
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి గురువారానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది వాయవ్య దిశగా కదులుతోంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాంల్లో రాబోవు రెండు రోజుల వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురవనున్నాయి. తీవ్ర వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటలలో తుపాను తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తీరంలోని మోంగ్లా, ఖెపుపరా మధ్య గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈ నెల 18 తెల్లవారుజామున తీరాన్ని దాటనుందని అధికారులు అంచనా వేశారు. రెండు రోజులపాటు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.