జ్ఞానం అనేది దిగువ స్థాయి నుంచి పై స్థాయికి నిరంతరం మార్పు చెందుతూ పురోగమించే ప్రక్రియ. నిన్నటి కంటే నేడు మరింత కొత్త జ్ఞానం సమకూరుతూ వుంటుంది. మనకు తెలిసినదే సమస్తం అని, అదే సంపూర్ణ విజ్ఞానమని ఎవరూ అనుకోకూడదు. కొత్తదనాన్ని అన్వేషిస్తూ, ఆహ్వానిస్తూ, ఇముడ్చుకుంటూ, ఆ కొత్త పరిజ్ఞానం ఇచ్చే ఫలితాలను పొందుతూ మానవ జాతి పురోగమిస్తుంటుంది. ఇదే శాస్త్రీయ దృక్పథం. మాకు తెలిసిందే సమస్తం అని, అసలు విజ్ఞానం అంతా ఎప్పుడో మన పూర్వీకులు కనిపెట్టేసి నిక్షిప్తం చేసేశారని, వాటిని అక్షరం కూడా మార్చకూడదని వాదించే వారున్నారు. వారే సాంప్రదాయవాదులు, ఛాందసవాదులు. ఇప్పుడు ఆ సాంప్రదాయవాదులే దేశంలో పాలిస్తూ తమ భావాలను ప్రజల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు.
అందువల్ల సంప్రదాయ శాస్త్రాన్ని విశ్వసిస్తూ మూఢనమ్మకాలతో బతకడమా లేక ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని జీవితంలో ప్రధాన భాగంగా చేసుకోవడమా? అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. సాంప్రదాయవాదులు మాది ఎప్పటికీ మారని జ్ఞానమని వున్నది వున్నట్టు చెప్పుకోరు. మాదే అసలైన శాస్త్రం అని చెప్పుకుంటారు. తమ పవిత్ర గ్రంథాలే శాస్త్రీయమైనవంటూ ఆయా మతాల బోధకులు, భక్తులు వాదిస్తుంటారు. బైబిల్, ఖురాన్‌లు కూడా శాస్త్ర బద్ధమైనవే అంటుంటారు. ఈ జాబితాలో ఇటీవల వాస్తు, జ్యోతిష్యం వంటి వాటిని కూడా పోటీ పడి చేరుస్తున్నారు. కొందరు సైంటిస్టులే, టెక్నాలజీ నిపుణులే మూఢ నమ్మకాలలో శాస్త్రీయత ఉందని చూపే ప్రయత్నం చేస్తూ...తమ విలువలను పోగొట్టుకుని విమర్శలకు గురవుతుంటారు.
ఒకటి మాత్రం నిజం! 'శాస్త్రీయం' అనే పదం వాడితే-అది గౌరవప్రదంగా మారిపోతుందని అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా సైన్సు విజయమే! పురాణ గ్రంథాల విజయం కాదు. 'ఇవే మా పురాణ గ్రంథాలని'-ఏ వైజ్ఞానికుడూ తమ వైజ్ఞానిక గ్రంథాల గూర్చి పొరపాటున కూడా చెప్పుకోలేదు. మత బోధకులే తమ మతగ్రంథాలు శాస్త్రీయమైనవని చెప్పుకుంటున్నారు. అంటే, విలువైనవి ఏవీ? అన్నది అర్ధం చేసుకోవాలి. నిస్సందేహంగా వైజ్ఞానిక దృక్పథానిదే విజయం. అది మత గ్రంథాల ముందు సాగిలపడి ఓటమిని ఒప్పుకోలేదు. మత భావన (దైవ భావన) మాత్రమే శాస్త్ర దృక్పథం ముందు ''తమదీ శాస్త్రీయతే''నని-వివరణలు ఇచ్చుకుంటున్నాయి. అంటే ఒకరకంగా అనుకరిస్తున్నాయి. కొందరు శాస్త్రం, శాస్త్రీయత అనే పదాల్ని పనికిరాని వాటికి ఆపాదించి, విరివిగా వాడినందువల్ల అవి వాటి అర్ధాల్ని, స్ఫూర్తిని పోగొట్టుకున్నాయి. అందువల్ల సైన్సును మనం తెలుగులో విజ్ఞానశాస్త్రం అని-సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌ని వైజ్ఞానిక దృక్పథమని వాడడం మేలు. దానివల్ల, సంప్రదాయవాదులు చెప్పే శాస్త్రానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి తేడా తెలుస్తుంది.
