Dec 13,2020 11:59

కావాల్సిన పదార్థాలు : గోధుమపిండి- రెండు కప్పులు, ఉప్పు- రుచికి సరిపడా, వాము- టేబుల్‌ స్పూన్‌ (చేతిలో నలుపుకుని వేసుకోవాలి), కారం పొడి- టేబుల్‌స్పూన్‌, తెల్లనువ్వులు- రెండు టేబుల్‌స్పూన్స్‌, జీలకర్ర- టేబుల్‌స్పూన్‌, పసుపు- పావు టేబుల్‌స్పూన్‌, నెయ్యి, నూనె లేదా వెన్న-నాలుగు టేబుల్‌స్పూన్స్‌.
                                                          తయారుచేసే విధానం :
        ముందుగా ఒక గిన్నె తీసుకొని, అందులో గోధుమపిండితో పాటు అన్ని పదార్థాలను వేసి కలుపుకోవాలి. అందులోనే రెండు టేబుల్‌స్పూన్‌ల నెయ్యి, నూనె, వెన్న ఏది అందుబాటులో ఉంటే దానిని వేసుకోవాలి.
కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ పూరీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని, ఒకసారి పిండికి రాసి పది నిమిషాలు నాననివ్వాలి. తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి.
      చిన్న బౌల్‌ తీసుకుని రెండు టేబుల్‌స్పూన్‌ల గోధుమపిండిని వేసుకోవాలి. అందులోనే నెయ్యి, నూనె లేదా వెన్న వేసుకోవచ్చు. వెన్న అయితే కరిగించి వేసుకోవాలి. తర్వాత బాగా కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
       ఇప్పుడు పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, చపాతీలాగా ఒత్తుకోవాలి. మధ్యమధ్యలో పిండి చల్లుకుంటూ ఎంత పలుచగా ఒత్తుకోగలిగితే అంత మంచిది.
        ముందుగా మనం బౌల్‌లో కలిపి పెట్టుకున్న నెయ్యి, గోధుమపిండి పేస్ట్‌ను చపాతీ మొత్తానికి పలుచగా పట్టించాలి. తర్వాత చపాతీని రోల్‌ చేసుకోవాలి. చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
         ఒక్కొక్క ముక్కను తీసుకుని పలుచటి చపాతీలాగా ఒత్తుకోవాలి. రెడీగా ఉన్న గోధుమపిండి, నెయ్యి కలిపిన పేస్ట్‌ను చిన్న చపాతీ మొత్తానికి పలుచగా పట్టించాలి. దానిని సగానికి మడత పెట్టాలి. తర్వాత దానిమీద మరలా పేస్ట్‌ను పట్టించాలి. మరలా సగానికి మడత వేయాలి.
          ఒక ఫోర్క్‌ తీసుకుని మడత వేసిన చపాతీ మీద చిన్న గీతలు గీయాలి.
          ఒక పాన్‌ తీసుకుని అందులో నూనెవేసి బాగా కాగాక, మీడియం మంట పెట్టుకుని ఒక్కొక్కటిగా అందులో వేయాలి. బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించి, తీసేసుకుంటే సరిపోతుంది.