Dec 01,2022 06:55

భారత దేశ పట్టణ, నగరాలపై ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేసి ఒక నివేదికను విడుదల చేసింది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణీకరణ, పట్టణ జనాభా అవసరాలను తీర్చటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటానికి రాబోయే 15 ఏళ్లలో కనీసం 840 బిలియన్‌ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొన్నది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రతి ఏడాది సగటున 55 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలని, ఇది దేశ స్ధూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 1.18 శాతానికి సమానమని చెప్పింది. పెరుగుతున్న జనాభాకు ప్రజలకు అందుతున్న సేవలకు మధ్య పెద్ద అగాధం ఉందని ఈ లోటును పూడ్చటానికి ప్రభుత్వం, స్థానిక సంస్థల దగ్గర తగిన నిధులు లేవని...అందువల్ల ప్రైవేట్‌ వ్యాపార, వాణిజ్య సంస్థల నుండి అప్పుల ద్వారా సమకూర్చుకోవాలని ఆదేశించింది. అలాగే మౌలిక సదుపాయాల కల్పనను ప్రైవేట్‌ రంగానికి అప్పజెప్పాలని అలాగే ప్రజలకు అందిస్తున్న పౌర సేవల నిర్వహణకు సరిపడా యూజర్‌ చార్జీలు వసూలు చేయాలనే ప్రమాదకర సిఫార్సులు చేసింది.
''భారతదేశ పట్టణ మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు మరియు వాణిజ్య పెట్టుబడులకు పరిమితులు తీసుకోవాల్సిన విధానపరమైన విధానాలు'' అనే పేరుతో ప్రపంచ బ్యాంకు నవంబర్‌ 14న నివేదిక విడుదల చేసింది. నివేదికలోని ముఖ్య అంశాలను పరిశీలిస్తే ప్రస్తుత దేశ పట్టణ జనాభా 47 కోట్లు ఉందని అది 2036 నాటికి 60 కోట్లకు చేరుతుందని ఇది దేశ జనాభాలో 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపింది. పెరుగుతున్న ఈ జనాభాకు అవసరమైన మున్సిపల్‌ సేవలైన మంచినీటి సరఫరా, మురుగునీటి కాలువలు, పారిశుధ్యం, రోడ్లు, స్మార్ట్‌ లైటింగ్‌, సామాజిక, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు 450 బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయి. మరో 300 బిలియన్‌ డాలర్లు మెట్రో, ప్రధాన రవాణా రహదారులు (మాస్‌ ట్రాన్సిట్‌) కు ఖర్చు చేయవలసి ఉంటుంది. మొత్తం పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో కాపిటల్‌ వ్యయానికి సగటున జిడిపి లో 0.6 శాతం నిధులు కావాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
దేశంలోని ప్రస్తుత పట్టణ స్థానిక సంస్థలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయగలిగిన పరిస్థితిలో లేవు. నేడు పట్టణ స్థానిక సంస్థలు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్న నిధుల్లో 75 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్నాయని, కేవలం 15 శాతం మాత్రమే స్థానిక సంస్థలు తమ సొంత ఆదాయాల నుండి సమకూర్చుకుంటున్నాయని నివేదిక చెప్పింది. ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయం కూడా చాలా నామమాత్రంగా ఉందని, అది కూడా ఎదుగుబొదుగు లేకుండా ఉందని, 2011-18 మధ్యకాలంలో చూస్తే కేవలం దేశ జిడిపి లో 0.15 శాతం మాత్రమే ఉందని వాపోయింది. అదే మధ్య తరహా ఆదాయ దేశాల్లో చూస్తే ఆ దేశాల జిడిపి లో 0.3 నుండి 0.6 శాతం మధ్య ఆస్తిపన్ను ద్వారా వచ్చే ఆదాయం ఉందని పేర్కొంది. తక్కువ ఆదాయాల వల్ల స్థానిక పట్టణ సంస్థలు దేశంలో అమలవుతున్న పట్టణ పథకాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాయి. ఉదాహరణకు గడిచిన ఆరేళ్లలో స్మార్ట్‌ సిటీ పథకం కింద 27 బిలియన్‌ డాలర్లు, అమృత పథకం కింద 10 బిలియన్‌ డాలర్లు విలువ గల ప్రాజెక్టులు ఆమోదించబడగా... వాటిలో వరుసగా కేవలం 22 శాతం, 18 శాతం మాత్రమే పూర్తి చేయగలిగాయని నివేదిక తెలిపింది. అలాగే పట్టణ స్థానిక సంస్థలు స్వల్ప ఆదాయానికే పరిమితమవ్వటం వల్ల రుణ సామర్ధ్యాన్ని కోల్పోతున్నాయని చెప్పింది.