అన్ని మతాల వారు తమ తమ మత గ్రంథాల గూర్చి గొప్పగా చెప్పుకుంటారు కదా? అవి జన బాహుళ్యం లోకి పోవడానికి ప్రింటింగ్ మిషన్లే కదా ఉపయోగపడ్డాయి. ముద్రణా యంత్రాలు సైన్సు వల్ల వచ్చినవే! సుప్రభాతాల దగ్గర్నుండి పవళింపు సేవల దాకా పాటలు, పద్యాలు, భజనలు...అలాగే నమాజులు, ప్రేయర్లు అన్ని మతాల ప్రార్థనలు జనానికి వినిపించడానికి మైకులు, లౌడ్ స్పీకర్లే ఉపయోగపడుతున్నాయి. అవన్నీ సైన్సు అందించినవేనని గుర్తుంచుకోవాలి. పుణ్య స్థలాలకు భక్తులు వెళ్ళి రావడానికి టికెట్లన్నీ ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. అవి విజ్ఞాన శాస్త్ర ఫలితమే కదా! విగ్రహాల తయారీ సైన్సు ఫలితమే. ప్రార్థనా స్థలాల్లో నిర్మించిన భవనాలు సైన్సు ఫలితమే. మనిషి ప్రమేయం లేకుండా, అతను సంపాదిస్తూ వచ్చిన విజ్ఞానం లేకుండా ఏ మతమూ నిలబడలేదు. ప్రచారం కాలేదు. పరిఢవిల్లలేదు. ఒకప్పటి తాళపత్ర గ్రంథమైనా, నేటి ఇ-బుక్ అయినా, మనిషి వివేకం లోంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన విజ్ఞాన శాస్త్రమే - ఉన్న ఫళంగా ఏ అతీంద్రియ శక్తి వల్లనో ఇవన్నీ జరిగాయి....అనడానికి ఆధారాలే లేవు. ''మా విశ్వాసాలే మాకు ముఖ్యం. ఏ ఆధారాలు లేకపోయినా మేం విశ్వసిస్తూనే ఉంటాం''- అని ఎవరైనా అంటే అది వారి ఇష్టం. వారి మానసిక స్థితిపై తప్పక అనుమానించాల్సిందే.
సైన్సు ఎప్పుడూ సైన్సు లాగా ఉండిపోలేదు. మానవ జీవితం లోని అన్ని రంగాల మీద అది ప్రభావం చూపుతూ వచ్చింది. సామాజిక, రాజకీయ, సాహిత్య, క్రీడా, కళా రంగాలలో బలమైన ముద్ర వేస్తూ వచ్చింది. జీవితాన్ని వేగవంతమే కాదు, అర్ధవంతం చేసింది కూడా! దుర్వినియోగం చేసినప్పుడు దుష్ఫలితాలనిచ్చింది. కాని, మనిషి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనిషి రేపటి ప్రయాణానికి సైన్సు సర్వదా సహాయకారి అయ్యింది. ఎప్పుడో నలభయ్యేళ్ళ కింద విన్న మధురగీతం మళ్ళీ ఇప్పుడు ఆస్వాదించాలనుకుంటే-వినడానికి వీలవుతుంది. ఇంట్లో కూర్చుని విదేశంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడగలుగుతున్నాం. మనిషి ఆరోగ్యం కాపాడడానికి ఎక్కడ ఏ దేశంలో ఏ శాస్త్రవేత్త మందు కనిపెట్టినా, అది అనతికాలంలో మనకు ఇక్కడ లభిస్తోంది. ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తి వల్లనో, దైవానుగ్రహం వల్లనో, జరగడం లేదు.
కుల, మత, ప్రాంతీయ భేదాలు తగ్గించడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం కృషి చేస్తూనే వచ్చింది. అది ఎలాగా? అని అంటారేమో! బస్సులు, రైళ్ళు, విమానాలు అన్నీ సైన్సు ఫలితాలే కదా? వాటిలో మనుషులంతా ఏ భేదాలు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు కదా? ఒక దళితుణ్ణి తన ఇంటి ప్రహరీ గోడ బయట నిలబెట్టిన ఛాందసుడు నోరు మూసుకుని ప్రయాణాల్లో పక్క సీటు ఇవ్వాల్సిందే. హోటళ్ళలో ఎవరు వంట చేస్తున్నారో తెలియదు. పక్కన కూర్చుని తిని వెళుతున్నది ఎవరో తెలియదు. విజ్ఞాన శాస్త్రం అందిస్తున్న ఆధునికత, నాగరికత, మనుషులందరినీ ఒక్కటిగా ఒక చోట కలపడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ, సమాజంలోని కొంత మంది కుటిల మనస్కుల వల్ల పూర్తి ఫలితాలు లభించడం లేదు. అమెరికాలో జాత్యహంకారం బుసులు కొడుతూ ఉంటే, ఇక్కడ మన దేశంలో కులమతాల దురహంకారం రొమ్ము విరుచుకు తిరుగుతోంది. ఏమైనా ఈ దేశంలో అన్ని మతాల మత గురువులు, మత ప్రబోధకులు, రాజకీయ నాయకులు విజ్ఞానశాస్త్రం ఇచ్చిన నీడలో తలదాచుకుంటున్నారు. అయితే ఆ విషయం ధైర్యంగా ఒప్పుకునే నిజాయితీ వారికి లేదు. ఒప్పుకుంటే తమకు తాము కల్పించుకున్న పవిత్రత-మహిమ-గౌరవం-విలువ అన్నీ కుప్పకూలి పోతాయని వారి భయం. భ్రమల్లో బతకడమే వారికి ఇష్టం! కొందరు మూఢ భక్తులు, అనుచరులు తమ చుట్టూ ఉంటే చాలు, ప్రపంచమే తమ చుట్టూ ఉందని సంతృప్తి పడుతుంటారు.
