Aug 04,2022 06:49

దేశంలో ప్రజల ఆరోగ్యం మీద వ్యాపారం విపరీతంగా పెరిగిపోతున్నది. భారతదేశం లోని 'హెల్త్‌ కేర్‌ ఇండిస్ట్రీ' అద్భుతమైన గ్రోత్‌ రేటుతో పెరుగుతుందనీ, ఈ 2022 సంవత్సరానికి 372 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల రెవెన్యూను చేరుకోగలదనీ ప్రభుత్వాలు, వ్యాపార వర్గాలూ అంచనాలు వేసుకున్నాయి. 372 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లంటే 29 లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఇది ప్రపంచ కుబేరుల్లో మొదటి పదిమందిలో ఉన్న ముఖేష్‌ అంబానీ సంపదకు నాలుగు రెట్లు ఎక్కువ. అంటే ఆరోగ్య రంగంలో ఎంత బిజినెస్‌ జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇంత బిజినెస్‌ జరగాలంటే దేశంలో రోగాలు పెరగాలి, రోగులు కూడా పెరగాలి, ప్రభుత్వ వైద్య వ్యవస్థ పనిచేయకూడదు. అప్పుడు మాత్రమే ఇండిస్టీగా మార్చబడిన ఈ హెల్త్‌ కేర్‌ వ్యాపారం తారాజువ్వలా పైకి వెళ్తున్నది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంలో జరుగుతున్న వ్యాపార అభివృద్ధి గురించి, అది తమ ఘనతే అని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాయి.
             ప్రైవేటు వైద్యం వ్యాపారస్థాయి కూడా దాటిపోయి షేర్‌ మార్కెటూ, బహుళ జాతి కంపెనీల స్థాయికి వెళ్లిపోవటం వల్ల ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం పెరగటం ఒక పెద్ద సమస్య అవుతోంది. కాగా, ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్య రంగానికి క్రమంగా గతంలో చేసిన కొద్దిపాటి బడ్జెట్లలోనూ కోత పెడుతున్నాయి. ఫలితంగా వ్యాధుల నివారణకి చెందిన ఆరోగ్య వ్యవస్థ కార్యక్రమాలూ మూలకు పడుతున్నాయి. నిన్నటిదాకా కోవిడ్‌ తీసిన ప్రాణాల కంటే దేశంలో రోజూ సాంక్రమిక, సాంక్రమికేతర వ్యాధులు తీస్తున్న ప్రాణాలు కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయి. అయితే అవి పాత రోగాలే కావటంతో అవి 'సహజమైనవి' అని భావించే స్థితికి చేరాం. పాలకులు కూడా ప్రజల మెదళ్ల పనితీరును అలా తీర్చిదిద్దారు. కానీ ఇది దేశానికీ, పౌరులకూ ఏ మాత్రం క్షేమకరమైనది కాదు.
               ఈరోజు పాలకులు వ్యాధుల నివారణ గురించి అస్సలు మాట్లాడటం లేదు. పౌర సమాజం కూడా వ్యాధులు ముదిరినాక ప్రైవేటు హాస్పిటళ్లకు పరిగెత్తడం గురించీ, వాటి దోపిడీ గురించే మాట్లాడుకుంటున్నది. దేశంలో కొంత కాలంగా సాంక్రమిక (అంటు) వ్యాధులు క్రమంగా తగ్గుతూ ముప్పై ఏళ్ల కిందటి సంఖ్యలో సగానికి చేరాయి. అదే సమయంలో సాంక్రమికేతర వ్యాధుల సంఖ్య రెట్టింపయ్యింది. ఈ రెండు రకాల వ్యాధులూ చాలావరకు నివారించుకోదగ్గవి. మన దేశంలో ఒకప్పుడు కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా, దోమల ద్వారా సోకే అంటు వ్యాధుల శాతమే ఎక్కువ. ఇప్పుడు వాటన్నిటినీ ప్రజలు తమంతట తామే చాలా వరకు తగ్గించుకోగలిగారు. దేశంలో సగటు జీవిత కాలం 1950లో 35 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు డెబ్బై సంవత్సరాలకు చేరింది. ఇది ప్రజల ఆదాయాలు పెరగటంతో దొరికిన మంచి ఆహారం, శుభ్రమైన మంచినీళ్ల వల్ల సాధ్యపడింది. దేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరిగింది ప్రధానంగా అంటు వ్యాధులు నివారింప బడటం వల్లనే. వ్యాధుల చికిత్స వల్ల కాదు. ప్రభుత్వాలు నివారణ రంగంలో చేసిన ఘనమైన కృషి కూడా ఏమీ లేదు, వ్యాక్సిన్లు వేయటం, వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రోత్సహించటం తప్ప. మన ఆరోగ్యాన్ని మనం తినే ఆహారం, తాగే నీరు, నివసించే ఇళ్లు, శానిటేషన్‌ వసతులు, సామజిక సంబంధాలు, మానసిక ఒత్తిడీ నిర్ణయిస్తాయి. ఇంకా మనం శరీర తాహతుకు తగినంత శ్రమే చేస్తున్నామా, ఎంత విశ్రాంతి తీసుకుంటున్నాం, మనకు వ్యసనాలేమైనా ఉన్నాయా, వైద్య వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయా అనే అనేక విషయాలూ ప్రభావితం చేస్తాయి. అంటు వ్యాధుల వాహకాలుగా ఈగలు, దోమలు, ఇతర కీటకాలూ ఉంటాయి. ఇన్నింటి మీద ఆధారపడి మనుషుల ఆరోగ్యం ఉంటుంది. ఉమ్మడిగా వ్యాధులను నివారిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని పెంచాలంటే అనేక రంగాల్లో విధాన నిర్ణయాలు చేయాలి. వాటిని సమర్ధవంతంగా అమలు చేయాలి.
