
19న మరో అల్పపీడనం
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇటీవల తుపాను కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. అల్పపీడనం బలపడి భారీ వర్షాలు, వరద కొనసాగితే తీవ్ర నష్టం తప్పదని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వారం రోజులుగా జిల్లాను వర్షాలు వీడటం లేదు. శుక్రవారం కూడా రాజమహేంద్రవరం సహా ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు అనేక గ్రామాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఏలేరు వరదలతో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, తుని నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. జాతీయ రహదారులపై సైతం వరద నీరు ప్రవహిస్తుండగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 644 గ్రామాల్లో లక్ష ఎకరాలకుపైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు నీటముని గినట్లు అధికారులు తాత్కాలికంగా అంచనా వేశారు. అయినప్పటికీ ముంపు ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఈ వరదలకు దాదాపు రూ.100 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. లెక్కలు తేలాక నష్టం మరింతగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకినాడ, రాజమహేంద్రవరం, గొల్లప్రోలు, పిఠాపురం, రామచంద్రపురం, మండపేట తదితర పట్టణ ప్రాంతాల్లో సైతం వరద నీరొచ్చి చేరింది. దీంతో బాధిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడవలపై ప్రయాణాలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఇళ్లల్లోకి మోకాల్లోతు నీరు చేరడంతో వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ఆవాసాల్లోకి వరద నీరు ముంచెత్తడంతో వేలాది నివాస గృహాలు నీటిలోనే నానుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఇళ్లు కూలిపోగా చాలా ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 28 మండలాలు వరద ప్రభావానికి గురవగా, 61 కచ్చా ఇళ్లు పూర్తిగా పాడయ్యాయి. ఏడు పక్కా ఇళ్లకు, 40 కచ్చా ఇళ్లు తీవ్రంగానూ, 232 ఇళ్లకు పాక్షికంగానూ నష్టం వాటిల్లిందని లెక్కలు తేల్చారు. 117 పూరిళ్లు దెబ్బతిన్నాయన్నారు. ఇదిలా ఉండగా మరో ముప్పు తరుముకొస్తోందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో రైతులు తీవ్రంగా కలవరపడుతున్నారు. మిగిలిన పంటలు కూడా నష్టపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.