ఛండీగఢ్ : పలు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే హర్యానా రాష్ట్రంలో గత నెల రోజుల్లోనే 4 లక్షల కోళ్లు మృతి చెందాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర పశుసంవర్థక, ఫిషరీష్ శాఖ మంత్రి జెపి దలాల్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్యానాలోని రెండు ఫౌల్ట్రీ ఫామ్‌లలో శాంపిల్స్ పరీక్షలకు పంపగా హెచ్5ఎన్8 (బర్డ్ ఫ్లూ) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం కోళ్లలో పాజిటివ్ వచ్చిన ప్రాంతం నుంచి కిలోమీటరు పరిధిలోని పక్షులన్నింటినీ చంపడం, పూడ్చిపెట్టడం చేయాల్సి ఉంటుందన్నారు. చనిపోయిన కోళ్లకు సంబంధించిన శాంపుల్స్‌ను జలంథర్‌లోని లోబెరేటరీకి, మరికొన్నింటిని భోపాల్ ల్యాబొరేటరీకి పంపామని చెప్పారు. రెండు ఫౌల్ట్రీ ఫామ్‌లలో చనిపోయిన పక్షులకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. కిలోమీటరు పరిధిలోని బర్డ్ ఫామ్‌లలోని 1.60 లక్షల కోళ్లను చంపడానికి ఆదేశించడంతో పాటు ఫామ్ యజమానులకు పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. ఫామ్‌లలో పనిచేసే వర్కర్లకు యాంటీ వైరల్ మాత్రలు అందించామని తెలిపారు. అంబాలాలోని కొన్ని గుర్రాలలో 'గ్లాండర్స్' అనే వ్యాధిని గుర్తించినట్టు కూడా మంత్రి దలాల్ తెలిపారు.










