Jan 19,2023 07:00

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం ఒక రత్నం. ఇళ్లులేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి బీగం వేసి, బీగం చెవులు లబ్ధిదారుల చేతుల్లో పెడతామని ఎన్నికల ముందు, ఆ తరువాత కొంత కాలం వరకు వైసిపి నేతలు చెప్పారు. మొత్తం రాష్ట్ర జనాభా 4 కోట్ల 95 లక్షల మంది. అందులో ఒక కోటి 24 లక్షల మంది జగనన్న ఇళ్లల్లో వుండబోతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 31 లక్షల మందికి రెండు దశల్లో ఇళుకట్టబోతునామని, ప్రతి జిల్లాలో 20 నుండి 25 వేల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు కల్పిస్తామని (గత డిసెంబర్‌ 21న ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా) ప్రకటించి, వాయిదా వేశారు. ప్రస్తుతం జరుగుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణం ఇలాగే కొనసాగితే, ప్రభుత్వం నిర్ణయించిన ఇళ్ల లక్ష్యం పూర్తికావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన గృహ నిర్మాణాలు ఎందుకని ఇంత నత్తనడకన సాగుతున్నాయి? గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇళ్లు, టిడ్కో ఇళ్లు, నేడు జగనన్న ఇళ్లు నిజంగానే పేదల స్వంత ఇంటి కలను నెరవేర్చాయా? ప్రభుత్వాలు మారుతున్నా ఇళ్ల సమస్య ఎందుకు పరిష్కారం కావడంలేదు?

  • స్వంత ఇల్లు మనిషి హక్కు

మనిషి కనీసంగా జీవించడానికి కూడు, గుడ్డ, నీడ అనేవి తప్పనిసరి. వీటిని ప్రజలందరికి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 70 సంవత్సరాల క్రితం చెప్పాయి. ఒకవైపు దేశ పాలకులు స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్నా మరోవైపు కోట్ల మందికి స్వంత ఇళ్లు లేవు. మన రాష్ట్రం మొత్తం జనాభాలో స్వంత ఇళ్లు లేని వారు మూడింట ఒక వంతు మంది వున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రపంచీకరణ విధానాలు వ్యవసాయాన్ని, చేతివృత్తులను, స్వయం ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసాయి. వీటిపై ఆధారపడిన కోట్ల మంది పనులు వెతుక్కుంటూ పల్లెల నుండి పట్టణాలకు తరుమబడుతున్నారు. వీటికి తోడు తరాలనాటి కులవివక్ష, సాంఘిక అసమానతలు, పెత్తందారీ జులుం గ్రామీణ యువతను వేటాడి పట్టణాలకు చేరుస్తుంది. పట్టణాల్లో రాబందుల్లా కాసుకు కూర్చున్న కంపెనీలు, మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు వీరిని పీక్కు తింటున్నారు. ప్రభుత్వాలు పెంచుతున్న సరుకుల ధరలు, ప్రజలపై పడుతున్న భారాలు ఈ పేదలపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పేద, దిగువ మధ్యతరగతి వారెెవరు పట్టణాల్లో స్థలం కొని ఇళ్లు కట్టుకోవడం ఈ జీవిత కాలంలో జరిగే అవకాశం లేదు. గ్రామాల్లో వున్న వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు తమ వారసులకు ఇళ్లు కట్టించడం సాధ్యం కావడంలేదు. అందుకే ఇళ్లకు పేదల నుండి డిమాండ్‌ ఎక్కువగా వుంటుంది. ఈ పేదలు లేకుండా పట్టణాలు, మహానగరాలు విస్తరించవు, అభివృద్ధి చెందవు. ఈ పేదలు లేకుండా నేతలకు ఓట్లు రావు, గద్దెను ఎక్కలేరు. ఈ కారణంగానే దశబ్దాలుగా పేదల ఇళ్ల సమస్యను ప్రతి పాలక పార్టీ తమ ఎన్నిక ప్రణాళికల్లో చేర్చాల్సి వస్తుంది. అనేక హామీలు ఇవ్వాల్సి వస్తుంది.
గతంలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. దానికి ముందు వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల సమస్యపై నాడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఉద్యమం సాగింది. నెలల కొద్దీ ఆందోళనలు, హైదరాబాద్‌లో నిరాహార దీక్షలు, చివరకు ఖమ్మం జిల్లా ముదిగొండలో పేదల దీక్ష శిబిరంపై జరిపిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు సిపిఎం కార్యకర్తలు బలయ్యారు. మూడు దశల్లో ఇళ్ల నిర్మాణం అంటూ ఆచరణలో కొద్దిమందికి మాత్రమే స్వంత ఇల్లు ఇచ్చి ఆ తరువాత ఆ పథకాన్ని అటకెక్కించారు. టిడిపి పాలనలో టిడ్కో ఇల్లు అంటూ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆర్భాటం చేసినా ఇళ్లు పూర్తికాకుండానే ఎన్నికలు వచ్చేసాయి. వైసిపి ప్రభుత్వం రెండుదశల్లో 30 లక్షల జగనన్న ఇళ్లు కట్టిస్తామన్నారు. గతంలో నిర్మించి నిలిచిపోయిన టిడ్కో ఇళ్లు పూర్తిచేసి పేదలకు ఇవ్వకుండా అనేక సాకులు చెబుతోంది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఖర్చుచేసిన వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది.

