Oct 04,2023 12:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :  ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం  పైడితల్లి అమ్మవారు  జాతర మహోత్సవాలు బుధవారం పందిరి రాట మహోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మూడు లాంతర్ల  వద్దనున్న చదరగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉదయం 8 గంటలకు  సుమారు వంద మంది భక్తులు పైడితల్లి అమ్మవారి మండల దీక్షలను చేపట్టారు. ఆలయ కార్య నిర్వహణ అధికారిని  కేఎల్ సుధారాణి  మండల దీక్షలు చేపట్టిన భక్తులకు  దీక్ష వస్త్రాలను, మాలలును అందజేశారు. అనంతరం 9:30 గంటలకు  చంద్రగిరి ఆవరణలో వేద పండితుల వేదమంత్రాల నడుమ అమ్మవారి పందిరిరాటను వేసి ఉత్సవాలు ప్రారంభించారు. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ వద్దనున్న వనం గుడి పందిరిలాట ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సుధారాణి మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు భక్తులు పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి పందిరి రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోగలిగామని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో సిరిమాను ఎక్కడ వెలిసింది అన్నదానిపై వివరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ వార్డ్ సభ్యులు,వార్డ్ కార్పొరేటర్లు, దేవస్థానం సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.