Aug 16,2023 15:29

బ్యాంకాక్‌ :   పార్లమెంట్‌ ప్యానెల్‌ నిర్ణయాన్ని సమీక్ష చేపట్టాలన్న మూవ్‌ ఫార్వార్డ్‌ పార్టీ అభ్యర్థనను థాయిలాండ్‌ రాజ్యాంగ న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. ప్రధాని అభ్యర్థిని చేర్చుకోకుండా 20 మందికి పైగా వ్యక్తుల బృందం దాఖలు చేసినందున ఈ కేసును విచారణకు స్వీకరించడానికి నిరాకరించినట్లు కోర్టు పేర్కొంది. ''వారి హక్కులు ఉల్లంఘించబడలేదు. కేసు దాఖలు చేసే హక్కు వారికి లేదు'' అని కోర్టు వెల్లడించింది. మూవ్‌ ఫార్వార్డ్‌ పార్టీ తన ప్రధాని అభ్యర్థిని తిరిగి నామినేట్‌ చేయడాన్ని పార్లమెంట్‌ ప్యానెల్‌ అడ్డుకున్న సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులు మూవ్‌ ఫార్వార్డ్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ వారంలో త్వరలో ప్రధానమంత్రిపై మరో ఓటు వేయడానికి శాసనసభకు మార్గం సుగమమైంది.
మూవ్‌ ఫార్వర్డ్‌ పార్టీ నేత ఫీటా లిమ్‌జారోన్‌రాట్‌ను చట్టసభ సభ్యులు ప్రధానిగా తిరస్కరించడంతో పార్లమెంటులో పార్టీలు కూటమిని ఏర్పాటు చేయలేకపోయాయి. దీంతో గత ఐదు నెలలుగా థాయిలాండ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఉంది. మొదటి ప్రయత్నంలో ఫీటా లిమ్‌జారోన్‌రాట్‌ వైఫల్యం చెందడంతో రెండోసారి ఆయనను ప్రధాని అభ్యర్థిగా చట్టసభసభ్యులు తిరస్కరించారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో మూవ్‌ ఫార్వార్డ్‌ పార్టీ భారీ విజయం సాధించింది. వ్యాపార గుత్తాధిపత్యం, సైనిక రాజకీయం అధికారానికి ముప్పుగా వాదిస్తోంది.