
ఏలూరు మున్సిపల్ పట్టణంలో ఇంటింటికి వెళ్లిన సి.పి.ఎం కార్యకర్తలకు...ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రస్తుత ఏలూరు జిల్లాకు జిల్లా కేంద్రంగా ఉన్న హేలాపురి (ఏలూరు) పట్టణంలో 3 లక్షల 50 వేల పైగా జనాభా నివశిస్తున్నారు.
ఏలూరు లోని 100 మురికి వాడలలో 2 లక్షలకు పైగా జనాభా నివశిస్తున్నారు. మురికివాడల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు లేవు. మంచి నీరు సైతం అందటం లేదు. కొత్తూరు, మాదేపల్లి, కొమడవోలు, పోనంగి ఇందిరమ్మ కాలనీల్లో దాదాపు 10 వేల కుటుంబాలు నివశిస్తున్నా కనీసం పిల్లలకు స్కూళ్లు, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేవు. ఆఖరికి మృతదేహాలను ఖననం చేయడానికి శ్మశానవాటిక అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటు. వర్షాలు కురిస్తే రహదారులన్నీ మోకాలు లోతు నీళ్లలో ఉంటాయి.
ఏలూరు పట్టణం 1 టౌన్ మొత్తాన్ని ఆనుకొని ఉన్న వెంకటాపురం పంచాయితీలో దాదాపు 40 వేల మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరికి తాగటానికి మంచి నీరు లభించడంలేదు. సుద్ద (సున్నం) కలిసిన నీరు లభిస్తుంది. ఇది తాగటానికే కాదు, బట్టలు ఉతకడానికి, వంట పాత్రలు కడగడానికి కూడా ఉపయోగపడటం లేదు. 4,5 కి.మీ దూరం వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సి వస్తున్నది.
టిడిపి ప్రభుత్వం 2019 ఎన్నికలు ముందు హడావిడిగా సింగిల్, డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తామంటూ టిడ్కో అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. దానికి ప్రజల నుండి రూ.25 వేలు నుండి లక్ష రూపాయలు వరకు కట్టించుకున్నారు. వైసిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు అప్పగించడం లేదు. కొత్తగా జగనన్న కాలనీలు అంటూ ఆర్భాటంగా ప్రారంభించారు. ఇందుకోసం ఊరికి 10 కి.మీ దూరంలో స్థలాలు సేకరించారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కేవలం రూ. లక్షా ఎనభై వేలు మాత్రమే ఇస్తుంది. అది కూడా మూడు దఫాలుగా. లబ్ధిదారులకు 6,7 లక్షల రూపాయలు వరకు ఖర్చవుతుండటంతో ఇళ్ళు నిర్మించుకోలేకపోతున్నారు.
ఏలూరులో ప్రజలు నివశించే మూడు వంతుల భాగంలో తమ్మిలేరు ప్రవహి స్తుంది. ప్రతి ఏటా ఏటి గట్టు ఆనుకొని ఉన్న ఇళ్ళలోకి నీరు వచ్చి ముంపుకు గురవుతుంది. వారికి రక్షణగా తలపెట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.
జిల్లా కేంద్రం పెద్ద ఆసుపత్రి (ప్రభుత్వ ఆసుపత్రి)కి ఏలూరు నుండే కాకుండా జిల్లా నలు మూలల నుండి రోజుకు 2 వేల మంది రోగులు వస్తారు. రోగులకు సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది, పరికరాలు లేవు. రోగుల అవసరాలకు కావలసిన వైద్య సిబ్బందిలో 40 శాతం కొరతగా ఉంది. దానితో ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజ్‌గా ప్రకటించి...ఇప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు సార్లు శిలాఫలకాలు పాతారే కాని ఇంతవరకు మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదు.
కరోనా వల్ల పట్టణంలో ప్రజలు రెండేళ్లగా ఉపాధి లేక ఆదాయాలు కోల్పోయారు. అప్పులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, దానికితోడు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు...రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరంటు చార్జీలు, బస్సు చార్జీలు, ఆస్థి పన్ను, ఇంటి పన్ను, చెత్త పన్నులు మోయలేని విధంగా ఉన్నాయని ప్రతి చోట ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారు.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిని పెంచడం కోసం చుట్టు పక్కల ఉన్న 7 గ్రామాలను మున్సిపాల్టీలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి దొరికేది. ఇప్పుడు పట్టణంలో కలవడంతో ఆ అవకాశం పోయింది. ఈ గ్రామాల్లో దాదాపు 5 వేల మందికి చేద్దామంటే పని దొరకటంలేదు. మాకు చేసుకోవడానికి ఏదైనా పని చూపించండంటూ వేడుకొంటున్నారు. జిల్లాకే పెద్ద పరిశ్రమ ఏలూరు జూట్ మిల్ మాతపడి 3 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోవడంతో ఆ ప్రభావం వల్ల పట్టణంలో 40 శాతం వ్యాపారాలు పడిపోయాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.
బ్రిటీషు హయాంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. ఇప్పటికీ ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం సిగ్గుచేటు. విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల అనేక ఉద్యమాల తరువాత మొత్తానికి 10 ఏళ్ల క్రితం డిగ్రీ కాలేజ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వెంటనే నిర్మించాలని విద్యార్ధులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లా కేంద్రమైన ఏలూరు పట్టణంలోనే ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే...ఇక గ్రామాల్లో ప్రజల సమస్యలు వర్ణనాతీతమే. దీనికి పాలక పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. ఇప్పటికైనా పాలకులు ప్రణాళికాబద్దంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి.
వ్యాసకర్త : సి.పి.ఎం నగర కార్యదర్శి, ఏలూరు పి. కిషోర్