ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : టైక్వాండో సాధన చేయడం వలన శారీరక దృఢత్వం, ఆరోగ్యం, ఆత్మ రక్షణతో పాటు మానసిక వికాసం కూడా లభిస్తుందని ప్రముఖ వైద్యులు శ్రీకృష్ణ, వినయ, అన్నమాచార్య కళాశాల అధ్యాపకులు చిన్నబాబులు తెలియజేశారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో అన్నమయ్య టైక్వాండో అకాడమీ సీనియర్ మాస్టర్ సగినాల పిచ్చయ్య ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైద్యులు శ్రీకృష్ణ, వినయ, అన్నమాచార్య కళాశాల అధ్యాపకులు చిన్న బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ సాధన వలన మెదడు చురుకుగా పని చేస్తుందని, తద్వారా చదువులో కూడా రాణించగలుగుతారని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు టైక్వాండోలో శిక్షణ పొందిన సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ పిచ్చయ్య, శిక్షకుడు జాహిద్ అలీ, అథ్లెటిక్ కోచ్ హరికృష్ణ మారాజు, తల్లిదండ్రులు, క్రీడాకారులు పాల్గొన్నారు.










