Oct 13,2023 14:14
  • హాజరైన మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్ అహ్మద్

ప్రజాశక్తి-బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గం,బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనర్ పి.ఆర్.మనోహర్ నగర పంచాయతీ కార్యాలయం నందు స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసిపి పలమనేరు నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్ అహ్మద్ సూచనలు,సలహాలతో నగర పంచాయతీ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రజలకు నీరు వదిలేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చాలా వరకు నీటి కొళాయిలకు ట్యాపులు లేవని,దీంతో నీరు చాలా వృధా అయిపోతుందని, వెంటనేట్యాపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బి.కొత్తకోట నగర పంచాయతీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. నగర పంచాయతీ అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో ఆయన సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి చేసుకుందామని కమిషనరుకి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో నగర పంచాయతీ ఆర్ఐ శ్రీనివాసులు, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కంచి బలరాం రెడ్డి,సచివాలయ కన్వీనర్లు ఎస్ఎస్ ఫయాజ్, ఎం.వి కృష్ణయ్య, సంకు సబ్జీ, సాయి, తదితరులు పాల్గొన్నారు.