3 నెలల్లో రూ.3.78 లక్షల కోట్ల అప్పులు : పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ నివేదిక
- డిసెంబర్ నాటికి రూ.150.95 లక్షల కోట్లకు పెరిగిన రుణాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అప్పులపై రాష్ట్రాలకు నిత్యం సుద్ధులు చెప్పే కేంద్ర ప్రభుత్వం తాను మాత్రం ఇబ్బడిముబ్బడిగా రుణాలు చేస్తోంది. మూడు నెలల్లోనే రూ.3.78 లక్షల కోట్లు అప్పులు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ (పిడిఎం) కేంద్ర ప్రభుత్వం అప్పులపై తాజాగా నివేదిక ఇచ్చింది. 2022 డిసెంబర్ చివరి నాటికి కేంద్రం రుణాలు రూ.1,50,95,970.8 కోట్లకు పెరిగినట్లు పిడిఎం పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి రూ.1,47,17,572.2 కోట్ల అప్పు ఉందని తెలిపింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లోనే రూ.3,78,398.6 కోట్లు పెరిగిందని తెలిపింది. అంటే 2.6 శాతం అప్పు పెరిగిందనిపేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం బకాయి రుణాలలో ప్రభుత్వ అప్పు వాటా 89 శాతంగా ఉంది. దాదాపు 28.29 శాతం గడువు తేదీ ఉన్న సెక్యూరిటీలు ఐదేళ్ల కంటే తక్కువ కాల వ్యవధినికలిగి ఉనాుయి. 2022-23 మూడో త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ.3,51,000 కోట్ల విలువైన మొత్తానిు సేకరించింది. అయితే రుణ క్యాలెండర్‌లో నోటిఫై చేసిన మొత్తం రూ.3,18,000 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. నోటిఫై చేసిన దానికంటే ఎక్కువ అప్పు చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది. ప్రైమరీ ఇష్యూల వెయిటెడ్ యావరేజ్ ఈల్డ్ 2022-23 రెండో త్రైమాసికంలో 7.33 శాతం నుంచి మూడో త్రైమాసికంలో 7.38 శాతానికి పెరిగిందని తెలిపింది. 2022 డిసెంబరు 7న ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ఉద్దేశంతో పాలసీ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు, 5.90 శాతం నుండి 6.25 శాతానికి పెంచాలని నిర్ణయించిందని పేర్కొంది. 2023 ఫిబ్రవరి 8న రిజర్వ్ బ్యాంక్ కీలకమైన ప్రధాన ద్రవ్యోల్బణాన్ని పేర్కొంటూ కీలక బెంచ్ మార్క్ పాలసీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి చేర్చింది.