విజ్ఞాన శాస్త్రమంటే ఏముంది, కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కదా? అని కొందరు దాన్ని తేలికగా తీసివేయాలని చూస్తారు. నిజమే! విజ్ఞానమే తరువాత సాంకేతిక పరిజ్ఞానంగా మారుతుంది. అందుకే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కలిసి చాలా చాలా శ్రమించాల్సి వస్తుంది. ఇక్కడే రుషులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు అందరూ ఘోరంగా విఫలమవుతూ వచ్చారు. సైన్సు, టెక్నాలజీగా మారి ప్రజలకు ఉపయోగ పడ్డట్టు, ఈ ఆధ్యాత్మికవేత్తల బోధనలు సామాన్యుడి దైనందిన జీవితంలో ఉపయోగపడడం లేదు. వీరి అంతర్గత, ఆత్మశక్తి వల్ల, తపోశక్తి వల్ల, ఆధ్యాత్మిక శక్తి వల్ల, దైవ ప్రార్థనల వల్ల, నమాజులు, ప్రేయర్ల వల్ల చిన్న గుండు సూదిని కూడా కదలించలేకపోతున్నారు. శతాబ్దాల కాలంలో వారి వల్ల మానవులకు ఉపయోగపడే పని ఏమైనా జరిగిందా? జరగలేదు కదా? గురువు భ్రమల్లో ఉంటూ తన శిష్యులను కూడా భ్రమల్లో ఉండమని ఉద్భోదిస్తాడు తప్ప-నికరంగా సమాజానికి జరిగిన మేలు ఏముంటుంది?
ఊర్థ్వ లోకం కోసం, పుణ్యం కోసం, మోక్షం కోసం వెంపర్లాడుతున్న వారికి-చుట్టూ ఉన్న ప్రపంచం కనబడదు. అందులో వున్న మంచి గాని, మానవత్వం గానీ, సేవా భావన గానీ కనపడదు. నూతన ఆవిష్కరణల కోసం పడే తపన వారిలో వుండదు. కొత్త మార్గాల్ని అన్వేషించాలన్న ఉత్సుకత ఉండదు. వేల ఏళ్ళ నాడు పూర్వీకులు నిర్ణయించిన మార్గదర్శకాలే వారికి ఆదర్శం. ఎవరైనా సరే, పుచ్చిపోయిన కర్ర పట్టుకుని ఎవరి మీదా అజమాయిషీ చేయలేరు కదా? కానీ, వారు ఆ విషయం గ్రహించుకోరు. వేల ఏళ్ళ నాటి సంప్రదాయపు కర్రలతో ఇటు సమకాలీన, అటు భవిష్యత్ తరాల్ని అజమాయిషీ చేయాలనుకుంటారు. వారి ఆలోచనలు ఎక్స్‌పైరీ అయిపోయిన మందుల్లాంటివని, అవి సమాజానికి హాని చేస్తాయని గ్రహించుకోరు. విజ్ఞానశాస్త్రం ఎప్పుడూ నిత్య నూతనం గనుక, నిరంతరం మారుతూ తనను తాను అప్‌డేట్ చేసుకుంటుంది. అందువల్ల అది ఎక్స్‌పైర్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. కాలం చెల్లిన విధానాల్ని, విలువల్ని పట్టుకుని వేలాడుదామా? లేక కాలంతో పాటు వేగంగా ముందుకు కదులుదామా? మరొక ముఖ్య విషయమేమంటే సైన్సు అనేది సత్యాన్వేషణలో ఉపయోగించే ఒక పరికరం! అయితే, దాన్ని ఉపయోగించే తీరును బట్టే మళ్ళీ... ఫలితాలుంటాయి. హెచ్.నరసింహయ్య బెంగుళూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు వైజ్ఞానిక దృక్పథం గురించి డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఒక పాఠ్యగ్రంథం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వైజ్ఞానిక స్పృహ కలిగి ఉంటే, అది పిల్లలకు లాభదాయకమౌతుంది. అలా అలా రాబోయే తరాలు లాభపడతాయి. వైజ్ఞానిక దృక్పథం గురించి మనం మన రాజ్యాంగంలో పొందుపర్చుకున్న అంశాన్ని నిరంతరం గుర్తుంచుకుంటూ, భావితరాల్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే 'ఛేంజ్ ఈజ్ ది ఫినామినన్ ఆఫ్ లైఫ్' అనేది కూడా గుర్తుంచుకోవాలి!
* డా|| దేవరాజు మహారాజు (సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్)










