రైతు అనుభవం నుండే ఈ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఎవరో పథకం రచిస్తే వచ్చింది కాదు. ఉద్యమం వెల్లువలా వచ్చాకే ప్రతిపక్షాలు బలపరుస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువగానే బిజెపి గావుకేకలు పెట్టింది. అంతేకాక, ఈ ఉద్యమానికి బిజెపి మిత్రపక్షాలు కూడా మద్దతునిస్తున్నాయి. హర్యానా, రాజస్థాన్, పంజాబుకి చెందిన కొన్ని పార్టీలు ఎన్‌డిఏ కూటమి నుండి తప్పుకున్నాయి. ఆర్‌యస్‌యస్ అనుబంధ స్వదేశీ జాగరణమంచ్ ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నది. కేరళలో వారి ఏకైక ఎంఎల్‌ఏ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానానికి పరోక్షంగా మద్దతునిచ్చారు. బిజెపి ఏకాకి అయిందనడానికి, వారికి ఈ చట్టాలు కొనసాగించడానికి నైతిక హక్కు లేదనడానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలి ?
ముప్పై ఏడు రోజులుగా సాగుతున్న రైతు ఉద్యమం రోజురోజుకీ మరింతగా బలపడుతోంది. ఉద్యమానికి దూరంగా ఉన్న ప్రజల నుండి కూడా అపూర్వ సంఘీభావం వ్యక్తమవుతోంది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సిన సమస్యను మోడీ మొండితనంతో చిక్కుముడి పడుతోంది. ఈ నల్ల చట్టాలు మాకొద్దు మహాప్రభో అని రైతులు మొత్తుకుంటున్నా ఈ చట్టాలు ఎంత గొప్పవో చెప్పడానికి మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. కార్పొరేట్ దన్నుతో ఆయన చెవులు, కళ్లు మూసుకుపోయాయి. ప్రతిపక్షాలు రైతుల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని, ఉగ్రవాదులు హైజాక్ చేశారని ఇలా రోజుకో ఆరోపణ చేస్తూ ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. కాని ప్రజలు మోడీ మాటల్ని పట్టించుకోవడం లేదు. రైతుల పట్ల సానుభూతితో ఉన్నారు. ఈ స్థితిలో జనాన్ని నమ్మించడానికి చర్చలు ప్రారంభించినా ఆరో దఫా చర్చల్లో స్వల్ప పురోగతి వున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాని కీలకమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించలేదు. పాత మూస లోనే సమాధానాలు ఇచ్చారు. కమిటీ వేస్తామని, మద్దతు ధరపై హామీ ఇస్తామని అరిగిపోయిన రికార్డునే వేశారు. దానితో చర్చలు 4వ తేదీకి వాయిదా పడ్డాయి.
మన రాష్ట్రం లోనూ రైతు ఉద్యమం ఊపందుకుంటోంది. తొలుత రకరకాల కారణాలతో దీని పట్ల అనాసక్తిగా ఉన్న రైతాంగం క్రమంగా కళ్లు తెరుస్తోంది. ప్రతి గ్రామంలోనూ కిసాన్ జ్యోతి కార్యక్రమం జయప్రదమైన తీరే ఇందుకు నిదర్శనం. పార్టీలకతీతంగా రైతులు వాటిల్లో పాల్గొని నల్ల చట్టాలకు నిరసన తెలియచేశారు. సదస్సులు పెట్టి రైతులకు నచ్చచెప్పాలనుకున్న బిజెపి ప్రయత్నాలు ఫలించలేదు. అందులోనూ మన రాష్ట్రంలో బిజెపి కి విశ్వసనీయత లేదు. ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు అమలు చేస్తామని నమ్మించి మోసం చేసిన రికార్డు వారిది. తిరుపతిలో అన్యమతస్తుల కార్యకలాపాల గురించి గోల చేస్తున్న బిజెపి, ఆ తిరుపతి దేవుడి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన వాగ్దానాన్నే మట్టిలో కలిపేశారు. వారికి దేవుడి మీద గౌరవం, భక్తి లేదని, అదంతా పదవులు, అధికారం కోసం ఆడే నాటకమని జనానికి క్రమంగా అర్ధమవుతోంది. అందుకే మద్దతు ధరలపై మోడీ మాటల్ని మన రాష్ట్ర ప్రజానీకం విశ్వసించడం లేదు. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంతో మన రైతాంగమూ మమేకమవుతోంది.
