Jan 09,2021 07:10

పౌర స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం గురించి ప్రపంచ దేశాలకు నీతులు చెప్పే అమెరికా నేడు సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. ప్రజలిచ్చిన తీర్పును వమ్ము చేసేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుచర మూకలు బాహాటంగా తిరగబడిన తీరు యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. కేపిటల్‌ హిల్స్‌ పైకి దండెత్తి ట్రంప్‌ కిరాయి మూకలు సృష్టించిన బీభత్సం ప్రపంచంలో ఇప్పటి వరకూ జరిగిన ఏ ఉగ్రవాద దాడికీ తీసిపోదు. అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలు సంయుక్తంగా సమావేశమవుతున్న వేళ జరిగిన ఈ దాడి పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోంది. మూకల చేష్టలను అభినందిస్తూ ట్రంప్‌ ఇచ్చిన సందేశాలే దీనికి నిదర్శనం. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్‌ సాగించిన గోబెల్స్‌ ప్రచారం కేపిటల్‌ హిల్స్‌పై దాడితో హింసాత్మక రూపు దాల్చింది. ఇంతటి దురాగతానికి ఒడిగట్టిన ట్రంప్‌ను అభిశంసించాల్సిందేనని, ఎన్నికల్లో తిరిగి పోటీ చేయకుండా ఆయనపై జీవిత కాల నిషేధాన్ని విధించాల్సిందేనని అమెరికన్లు డిమాండ్‌ చేస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.
మన దేశంలో సంఫ్‌ు పరివార్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మితవాద శక్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ట్రంప్‌ నిలిచారంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి దురహంకార నేత నేతృత్వంలో ఇంతకంటే గొప్పగా ఒరగబెట్టే కార్యాలేముంటాయి? అమెరికా అధ్యక్ష ఎన్నికలు - 2020 ప్రక్రియ మొదలైన నాటి నుంచే ఓటమి భయం పట్టుకున్న ట్రంప్‌ తన తెంపరితనాన్ని చాటుతూనే వస్తున్నారు. గురువారం జరిగిన అరాచక ఘటనలు దీనికి పరాకాష్ట. ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా చరిత్రలో డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనాకాలం ఆసాంతం చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఇస్లామిక్‌ దేశాల ప్రజలను అమెరికాలో అడుగు పెట్టనీయకుండా నిషేధించడం, ఆసియా దేశాలకు వీసాలను కుదించడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలతో అధికార పీఠమెక్కిన తొలి నాళ్లలోనే జాతి విద్వేష జాఢ్యంతో బుసలుకొట్టిన ట్రంప్‌ ఆ పీఠం నుంచి తనను లాగిపడేసే వరకూ అదే వికృతాన్ని చాటుతుండటం అతని ఫాసిస్టు చేష్టలకు తార్కాణం.
అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్‌ ఎన్నికను కాంగ్రెస్‌ ధ్రువీకరించినందున ఆయన ప్రమాణస్వీకారోత్సవం ఈ నెల 20న జరగనుంది. అంటే అప్పటి వరకూ అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ కొనసాగుతారు. ఈ పది రోజులూ ట్రంప్‌ ఇంకెన్ని వికృత చేష్టలకు పాల్పడతాడో చెప్పలేం. అధికార పీఠాన్ని వీడి వెళ్తున్న ఒక అధ్యక్షుడు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం అమెరికా చరిత్రలోనూ, ప్రజాస్వామ్య దేశాల చరిత్రలోనూ అసాధారణం. విశాల ప్రజా మద్దతుతో అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్న బైడెన్‌కు రానున్న కాలం పూల పాన్పేమీ కాదు. దాదాపు రెండు నెలల పాటు సోషల్‌ మీడియాలో ట్రంప్‌ సాగించిన విద్వేష ప్రచారం, వికృత చేష్టల వల్ల అమెరికా సమాజం రెండుగా చీలిపోయింది. బైడెన్‌ చెప్పినట్టు 'ప్రజాస్వామ్య ఆత్మ'పై జరిగిన అనూహ్య దాడితో ఈ విచ్ఛిన్నకర రాజకీయాలు మరింతగా ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా సమాజాన్ని ఒక్క తాటి పైకి తేవడం అంత తేలికేమీ కాదు. ట్రంప్‌ దుష్ట పాలనకు అమెరికన్లు ఇప్పటికే మూల్యం చెల్లించారు. శ్వేతజాతి మధ్యతరగతి ప్రజానీకంతో పాటు మధ్యతరగతి ప్రజలందరిలో, చిరు ఉద్యోగులు, కార్మికుల్లోనూ అసంతృప్తి పేరుకుపోయింది.
కేపిటల్‌ హిల్స్‌పై దాడికి పాల్పడినవారినీ, అందుకు పురిగొల్పిన వారినీ కఠినంగా శిక్షించాలి. అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థ కలిగిన అమెరికాలో దోషులను గుర్తించడం కష్టం కాదు. దోషులపైన కఠిన శిక్షలు విధించడం ద్వారానే అమెరికా ప్రజలకు, అలాగే యావత్‌ ప్రపంచానికి సరైన సందేశం అందుతుంది.