వాషింగ్టన్ : ఎలన్ మస్క్ మరో బాంబు పేల్చారు. గతేడాది ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి మస్క్ భారీ మార్పులు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ లోగో నుండి పక్షి మాయం కానున్నట్లు తెలిపారు. లోగో మార్పు విషయాన్ని ఆయన ఆదివారం ట్వటర్‌లో వెల్లడించారు. ''త్వరలోనే మేం ట్విటర్ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన X లోగో బాగుంటే.. రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుంది'' అని ట్వీట్ చేశారు. మస్క్ ట్విటర్‌ను గతేడాది కొనుగోలు చేసిన నాటి నుంచి ఇదే అతిపెద్ద మార్పుగా నిలవనుంది. ట్విటర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన 'ఎక్స్ కార్ప్' అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు గతేడాది అక్టోబర్ లో మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మస్క్‌కు ఎక్స్ అనే అక్షరం అంటే విపరీతమైన ఇష్టం. ఈ విషయం కొత్తగా తెలిసిందేమీ కాదు. ట్విటర్ సీఈవోగా లిండా యాకరినో బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా కంపెనీని ఎవ్రీ థింగ్ యాప్ ఎక్స్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇక ట్విటర్‌లోని అన్ వెరిఫైడ్ ఖాతాల నుంచి ప్రత్యక్ష సందేశాలు ఉంచడాన్ని పరిమితం చేస్తున్నట్లు శనివారం మస్క్ ప్రకటించారు. ''డైరెక్ట్ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అన్‌వెరిఫైడ్ ఖాతాల నుండి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డీఎం (డైరెక్ట్ మెసేజ్)లు చేయగలరు. నేడే సబస్క్రైబ్ చేసుకొని ఎక్కువ మెసేజ్‌లు పంపండి'' అని ట్విటర్ పేర్కొంది. ఈ ఏప్రిల్‌లో పక్షి లోగో స్థానంలో డాగ్ కాయిన్‌ను పోస్ట్ చేశారు. ఈ మార్పుతో మార్కెట్ విలువకు 4 బిలియన్ డాలర్లు ఆదాయం తెచ్చేందుకు సహాయపడింది. అయితే రెండు రోజులకు తిరిగి పక్షిలోగోను మారుస్తున్నట్లు ప్రకటించారు.










