ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా అద్దంకిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..అద్దంకిలోని గరటయ్య కాలనీలో ఎస్‌సి సామాజిక తరగతికి చెందిన బత్తుల కృష్ణారావు కుమారుడు పెద్దిరాజు(22) అద్దంకిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. స్థానిక పోస్టాఫీస్ పక్క బజారులో నివాసముంటున్న పి.ప్రశాంతి(20) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమెది బలిజ సామాజికతరగతి. పెద్దిరాజు, ప్రశాంతి ఇద్దరూ రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని పెద్దలను అడ్డగా వారు నిరాకరించారు. కులాలు వేరు కావడంతో వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. కలిసి ఎలాగూ బతకలేమని.. కలిసైనా చనిపోదామని ఇద్దరూ నిర్ణయించుకొని కాకానికుంట వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రేమికులిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.










