Nov 16,2023 08:27
  • ఆసుపత్రులకు అందని ఇంధనం

ఐక్యరాజ్య సమితి : నాలుగుసార్లు విఫలయత్నాల తర్వాత, ఐదవసారైనా ఇజ్రాయిల్‌ దాడులపై తీర్మానం చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రయత్నిస్తోంది. తీర్మానంలో ఉపయోగించాల్సిన భాషపై ఏకాభిప్రాయం రావడానికి తీవ్రంగా వున్న విభేదాలను అధిగమిస్తారా లేదా అన్నది చూడాల్సి వుంది. అవసరంలో వున్నవారికి సాయం అందించేందుకు వీలుగా గాజా వ్యాప్తంగా మానవతా కారిడార్‌లను తక్షణమే అనుమతించాలని ప్రస్తుత ముసాయిదా తీర్మానం కోరుతోంది. పౌరుల రక్షణ కోసం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అన్ని పక్షాలు అమలు చేయాలని కోరుతోంది. పిల్లలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, బందీలుగా పట్టుకోవడాన్ని నిషేధించాలని కోరుతోంది. దీనిపై చర్చ జరుగుతోంది. భద్రతా మండలి సభ్య దేశమైన మాల్టా ఈ ముసాయిదాను ప్రతిపాదించింది. కాల్పుల విరమణ గురించి ముసాయిదా అస్సలు ప్రస్తావించలేదు. ఇజ్రాయిల్‌ మారణహోమం గురించి పేర్కొనలేదు. గతంలో నాలుగుసార్లు తీర్మానం ఆమోదించేందుకు ప్రయత్నించినా వీగిపోయాయి. ఇదిలావుండగా, హమాస్‌ విధ్వంసమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు పునరుద్ఘాటించారు. హమస్‌కు గాజాలో ఎలాంటి స్థావరాలు, ఆశ్రయాలు వుండరాదన్నారు.

  • అల్‌షిఫా ఆస్పత్రి వద్ద బాంబుల మోత

అల్‌షిఫా ఆస్పత్రిలో గంటల తరబడి సాగుతున్న కాల్పులు, బాంబుల మోతలతో రోగులు భీతిల్లుతున్నారని డాక్టర్లు పేర్కొన్నారు. మరికొద్ది గంటల్లో టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన చెందుతున్నారు.

  • గాజాలోకి మొదటి ఇంధన ట్రక్కు

ఇజ్రాయిల్‌ ఆంక్షలు అమలవుతున్న తర్వాత మొదటిసారిగా ఇంధన ట్రక్కు గాజాలోకి ప్రవేశించింది. ఇది ఆస్పత్రుల కోసం కాదు. ఐక్యరాజ్య సమితి సహాయ ట్రక్కుల కోసం మాత్రమే ఉద్దేశించింది. రాఫా సరిహద్దు క్రాసింగ్‌ ద్వారా బుధవారం గాజాలోకి డీజిల్‌ ట్రక్కు వచ్చింది. ఇది తమ అవసరాలకు సరిపోదని ఐక్యరాజ్య సమితి సహాయక చర్యల సంస్థ తెలిపింది. ఈజిప్ట్‌ నుండి సగం ట్యాంకర్‌ మాత్రమే వచ్చిందని, రాఫా నుండి రవాణా చేసే సహాయానికి మాత్రమే వాడాల్సిందిగా ఇజ్రాయిల్‌ ఆంక్షలు విధించిందని చెప్పారు.

  • ఆస్పత్రులు కదన రంగాలు కాదు : డబ్ల్యుహెచ్‌ఒ

ఆస్పత్రులనేవి కదన రంగాలు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది. ఆస్పత్రుల్లోని రోగులు, సిబ్బంది భద్రతపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అదనామ్‌ చెప్పారు. యుద్ధాలు, ఘర్షణలు ఎంత తీవ్రంగా సాగుతున్నా ఆరోగ్య వసతులు, ఆరోగ్య కార్యకత్రలు, అంబులెన్సులు, రోగులపై వాటి ప్రభావం వుండరాదని, వాటిని కాపాడటం మన బాధ్యత అన్నారు.