డిసెంబరు 27వ తేది మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ స్వదేశీ వస్తువుల్నే కొనమని జనానికి హితోపదేశం చేశారు. స్వదేశీపై భక్తి కాదు అది. నిజంగా ఆయనకు స్వదేశీపై భక్తి వుంటే ముందు విదేశీ పెట్టుబడుల్ని, కంపెనీలను నిషేధించాలి. అంబానీ, అదానీలు చైనాతో సహా విదేశీ కంపెనీలతో వ్యాపార కార్యకాలపాలు సాగిస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం వ్యవసాయం లోకి మాన్‌శాంటో, వాల్‌మార్టు వంటి విదేశీ పెట్టుబడులు మిళితమై వస్తున్నాయి. మన రాష్ట్రానికి గర్వకారణంగా భావించే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకు అప్పగించడానికి సిద్ధపడింది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి స్టీలు కార్మికులు నడుం కట్టి పోరాడుతున్నారు. విదేశీ కంపెనీల కోసం స్వదేశీ ఉద్యమాలను, రైతులను, కార్మికులను అణచి వేస్తూ స్వదేశీ జపం చేయడమంటే దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే. ఆయన స్వదేశీ బ్రాండు పేరు 'నమస్తే ట్రంపు'.
ఈ ఆరేళ్లలో మోడీ విధానాల వల్ల రైతు ఆత్మహత్యలు పెరిగాయి. భూములు కోల్పోయారు. భూమి లేని వారి సంఖ్య 35 నుండి 49 శాతానికి పెరిగింది. ఈ సంస్కరణల వల్ల ఈ పరిణామం మరింత వేగంగా జరుగుతుంది. కాని మీ భూములు ఎక్కడికీ పోవని నంగనాచి కబుర్లు చెప్తున్నారు. భూములు ఎక్కడికీ పోవు. ఎవరూ వాటిని నెత్తిన పెట్టుకొని తీసుకొని పోలేరు. కాని రైతుల యాజమాన్యంలో ఉండవు. అంతే.
ఈ చట్టాలు వచ్చిన ఈ మూడు నెలల్లోనే ఆదాయాలు ఎలా పడిపోయాయో ఏ రైతునడిగినా చెపుతాడు. ధాన్యం ధర బస్తాకి రెండు వందలకు పైగా తగ్గిపోయింది. ఈ రోజు రైతులు అమ్ముకుంటున్న మంచి రకం ధాన్యానికి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం చూస్తే బస్తాకి రూ. రెండు వేలు రావాలి. మార్కెట్లో బియ్యం ధరలను బట్టి చూస్తే బస్తా ధాన్యానికి రూ. మూడు వేలు రావాలి. కాని రైతులు అమ్ముకుంటున్నది రూ. 12 వందలు లేదా రూ. 13 వందలకే. దీనికి కారణం ఎవరు? ఈ మార్కెట్ శక్తులకు అధికారం ఇవ్వడం వల్ల కాదా? వారు దయతో రెట్టింపు ధర ఇస్తారని, ఇంకా బోనస్ కూడా ఇస్తారని కార్పొరేట్ కంపెనీల తరపున వకాల్తా పుచ్చుకొని మోడీ వాదిస్తున్నారు. కాని అంగీకరించిన ధరకు కూడా కొనకపోతే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. సుబాబుల్ టన్నుకి రూ.4200కు కొంటామని ఐటిసి మాట ఇచ్చింది. ప్రభుత్వం జీవో తెచ్చింది. కాని ఇప్పుడు రూ.1800కు కూడా కొనడం లేదు. కూరగాయలు ధరలు చూస్తే మండిపోతున్నాయి. రిలయన్సు ఫ్రెష్ షోరూంలో గురువారం కిలో దొండకాయలు రూ.48. అదే రోజు రైతు బజారులో రూ.28. కాని పొలంలో రైతులు అమ్ముకున్నది రూ.14 లకే. దీన్నేమనాలి? ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకొని కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే రైతులకు దిక్కెవరు ?
కేరళలో మార్కెట్ యార్డులే లేవని మోడీ కొత్త సత్యాన్ని కనిపెట్టారు. నిజమే. అక్కడ మార్కెట్ యార్డుల చట్టమే లేదు. కాని ప్రతి పంటకు ప్రత్యేక బోర్డులున్నాయి. వేలం కేంద్రాలున్నాయి. ధాన్యం కొనుగోలుకు సహకార వ్యవస్థలున్నాయి. దేశంలోనే ఆదర్శవంతంగా ధాన్యం మద్దతు ధరకు కేంద్రం కన్నా రూ.900 అదనంగా నిర్ణయించి కొనుగోలు చేస్తున్నది. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ధర నిర్ణయించిన ఏకైక రాష్ట్రం కేరళ. అక్కడ బలమైన సహకార వ్యవస్థ ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది. వాటిని నాశనం చేయడానికి మోడీ సర్కారు కంకణం కట్టుకుంది. దేశంలోనే ప్రప్రథమంగా కూరగాయలకు కనీస ధర నిర్ణయించి అమలు చేస్తోంది. కాని బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో ప్రైవేటు కంపెనీలు రైతుల వద్ద కొనుగోలు చేసి ఉత్పత్తులకు డబ్బులు చెల్లించకుండా ఐపీ పెడితే ఆదుకునే నాథుడే లేదు. రైతులు కేసులు పెట్టినా నిందితులను పట్టుకొని శిక్షించలేదు. బీహారులో 2006లో మార్కెట్ యార్డులను రద్దు చేశారు. అప్పటి నుండి ధాన్యం ధరలు పడిపోయాయి. కాని బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పంజాబు మార్కెట్ యార్డుల్లో ఎఫ్‌సిఐ ద్వారా అమ్ముకునే ధర కన్నా బీహారులో 30 శాతం తక్కువ ఉంది. దీనికి బిజెపి ఏం సమాధానం చెపుతుంది. అందుకే విఫలమైన ఈ దివాళాకోరు విధానాలనే రైతులపై రుద్దడానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.
ఈ ఆందోళన చాలా న్యాయసమ్మతమైంది. రైతు అనుభవం నుండే ఈ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఎవరో పథకం రచిస్తే వచ్చింది కాదు. ఉద్యమం వెల్లువలా వచ్చాకే ప్రతిపక్షాలు బలపరుస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువగానే బిజెపి గావుకేకలు పెట్టింది. అంతేకాక, ఈ ఉద్యమానికి బిజెపి మిత్రపక్షాలు కూడా మద్దతునిస్తున్నాయి. హర్యానా, రాజస్థాన్, పంజాబుకి చెందిన కొన్ని పార్టీలు ఎన్‌డిఏ కూటమి నుండి తప్పుకున్నాయి. ఆర్‌యస్‌యస్ అనుబంధ స్వదేశీ జాగరణమంచ్ ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నది. వారిని సంతృప్తి పర్చడానికే మోడీ స్వదేశీ జపం చేస్తున్నాడు. ఈ చట్టాలను మార్చాలని వారి కిసాన్ సంఫ్‌ు బహిరంగంగా డిమాండు చేసింది. కేరళలో వారి ఏకైక ఎంఎల్‌ఏ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానానికి పరోక్షంగా మద్దతునిచ్చాడు. బిజెపి ఏకాకి అయిందనడానికి, వారికి ఈ చట్టాలు కొనసాగించడానికి నైతిక హక్కు లేదనడానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలి? ఇప్పటికైనా మొండిగా ముందుకు పోకుండా రైతుల అభిప్రాయాలను గౌరవించి ఈ చట్టాలను ఉపసంహరించుకొని రైతులు కోరుతున్న ప్రత్యామ్నాయ చట్టాలపై చర్చ చేయాలి. గిట్టుబాటు ధరల చట్టం, రుణ విమోచన చట్టం చేయాలి. అందుకు పార్లమెంటును సమావేశ పరచాలి.
మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాల పట్ల గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరిస్తోంది. పార్లమెంటులో చట్టాలను బలపరచి నేడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది. మాటల్లో సంఘీభావం ప్రకటించడం కాదు. రైతుల పక్షాన నికరంగా నిలబడి ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. తద్వారా తాను రైతు పక్షపాతినని నిరూపించుకోవాలి. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఈ ఉద్యమంపై నోరు మెదపడం లేదు. ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదు. ఈ రెండు పార్టీలు దేశవ్యాప్తంగా సాగుతున్న రైతాంగ ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నాయి. బిజెపి కి సహకరించే విధానాలకు స్వస్తి చెప్పి రైతుల తరపున నికరంగా నిలబడాలి.
జనవరి 4 చర్చలు మరో దఫా జరుగనున్న సందర్భంగా రైతు పోరాట కమిటీ మోడీ మొండి విధానానికి నిరసనగా ర్యాలీలు నిర్వహించనుంది. మన రాష్ట్రంలో ప్రత్యేకించి విజయవాడలో జరుగనున్న ట్రాక్టరు ర్యాలీని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ దానికి సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సంఘీభావం తెలియచేయాలి. అదే ముఖ్యమంత్రి రైతులకిచ్చే నూతన సంవత్సర కానుక అవుతుంది.
(రచయిత కౌలురైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు)
వి. శ్రీనివాసరావు











