కొలంబొ : శ్రీలంకలో పరిశోధనా నౌకను నిలిపేందుకు అనుమతించాలన్న చైనా అభ్యర్థనను పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఏడాది అనంతరం చైనా నౌక శ్రీలంకలో ప్రవేశిస్తుండటంపై భారత్ ఆందోళనలు లేవనెత్తింది. షి యాన్-6ను శ్రీలంకలో నిలిపేందుకు ఇక్కడ ఉన్న చైనా రాయబార కార్యాలయం దరఖాస్తు చేసిందని శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ప్రియాంగ్ విక్రమ సింఘే పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను పరిశీలిస్తున్నామని అన్నారు. తేదీలను ఇంకా ఖరారు చేయలేదని ఆమె పేర్కొన్నారు. చైనా పరిశోధనా నౌక షియాన్ -6 సముద్రపరిశోధన కార్యకలాపాల కోసం అక్టోబర్‌లో శ్రీలంక చేరుకోనుందని అన్నారు.
చైనాకు చెందిన సిజిటిఎస్ ప్రకారం.. షియాన్ -6ని 1115 డిడబ్ల్యుటి మోసుకెళ్లే సామర్థ్యంతో కూడిన పరిశోధన, సర్వే ఓడగా పేర్కొంది. ఈ నౌక మొత్తం 90.6 మీటర్లు ఉండగా, 5.3 మీటర్ల పొడవు, 17.3 మీటర్ల వెడల్పుతో ఉన్నట్లు తెలిపింది. ఈ నౌకలో సుమారు 60 మంది సిబ్బంది ఉంటారు. ఓషనోగ్రఫీ, సముద్ర గర్భ పరిశోధనలు చేస్తుంది. గతేడాది శ్రీలంకలోని హంబన్‌టోట రేవులో చైనాకు చెందిన యువాన్ వాంగ్-5 నౌకకు లంగరేసిన సంగతి తెలిసిందే.