             వ్యాధుల నివారణ సాంకేతికంగా అనేక దొంతరల్లో జరిగినప్పటికీ అతి ముఖ్యమైనది ప్రాథమిక నివారణ (పైమరీ ప్రివెన్షన్‌). ఇది ఆరోగ్యవంతులకు ఉద్దేశించినది. రోగులకు ఉద్దేశించినది కాదు. దీని ద్వారా ఆరోగ్యంగా ఉన్న వారిలో వ్యాధులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది. ఇది సాధించటానికి... 1. ప్రజల జనరల్‌ ఆరోగ్యాన్ని పెంచటానికి చర్యలు తీసుకోవటం, 2. 'నిర్దిష్ట వ్యాధుల నుండి రక్షణ' కోసం కొన్ని నిర్దిష్ట వ్యాధులు రాకుండా అందుబాటులో ఉన్న రక్షణ (స్పెసిఫిక్‌ ప్రొటెక్షన్‌) చర్యలు తీసుకోవటం ఉంటాయి.
              నిర్దిష్ట వ్యాధుల నుంచి రక్షణ'లో కొన్ని వ్యాధుల నివారణకు వాక్సిన్లు వేయించటం, థైరాయిడ్‌ సమస్య రాకుండా ఉప్పులో అయోడిన్‌ కలపటం వంటివి ఇందులో వస్తాయి. అలాగే బైక్‌ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్‌ ధరించటం, కారులో వెళ్తున్నప్పుడు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవటం కూడా మన శరీరాలు దెబ్బ తిని, మనల్ని హాస్పిటల్‌ పాలు కాకుండా చేసేవే. ఇవన్నీ స్పెసిఫిక్‌ ప్రొటెక్షన్‌ కిందకు వస్తాయి.
             వ్యాధుల నివారణలో హెల్త్‌ ప్రమోషన్‌ చాలా ముఖ్యమైనది. హెల్త్‌ ప్రమోషన్‌ అంటే ప్రజల ఆరోగ్య స్థాయిని పెంచటం. ఇందులో అంతర్లీనంగా రెండు ఉంటాయి. ఒకటి ప్రజల ఉమ్మడి ఆరోగ్య స్థాయిని పెంచటం. రెండవది ఉమ్మడి ఆరోగ్య స్థాయి తగ్గకుండా లేదా పాడుకాకుండా చూడటం. ఆరోగ్య స్థాయి పెరగటానికి తగినంత సమతుల ఆహారం, శుద్ధి చేయబడిన మంచినీరు, పరిశుభ్రమైన గాలి, రక్షణ ఉన్న ఇళ్లు, మంచి శానిటేషన్‌ వసతులు, శరీరానికి తగినంతనే శ్రమా, విశ్రాంతికి అవకాశం, ఎటువంటి ఒత్తిడీ, అవమానాలూ, వివక్షా లేని సామాజిక జీవితం ఇవన్నీ ప్రజల ఉమ్మడి ఆరోగ్య స్థాయిని పెంచుతాయి. వీటిలో కొన్ని ఖర్చు లేని అవగాహనా కార్యక్రమాలు కాగా కొన్ని పాలనా పరంగా ప్రజల ఆర్థిక స్థాయిని పెంచేవి. ఈ అంశాలు నిర్లక్ష్యం చేయబడితే మనం తొందరగా అనారోగ్యాలకు గురై ఆస్పత్రుల పాలవటమో లేక చనిపోవటమో జరుగుతుంది. ఆరోగ్య రక్షణలో ఈ సామాజిక కారకాల (సోషల్‌ డిటర్మినంట్స్‌ ఆఫ్‌ హెల్త్‌)ను నిర్లక్ష్యం చేయటం వల్లనే పేద, మధ్యతరగతి ప్రజలు ఆ పైవారితో పోల్చినప్పుడు అర్థాంతరంగా చనిపోయారు, ఇంకా చనిపోతున్నారు. ఈ కారకాలను సరిచేయటం విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధగా పనిచేసిన దాఖలా లేదు. ఇక ఆరోగ్యాన్ని దిగజార్చే లేదా పాడు చేసే అంశాలపట్ల ఈ రోజు ముఖ్యంగా సమాజంలో చర్చ జరగాలి. ఇటీవల స్మోకింగ్‌ కొంత తగ్గినట్టు కనిపించినా గుట్కాలు, ఆల్కహాల్‌, కొత్తగా డ్రగ్స్‌ వాడకం విపరీతంగా