- అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి
- ఏపీ డబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : న్యూస్ క్లిక్ ఎడిటర్ తోపాటు ఆరుగురు జర్నలిస్టులను ఎన్ఐఏ నిఘా సంస్థ అక్రమ దాడి, అరెస్టులను నిరసిస్తూ శుక్రవారం కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జర్నలిస్టులపై దాడులు, బిజెపి ప్రభుత్వం నిరంకుశ ధోరణి, మీడియాపై అణచివేత చర్యలు నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేష బాబ్జి, సిహెచ్ రాజకుమార్, పౌరుషాంగం కన్వీనర్ దోసర్లపూడి రమణ రాజు ప్రజాసంఘాల నాయకులు పద్మ టేకుమూడి ఈశ్వరరావు మేడిశెట్టి వెంకటరమణ, పి.వీరబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నరాల శివ, మణి, రాజ్యాధికారి పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రాయుడు మోజేష్ బాబు తదితరులు ధర్నాలో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.నవీన్ రాజ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియా స్వేచ్ఛ హరించబడుతుందన్నారు. నిఘా సంస్థ కావాలనే కొన్ని అభియోగాలను మోపుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా న్యూస్ క్లిక్ ఎడిటర్ సహా మరో ఆరుగురు జర్నలిస్టులను అకారణంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇది మీడియా స్వేచ్చన తుంగలోకి తొక్కడమే అని విమర్శించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న మీడియాను అనగదొక్కాలనే వైఖరి సరైనది కాదన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ కేంద్రం తీరును నిరసించాలని పిలుపునిచ్చారు.అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్కే మున్ని, అధికార్, లోవరాజు, వల్లూరి నానాజీ, దాసరి శ్రీనివాస్, బిందాన సురేష్, నాయుడు బాబు, కృష్ణ, శోభన్ కుమార్, ముమ్మిడి లక్ష్మణ్, పండు తదితరులు పాల్గొన్నారు.










