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అని ప్రశ్నించింది.

సిఫారసులను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ నెల ప్రారంభంలో గవర్నర్‌ ఫైల్‌ ను రెండోసారి వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సభ్యుల ఎంపిక ప్రక్రియలో కొన్ని లోపాలున్నాయని గవర్నర్‌ పేర్కొన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న టిఎన్‌పిఎస్‌సి చైర్మన్‌, సభ్యుల నియామకాలను చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దరఖాస్తుదారులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించినట్లు తెలిపాయి.