పెరుగుతున్నది. తక్షణంగా ప్రతి ఇంటిలో ఉన్న సమస్య మద్యం వినియోగం. రాష్ట్రంలోనైతే ఇది మామూలుగా లేదు. కరోనా కంటే ప్రమాదకరంగా తయారయ్యింది. ఇప్పటికే ఆల్కహాల్‌ సంబంధిత రోగాలు పెరుగుతున్నాయని ఫిజీషియన్లు, లివర్‌ డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికే దేశంలో కేవలం ఆల్కహాల్‌ కారణంగానే ఏటా రెండు లక్షల అరవై వేల మంది అకాల మరణం పొందుతున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సమాజంలో పెంచటం, అందుకు తగిన చర్యలను పాలకులకు సూచించటానికి ప్రత్యేకంగా ఒక 'హెల్త్‌ ప్రమోషన్‌' శాఖ ఉండాలి. ఈ శాఖ ప్రజల్లో ఆరోగ్యం పట్ల సరైన అవగాహనను పెంచుతూ, అవసరమైన వారికి అదనపు ఆహార సరుకులను అందజేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. వ్యక్తిగతంగా ప్రమాదకరం మాత్రమే కాక, దీర్ఘ కాలంలో ఆరోగ్య రక్షణా వ్యవస్థపై అనవసర ఆర్థిక, శ్రమ భారం వేసే ఉత్పత్తులను మార్కెట్లో అనుమతించకూడదు. ఒక్క మద్యమే కాదు, ప్రజారోగ్యాన్ని దెబ్బ తీసే అన్ని రకాల ఆహార, పానీయాలూ, గంజాయి, పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాలు వంటి వాటిపై ఖచ్చితమైన నిషేధం అమలు కావాలి. కొన్నింటిని, ముఖ్యంగా మద్యం అందుబాటును మార్కెట్లో కనీస స్థాయికి పరిమితం చేస్తూ క్రమంగా తొలగించాలి.
              అట్టడుగు ఆర్థిక, సామాజిక వర్గాల హెల్త్‌ ప్రమోషన్‌ కోసం వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయాలి. కనీసా వసరాలకు ఎవరిపై ఆధారపడని స్థాయిలో వారి ఆదాయాలను పెంచాలి. ప్రజలందరికీ తగినంత సమతుల ఆహారం, శుద్ధమైన తాగు నీరు, కాలుష్య రహిత గాలి అందేటట్లు చూడటం పాలకుల కనీస బాధ్యత. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఎన్నో రకాల వ్యాధులను అరికట్టగలుగుతాం. అలాగే దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగానికి ఇప్పుడు చేస్తున్న బడ్జెట్‌ని అయిదు రెట్లు పెంచి ప్రభుత్వ వైద్య వ్యవస్థలను ఉన్నతీకరించాలి. ప్రైవేటు వైద్య వ్యవస్థను మేపే వివిధ రకాల ఆరోగ్య స్కీమ్‌లను రద్దు చేయాలి. ప్రైవేటుకు పాలకులూ, అధికార వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా మిగతా సమాజానికి ఆదర్శనీయంగా మెలగాలి.

దేశంలో ప్రజల ఆరోగ్యం మీద వ్యాపారం విపరీతంగా పెరిగిపోతున్నది. భారతదేశం లోని 'హెల్త్‌ కేర్‌ ఇండిస్ట్రీ' అద్భుతమైన గ్రోత్‌ రేటుతో పెరుగుతుందనీ, ఈ 2022 సంవత్సరానికి 372 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల రెవెన్యూను చేరుకోగలదనీ ప్రభుత్వాలు, వ్యాపార వర్గాలూ అంచనాలు వేసుకున్నాయి

డా. ఎస్. తిరుపతయ్య
(వ్యాసకర్త సెల్‌ : 9849228212,      మానవ హక్కుల వేదిక)