
- ప్రతి 500 కిలోమీటర్లలోనూ పాగా
- ఓడరేవుల వ్యాపారంపై అంతకంతకూ పట్టుబిగింపు
- పుష్కలంగా మోడీ ప్రభుత్వ అండదండలు
- పోర్టుల్లో పడిపోతున్న ప్రభుత్వ వాటా
న్యూఢిల్లీ : 2001లో అదానీ గ్రూప్ చేతిలో ఒకే ఒక ఓడరేవు ఉండేది. ఇప్పుడో...!? దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు ఆపరేటర్‌గా ఎదిగింది. అదానీ చేతిలో ప్రస్తుతం 14 ఓడరేవులు, టెర్మినల్స్ ఉన్నాయి. దేశంలోని ఓడరేవుల ద్వారా జరుగుతున్న సరకు రవాణాలో నాలుగో వంతు ఆ సంస్థే నిర్వహిస్తోంది. గడచిన పది సంవత్సరాల్లో అదానీ చేతికి ఆరు ఓడరేవులు వచ్చాయి. ఈ పరిణామం ప్రభుత్వంలోని ఓ వర్గంలో ఆందోళన కలిగిస్తోంది. నిజమే...దేశంలో 5,422 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సగటును ప్రతి 500 కిలోమీటర్లకూ అదానీ ఉనికి కన్పిస్తోంది. ఓడరేవుల రంగంలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించడం వెనుక కేంద్రంలోని మోడీ ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండడమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గడచిన పది సంవత్సరాల్లో అదానీ ఓడరేవులు జరిపిన సరకు రవాణా సుమారు నాలుగు రెట్లు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న ఓడరేవుల ద్వారా 337 మిలియన్ టన్నుల సరకు రవాణా అయింది. దేశంలో జరుగుతున్న సరకు రవాణాలో ఏటా 4% వృద్ధి కన్పిస్తుంటే అదానీ గ్రూప్ ఓడరేవుల ద్వారా జరుగుతున్న సరకు రవాణాలో 14% వృద్ధి కన్పించడం విశేషం. మొత్తం సరకు రవాణాలో అదానీ గ్రూప్ మార్కెట్ వాటా 2013లో 9%గా ఉండగా అది ఈ సంవత్సరంలో 24%కి చేరింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని ఓడరేవుల నుండి జరుగుతున్న సరకు రవాణా 58.5% నుండి 54.5%కి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణ లేని ఓడరేవుల్లో అదానీ మార్కెట్ వాటా ఇప్పటికే 50% దాటిపోయింది. ఓడరేవుల రంగంలో అదానీ గ్రూప్ మార్కెట్ వాటా గడచిన పది సంవత్సరాల్లో భారీగా పెరగ్గా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఓడరేవులు కూనారిల్లిపోయాయి. వాటి సరకు రవాణా వాటా పడిపోయింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
37% ఆ గ్రూపుదే
అదానీ గ్రూప్ జరుపుతున్న సరకు రవాణాను 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక విశ్లేషించింది. గత పది సంవత్సరాల్లో దేశంలో 337 మిలియన్ టన్నుల సరకు రవాణా జరగ్గా అందులో అదానీ గ్రూప్ ఓడరేవుల ద్వారా 123.7 మిలియన్ టన్నులు...అంటే 37% సరకు రవాణా అయింది. అదానీ ఓడరేవుకు నౌకలు సరకుతో వచ్చి వెళ్లేందుకు 0.7 రోజులు చాలు. అదే ప్రభుత్వ ఓడరేవులైతే రెండు రోజులు పడుతోంది.
ఏం జరుగుతుంది ?
సరకు రవాణాలో అదానీ గ్రూప్ ఆధిపత్యం పెరుగుతుండడంతో షిప్పింగ్ కంపెనీలకు బేరసారాలు జరిపే అవకాశం లేకుండా పోవచ్చు. పోటీ తక్కువగా ఉండడంతో గుత్తాధిపత్యానికి అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చిన లేదా చిన్న చిన్న కంపెనీలకు ఆటంకాలు ఎదురవుతాయి. సరకు రవాణాదారులు అదానీ ఓడరేవుల పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అదానీ గ్రూప్ తన స్థానాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది.
వ్యాపార సామ్రాజ్య విస్తరణ
పది సంవత్సరాల క్రితం అదానీ ఓడరేవుల ద్వారా 91 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. అంటే దేశంలో అన్ని ఓడరేవుల ద్వారా జరిగిన సరకు రవాణాలో కేవలం 10% అన్న మాట. ప్రస్తుత సంవత్సరంలో అదానీ నడుపుతున్న ముద్రా ఓడరేవు ద్వారానే 155 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. ప్రభుత్వ రంగంలోని 12 ఓడరేవుల్లో ఏ ఒక్క ఓడరేవు నుండి కూడా ఈ స్థాయిలో సరకు రవాణా కాలేదు. ప్రభుత్వ ఆజమాయిషీలో లేని ఓడరేవుల్లో అదానీ గ్రూపుదే పైచేయి. ఓడరేవులతో పాటు ఏపీసెజ్ మూడు ప్రధాన పోర్టుల్లో టెర్మినల్స్‌ను నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో సైతం అదానీ ఓడరేవుల్లో వ్యాపారం బాగానే సాగింది. ఏపీసెజ్ సంస్థ అనేక ఓడరేవులను చేజిక్కించుకుంటూ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఒడిశాలోని ధమ్రా, తమిళనాడులోని కట్టుపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, గంగవరం, మహారాష్ట్రలోని దిఘీ ఓడరేవులు అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లాయి. అదానీ గ్రూప్ ప్రాబల్యం పెరుగుతుండడంపై కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్‌పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇప్పుడు అంతా బాగానే ఉండవచ్చు. కానీ ఐదు, పది సంవత్సరాల తర్వాత సమస్యలు మొదలవుతాయి. దీనిపై ప్రభుత్వం, సీసీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది' అని ఆయన అన్నారు.
ఇతర రంగాలలోనూ...
ఓడరేవుల రంగంలోనే కాదు ఇతర రంగాల్లో సైతం అదానీ గ్రూప్ దూసుకుపోతోంది. దేశంలో విమానాశ్రయాలను నిర్వహించే అతి పెద్ద ప్రైవేటు రంగ సంస్థ కూడా అదే. ప్రస్తుతం దీని అజమాయిషీలో ఎనిమిది విమానాశ్రయాలు నడుస్తున్నాయి. ఇక దేశంలో అతి పెద్ద సిమెంట్ ఉత్పత్తిదారు, ప్రయివేటు రంగంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిదారు కూడా అదానీ గ్రూపే.