Sep 21,2023 13:44

ప్రజాశక్తి-విజయనగరం కోట : సీతం క‌ళాశాల వేదిక‌గా ప్రారంభ‌మైన వివిధ‌ కార్య‌క్ర‌మాలు భాగస్వామ్య‌మైన యువ‌త‌, జిల్లా స్థాయి అధికారులు, ఇత‌ర అధికారులు, 2023-24 ఏడాది విజ‌య‌న‌గ‌రం జిల్లా యువ‌జనోత్స‌వాలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా జ‌రిగాయి. స్థానిక సీతం క‌ళాశాల వేదిక‌గా ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో ఉత్స‌వాలు గురువారం ఉద‌యం ప్రారంభ‌మ‌య్యాయి. సెట్విజ్, నెహ్రూ యువ కేంద్ర‌, సీతం క‌ళాశాల సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన యువ‌జ‌నోత్స‌వాలు ఆద్యంతం ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణంలో సాగాయి. జిల్లాలోని వివిధ క‌ళాశాల‌ల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు హాజ‌రై వివిధ పోటీలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యమ‌య్యారు. సాంస్కృతిక క‌ళా వైభవం, జీవిత నైపుణ్యం, శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యం ప్రాధాన్య‌త‌ను తెలుపుతూ వివిధ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. సెట్విజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో సుమారు 15 ర‌కాల క్రీడాంశాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వ‌హించ‌గా యువ‌త అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా యువ‌జ‌నోత్స‌వ కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వాన్ని స్థానిక సీతం కళాశాల‌లో వివిధ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో సెట్విజ్, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ‌, సీతం క‌ళాశాల యాజ‌మ‌న్యాం వేడుక‌గా నిర్వ‌హించాయి. సెట్విజ్ సీఈవో బి. రామ‌గోపాల్, జిల్లా యువ‌జ‌న అధికారి వెంక‌ట్ ఉజ్వ‌ల్, జిల్లా క‌బ‌డ్డీ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఈశ్వ‌ర్ కౌశిక్, సీతం క‌ళాశాల డైరెక్ట‌ర్ ఎం. శ‌శిభూష‌ణ్ రావు, ప్రిన్సిపాల్ ర‌మ‌ణ మూర్తి, బ్ర‌హ్మ కుమారి అన్న‌పూర్ణ‌, మెప్మా పీడీ సుధాక‌ర్, స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ అధికారి గోవింద‌రావు, అడ‌ల్ట్ ఎడ్యుకేష‌న్ డీడీ సోమేశ్వ‌ర‌రావు, సంగీత క‌ళాశాల అధ్యాప‌కురాలు బిందు త‌దిత‌రులు పాల్గొని జ్వోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి, స్వామి వివేకానంద‌, గుర‌జాడ చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి యువ‌జ‌నోత్స‌వాల‌ను ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథులంతా యువ‌త‌ను ఉద్దేశించి మాట్లాడారు. బ‌లమైన ల‌క్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధ‌న కోసం నిరంత‌రం త‌పించాల‌ని, శారీర‌క‌, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు. ఆశ‌య సాధ‌న కోసం అకుంఠిత దీక్ష‌, ఏకాగ్ర‌త చాలా అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. పోటీత‌త్వం అల‌వ‌ర్చుకోవాల‌ని, మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాల‌ని హిత‌వు ప‌లికారు. ఆర్థిక‌, రాజ‌కీయ, సామాజిక చైత‌న్యం పొంద‌డానికి అవ‌స‌ర‌మైన జ్ఞానాన్ని సంపాదించుకోవాల‌ని, క్ర‌మ శిక్ష‌ణ‌తో కూడిన జీవితాన్ని అల‌వ‌ర్చుకోవాల‌ని సూచించారు. మంచి ప‌నుల‌ కోసం యువ‌త త‌మ శ‌క్తిని, జ్ఞానాన్ని ఉప‌యోగించాల‌ని, చెడుకు దూరంగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు.అనంత‌రం 15 ర‌కాల క్రీడాంశాల్లో వివిధ పోటీలు నిర్వ‌హించారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల ఆధ్వ‌ర్యంలో వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచారు. అలాగే విద్యార్థులు చేసిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆహుతుల‌ను అల‌రించాయి. సీతం క‌ళాశాల అధ్యాప‌కులు, సెట్విజ్, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు