Sep 19,2023 10:57

ప్రజాశక్తి-బొబ్బిలి : విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న బైక్ ర్యాలీను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు కోరారు. బైక్ ర్యాలీ గోడపత్రికలను మంగళవారం సిఐటియు కార్యాలయంలో విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. ప్రాణ త్యాగాలు, పోరాటంతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రంలో బీజేపీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని, పరిశ్రమ నిర్వహణకు రూ.5వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 20న విశాఖ గాంధీ బొమ్మ వద్ద బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుందని, ఈనెల 24న ఆదివారం సాయంత్రం 5గంటలకు బొబ్బిలి వస్తుందన్నారు. ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద బైక్ ర్యాలీకు స్వాగతం పలికి ర్యాలీగా తాండ్రపాపరాయ విగ్రహం జంక్షన్ కు చేరుకుని సభ నిర్వహిస్తామని చెప్పారు. బైక్ ర్యాలీను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి మండల కార్యదర్శులు ఎస్.గోపాలం, బి.శ్రీనివాసరావు, ఎ. సురేష్ ఉన్నారు.