
న్యూఢిల్లీ : మీడియా స్వేచ్ఛలో భారత్ 161 స్థానానికి పడిపోయింది. గతేడాది 150 స్థానంలో నిలవగా.. 11 స్థానాలు దిగజారి 161 ర్యాంకుకు చేరింది. మొత్తం 180 దేశాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి పారిస్‌కు చెందిన స్వతంత్ర ఎన్‌జిఒ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) బుధవారం గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఈ సూచిలో బంగ్లాదేశ్ 163 స్థానంలో ఉండగా, పాకిస్తాన్ భారత్ కన్నా మెరుగ్గా 150వ స్థానంలో నిలవడం గమనార్హం. తాలిబన్‌ల స్వాధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా 152వ స్థానంలో నిలిచింది. భూటాన్ 90 వ ర్యాంకు సాధించగా, శ్రీలంక 135వ ర్యాంకు సాధించినట్లు ఆర్‌ఎస్‌ఎఫ్ తెలిపింది.
భారత్ 161 స్థానానికి పడిపోవడంపై ఆర్‌ఎస్‌ఎఫ్ ఈ వివరణనిచ్చింది. 2014లో ప్రధాని మోడీ అధికారం చేపట్టిన అనంతరం నుండి జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని ఆర్‌ఎస్‌ఎఫ్ పేర్కొంది. మీడియాలో రాజకీయ పక్షపాత ధోరణి, మీడియా యాజమాన్యాలు ఏకీకృతం కావడం ఇవన్నీ భారత్‌లో మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయని తెలిపింది.
దేశంలోని హిందీ భాషలో మూడొంతుల మంది పాఠకులకు కేవలం నాలుగు వార్తాపత్రికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రాంతీయ భాషల విషయానికొస్తే.. కోల్‌కతాలో ఆనంద్ బజార్ పత్రికా, ముంబయిలో లోక్‌మాత్, దక్షిణాదిలో మలయాళ మనోరమ లు ప్రచురితమవుతున్నాయి. టివి రంగంలోనూ ఈ మీడియా యాజమాన్యాలు ఏకీకృతం కావడం కనిపిస్తుంది. అలాగే ఆల్ ఇండియా రేడియా (ఎఐఆర్) నెట్‌వర్క్ నుండి అన్ని రేడియో స్టేషన్‌ల్లోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఈ కంపెనీలకు, మోడీ ప్రభుత్వానికి మధ్య బహిరంగంగా పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇంకా కొనసాగుతోంది. సుమారు 80 కోట్ల మంది అనుసరించే 70 మీడియా నెట్‌వర్క్‌లు అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండిస్టీస్ గ్రూప్ అధీనంలో ఉన్నాయి. ఇటీవల ఎన్‌డిటివిని అదానీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
మోడీ అధికారం చేపట్టిన అనంతరం పలువురు జర్నలిస్టులు వేధింపులను ఎదుర్కొంటున్నారు. దేశద్రోహం, పరువునష్టం, కోర్టు ధిక్కారం, జాతీయ భద్రత చట్టాలతో పాటు తిరుగుబాటుదారులన్న ముద్ర వేస్తోంది. అలాగే మీడియాలో ఉన్నత కులాలకు చెందిన పురుషులు జర్నలిజంలో సీనియర్ పదవులను కలిగి ఉండటం లేదా మీడియా ఎగ్జిక్యూటివ్‌లుగా ఉంటున్నారు. ఇది మీడియా కంటెంట్‌లో ప్రతిబింబిస్తుంది. సాయంత్రం వేళల్లో వచ్చే ప్రధాన చర్చా కార్యక్రమాల్లో పాల్గనేవారిలో 15 శాతం కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు. భారత్‌లో జర్నలిస్టుల భద్రతకు ఎలాంటి చర్యలు లేవు. ప్రతి ఏడాది సగటున నలుగు రు జర్నలిస్టులలో ముగ్గురు హత్యకు గురవుతున్నారు. మీడియా రంగానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆర్‌ఎస్‌ఎప్ స్పష్టం చేసింది.