దేశంలో పౌరసేవలకు అమలు చేస్తున్న యూజర్‌ చార్జీలు చాలా దారుణంగా ఉన్నాయని, సేవలకు నామమాత్రంగా రుసుములు వసూలు చేయాలనే విధానం పట్టణ స్థానిక సంస్థల ఆదాయానికి గండి కొడుతున్నదని, ఈ విధానం ప్రైవేట్‌ పెట్టుబడులను నిరుత్సాహ పరుస్తున్నదని, కనుక ఈ సంస్థల ఆర్థిక స్థిరత్వానికి తప్పనిసరిగా మౌలిక సదుపాయాలపై పెట్టిన ఖర్చును తిరిగి యూజర్‌ చార్జీల రూపంలో పూర్తిగా రాబట్టాలని ఆదేశించింది.
భారతదేశంలో గత రెండు దశాబ్దాల్లో పట్టణ రంగంలో అమలు చేసిన ప్రభుత్వ-ప్రైవేట్‌-భాగస్వామ్య (పిపిపి) పథకాలను కూడా సమీక్షించింది. 2000 సంవత్సరం నుండి నేటి వరకు కేవలం 5 బిలియన్‌ డాలర్లు విలువగలిగిన పిపిపి ప్రాజెక్టులు మాత్రమే అమలు జరగాయని, ఇవి చాలా నామమాత్రమని పేర్కొన్నది. అలాగే 2007-12 మధ్య కాలంలో పిపిపి ప్రాజెక్టులు గణనీయంగా పెరిగినప్పటికీ ఆ తరువాత బాగా తగ్గిపోయాయని ఆందోళన వెలిబుచ్చింది. 2000 సంవత్సరం నుండి ఆమోదించబడ్డ మొత్తం పిపిపి పెట్టుబడుల్లో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే ఆచరణ నోచుకుందని గత దశాబ్దంలో చూస్తే కేవలం 55 ప్రాజెక్టుల్లో 17 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి మాత్రమే పెట్టబడిందని తెలిపింది.
స్థూలంగా ప్రపంచ బ్యాంకు నివేదిక సిఫార్సు చేసిందేమంటే దేశ పట్టణ జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ, స్థానిక సంస్థలు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాయి కాబట్టి ఆ బాధ్యత నుండి వైదొలిగి ప్రైవేట్‌ సంస్థలపరం చేయాలని ఆదేశిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద నిధులు, గ్రాంట్లు కొరకు ఆధారపడకుండా ప్రైవేట్‌ వ్యాపార, వాణిజ్య సంస్థల నుండి సమకూర్చుకోవాలని సూచించింది.
ఆస్తి పన్ను పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలి. పౌరసేవలకు, మౌలిక సదుపాల కల్పనపై చేస్తున్న వ్యయాన్ని పూర్తిగా (కాస్ట్‌ రికవరీ) ప్రజల నుండి యూజర్‌ చార్జీల రూపంలో వసూలు చేయాలి. వీటి అమలుకు ఆటంకంగా ఉన్న విధానాలన్నింటిని మార్చేసి ప్రైవేట్‌ పెట్టుబడులకు స్వేచ్ఛ కల్పించాలని తెలిపింది.
భారత పట్టణ రంగంలో పాలకులు అమలు చేయాల్సిన విధానాల గురించి ప్రపంచ బ్యాంకు నివేదిక వెలువరించడం ఇదే మొదటిసారి కాదు. 1991లో ప్రారంభించబడ్డ సరళీకరణ విధానాల్లో భాగంగా అనేక నివేదికలను పట్టణ సంస్కరణల అమలుకు విడుదల చేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి పట్టణాభివృద్ధిలో దేశం అనుసరిస్తూ వస్తున్న విధానాలను మార్చి సైద్ధాంతికంగా ప్రైవేటీకరణ విధానాల వైపు పట్టణ వ్యవస్థను మార్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. 1994 లోనే ఇండో-యూఎస్‌ (ఫైర్‌-డి) అనే పథకాన్ని ప్రారంభించాయి. ప్రణాళికాసంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి మొదటి సారిగా 8వ పంచవర్ష ప్రణాళికలో పౌరసేవలకు కాస్ట్‌ రికవరీ విధానాన్ని ప్రవేశపెట్టించింది. ఆ తరువాత ప్రతి ప్రణాళిక లోను వివిధ రూపాల్లో పట్టణ సంస్కరణల అమలుకు చేపట్టాల్సిన చర్యలను ప్రవేశపెట్టబడ్డాయి. 2004, 2009లో కూడా ప్రపంచ బ్యాంకు పట్టణ రంగంలో భారత్‌ అనుసరించాల్సిన సంస్కరణలపై ప్రత్యేక నివేదికలు ఇచ్చింది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పెట్టుబడులు, విద్యుత్‌, రహదారులు, నీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో దేశంలోను, వివిధ రాష్ట్రాల్లోను, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లోను అమలు చేయాల్సిన విధానాల గురించి అనేక నివేదికలు ప్రపంచ బ్యాంకు గతంలో ఇచ్చింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పట్టణ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఈ సంస్కరణల అమలుకు గ్రాంట్లు, రుణాలు ప్రపంచ బ్యాంకు ఇస్తుంది. ఇప్పుడు దేశంలో చాలా నగరాలు, పట్టణాల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఇవన్నీ సంస్కరణలతో ముడిపెట్టినవే. గతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ పట్టణ ఆధునీకరణ మిషన్‌ (జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం)కు ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసింది. నిధులిచ్చి ఈ పథకం ద్వారా దేశంలోని 63 నగరాల్లో అనేక సంస్కరణలు అమలు చేయించింది.
మున్సిపల్‌ సంస్థలకు నిధుల కోసం 2003లో ప్రత్యేకంగా అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. 2006లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రాంట్లను, పూల్డ్‌ మున్సిపల్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలను ప్రవేశపెట్టింది. ఇలా అనేక రకాల ఏజెన్సీల ద్వారా ప్రపంచ బ్యాంకు భారత పట్టణ వ్యవస్థలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నది.
ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. పట్టణ రంగంలో అనుసరిస్తున్న విధానాలను మార్చేస్తున్నాయి. గడిచిన రెండు దశాబ్దాలలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలన్నీ ప్రపంచబ్యాంకు సూచించిన విధానాలను ముందుకు తీసుకెళ్ళేందుకు అనేక సిఫార్సులు చేసాయి. గతంలో కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ నియమించిన హైపవర్‌ కమిటీ కూడా నేడు ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొన్న అంశాలనే సూచించింది. 2012-30 కాలంలో సుమారు రూ. 39.2 లక్షల కోట్లు పెట్టుబడులు పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమని హైపవర్‌ కమిటి తన నివేదికలో పేర్కొంది. ఈ స్థాయిలో నిధులను స్థానిక, పట్టణ సంస్థలు సమకూర్చుకోలేవు కాబట్టి మౌలిక సేవల కల్పనను ప్రైవేట్‌ రంగానికి ఇవ్వాలని, పట్టణ సంస్థలు తమ పరిధిలో ఆదాయాలు పెంచుకోవటానికి పన్ను, పన్నేతర ఆదాయాల సంస్కరణలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఇటీవల నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ 2025 నాటికి మన దేశ పట్టణ వ్యవస్థ అభివృద్ధికి రూ.19 లక్షల కోట్లు అవసరమని, అందుకు కొత్తగా చేపట్టే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇప్పటికే ఉన్న పౌర సేవలు, మౌలిక సదుపాయాలను పిపిపి, ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇటీవల రిజర్వుబ్యాంకు (ఆర్‌.బి.ఐ) విడుదల చేసిన నివేదిక కూడా స్థానిక మున్సిపల్‌ సంస్థలు ప్రైవేట్‌ వాణిజ్య సంస్థల నుండి అప్పుల ద్వారా, బాండ్లు ద్వారా ఆదాయాలు సమకూర్చుకోవాలని తెలిపింది.
మొత్తంగా భారతదేశంలో పట్టణ సంస్కరణలను వేగంగా అమలు చేయడం కోసం రకరకాల పేర్లతో ప్రపంచబ్యాంకు ఆదేశాలతో నివేదికలు రూపొందించబడుతున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేట్‌ పెట్టుబడులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ పట్టణ విధానాలను మార్చేస్తున్నది. నీతి ఆయోగ్‌ ఈ విధానాల అమలుకు ప్రత్యక్ష పర్యవేక్షణ ప్రపంచ బ్యాంకుతో కలిసి చేస్తున్నది. రాబోయే కాలంలో పట్టణ పరిపాలనా వ్యవస్థపై మున్సిపల్‌ కౌన్సిల్‌ పాత్ర పూర్తిగా నామమాత్రం అవుతుంది. పౌరసేవలు, మౌలిక సదుపాయాలు, ఉమ్మడి ఆస్తులన్నీ ప్రైవేట్‌ పెట్టుబడికి బదిలీ అవుతాయి. మున్సిపల్‌ సంస్థలు ప్రైవేట్‌ కంపెనీల వలె అప్పులు సమకూర్చుకుంటూ, లాభ-నష్టాల ప్రాతిపదికన నడపబడతాయి. ప్రజలపై విభిన్న రూపాల్లో పన్నుల భారాలు మోపబడతాయి.

taxes-on-urban-citizens-world-bank-report-bjp-govt-article-by-gangarao

 

 

 

 

వ్యాసకర్త : డా|| బి.గంగారావు, 9490098792