Dec 01,2022 07:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయులకు బోధనేతర పనులను మినహాయింపు పేరిట ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న యాప్‌లను కొనసాగించడాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం ఇష్టారీతిగా రుద్దిన యాప్‌ల వల్ల ప్రతిరోజూ భారాన్ని మోయాల్సివస్తోందని, దానిని వదిలి పెట్టి పదేళ్లకోసారి వచ్చే 'జనగణన', ఐదేళ్లకోసారి వచ్చే 'ఎన్నికలు' నుంచి మినహాయింపు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. ఈ పనులకు మినహాయింపు ఇవ్వకపోతే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పాఠశాల విద్యలో ఉన్న యాప్‌లు ఏ శాఖలోనూ లేవు. బడికెళ్లగానే ముఖ ఆధారిత హాజరు నుండి విద్యార్థుల హాజరు, మానిటరింగ్‌, మధ్యాహ్నం భోజనం, నాడు-నేడు పనులు, కోడిగుడ్ల సైజులు చూసుకోవడం, బియ్యం లెక్కలు, మరుగుదొడ్లు ఫోటోలు తీయడం, జెవికె కిట్ల పంపిణీ వంటి పనులను అప్పగించింది. వీటికోసం 32 రకాల యాప్‌లను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ఇందులో 16 యాప్‌లలో ప్రతి రోజూ ఉపాధ్యాయుడు నమోదు చేయాలి. సర్వర్లు, నెట్‌వర్క్‌ సమస్య వల్ల యాప్‌లో సమాచారం నమోదు చేయని వారికి కూడా విద్యాశాఖ షోకాజ్‌ నోటీసు ఇస్తోంది. దీంతో బోధన కంటే యాప్‌లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • యాప్‌ల నుంచి మినహాయించండి

'వేసవి సెలవులు, తదితర కాలాల్లో నిర్వహించే ఎన్నికలు, జనగణన నిధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ప్రధానంగా బడిలో బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకు యాప్‌లతో బోధనేతర పనులను పాఠశాల విద్యాశాఖ రోజు ఉపాధ్యాయులకు అప్పగిస్తుంది. ఈ యాప్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలా కాకుండా ఎన్నికల వరకే మినహాయించడం సరైంది కాదు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో కేవలం రెండు రోజులు చేసే పనిమాత్రమే. బడిలో బోధనేతర పనుల నుంచి మినహాయిస్తేనే ఉపయోగం ఉంటుంది' .
- ఎన్‌ వెంకటేశ్వర్లు, యుటిఎఫ్‌ అధ్యక్షులు

 

  • యాప్‌లు వద్దు

'రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయులకు యాప్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాలి. పాఠశాలలో నిత్యం బోధనకు ఆటంకం కలిగించే బోధనేతర పనులు, మరుగుదొడ్ల ఫోటోలు వంటి యాప్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉంటుంది.'
- జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి, ఎపిటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు