
మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు
రాజధాని విషయంలో
వైసిపి మూడుముక్కలాట
ప్రజాశక్తి-నెల్లూరు :వైసిపి ప్రభుత్వం రాజధాని విషయంలో మూడుముక్కలాట ఆడుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 7 నుంచి 15 వరకు సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాచైతన్య బేరీ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత నగరంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి సిపిఎం రూరల్ కమిటీ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జోరు వానను సైతం లెక్కచేయకుండా సిపిఎం శ్రేణులు ఆర్‌టిసి బస్టాండ్ వరకు పాదయాత్రను నిర్వహించారు. ఆర్‌టిసి బస్టాండ్ వద్ద సభా కార్యక్రమం నిర్వహించారు.ఈ సభలో సిపిఎం రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా,కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోని అధికార వైసిపి ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు కేంద్రం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు తాన తందాన అంటూ భజన చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతుందన్నారు. రాజధానిపై స్పష్టత ఎప్పటికీ ఏర్పడుతుందో తెలియదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ హక్కులను తామే కాపాడుకోవాలని ప్రజా పోరాటాల ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. అందుకు సిపిఎం ఒక్కటే ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందన్నారు. అనంతరం సిపిఎం రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణ సంస్కరణల పేరిట ఇంటి, కుళాయి పన్నులను పెంచాలని చెత్త పన్ను వేయాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని ఉధత పరుస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అల్లాడి గోపాల్,ఎండి అబ్దుల్ అజీజ్, రూరల్ కమిటీ సభ్యులు కిన్నెర కుమార్, ఎస్‌డి. రఫి అహ్మద్, కొండా ప్రసాద్, సంపత్ కుమార్,బి.నాగేశ్వరరావు, బి.నాగిరెడ్డి, ఎం.మాలకొండయ్య, ఎస్‌డి. మీరా, ఎస్‌కె. జిలాని,ఎస్‌కె. రుభియ ఎస్‌కె. ఇర్ఫాన్, కట్టా సుబ్రమణ్యం, ఎం..సుధాకర్, కె.. శాంసన్, లవన్ కుమార్, జి. జనార్ధన్, కండే కోటేశ్వరరావు, తది తరులు పాల్గొన్నారు.