  • జగనన్న ఇల్లు

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలను ఈ ప్రభుత్వం గుర్తించి 30 లక్ష 60 వేల మందిని అర్హులుగా ఎంపిక చేసింది. వీరికి 15,901 లేఅవుట్ల కింద మొదటి దశలో 15 లక్షల 60 వేలు, రెండవ దశలో 12 లక్షల 70 వేల ఇళ్లు, మిగిలిన ఇళ్లను తరువాత కట్టిస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి స్థలాల సేకరణతో మొదలుకొని, ఇల్లు కట్టడం వరకు లక్ష 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించారు. ఇళ్ల నిర్మాణం గురించి ప్రభుత్వ ప్రకటనలు, ప్రభుత్వ నేతల ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. వీటన్నింటిని చూసి తమ స్వంత ఇంటి కల నెరవేరుతుందని పేదలు ఆశించారు. డిసెంబర్‌ 21న రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించి వాయిదా వేశారు. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లు కేవలం 1,42,556 మాత్రమే. అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇళ్ళు దక్కాలంటే ఇంకెంతకాలం పడుతుందో!

  • జగనన్న ఇళ్ల కష్టాలు

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం పల్లెల్లో సెంటున్నర స్థలం, లక్షన్నర రూపాయలు, పట్టణాల్లో సెంటు స్థలం లక్ష 80 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇంత తక్కువ మొత్తంతో, తక్కువ స్థలంలో కట్టే ఇల్లు నివాసం వుండడానికి ఏ మాత్రం సరిపోదు. అయినా పేదలు ఈ మాత్రం స్థలం కూడా భవిష్యత్‌లో దొరికే అవకాశం లేదు కాబట్టి అర్జీలు పెట్టుకున్నారు. పెరిగిన స్టీల్‌, సిమెంట్‌, ఇతర ధరలు, ఇసుక కొరత ఇంటి నిర్మాణానికి తీవ్ర ఆటంకాలుగా మారాయి. ఈ ఇళ్లు పూర్తి కావాలంటే ఒక మేస్త్రీ, ఇద్దరు కూలీలు కనీసం రెండునెలలు పనిచేయాల్సి వుంటుంది. మేస్త్రీకి రూ. 600 నుండి 800 వరకు, కూలీకి రూ. 400 నుండి రూ. 600 వరకు రోజు కూలీ వుంది. అంటే ఈ కూలీలకే లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇనుము సుమారు ముప్పావు టన్ను పడుతుంది. దీనికి రూ. 60 నుండి రూ. 65 వేలు. సిమెంట్‌కు రూ. 50 వేలు. ఇసుక, ఇతర సామాగ్రి కోసం మరో లక్షన్నర కావాల్సి వస్తుంది. అందుకే ఇళ్లు పూర్తికావాలంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు రుణం ఇప్పించి అందులో రూ. 35 వేలను ఇంటి నిర్మాణం కోసమని జమ చేసుకుంటున్నారు. లబ్ధిదారులు ముందుగా పునాది వేసుకుంటే ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్నారు. బిల్లులు వస్తాయో రావోననే భయంతోపాటు, స్వంతంగా ఖర్చుచేసే అవకాశం లేని నిరుపేదలు పునాదులు కూడా వేయకుండానే ఆగిపోయారు. ఉదా: అనంతపురం జిల్లాలో 68,288 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లు కేవలం 6,045 మాత్రమే. పునాది దశలోనే ఆగిపోయినవి 26 వేల ఇళ్లు, పునాది పూర్తయినవి 16 వేలు, పైకప్పు వరకు వచ్చి ఆగిపోయినవి మరో 5 వేల ఇళ్లు. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆ జిల్లాలో జగనన్న ఇళ్లు వద్దని 28 వేల మంది లబ్ధిదారులు ప్రభుత్వానికి రాసి ఇచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
జగనన్న కాలనీలు ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ నుండే అధికార పార్టీ నేతలు కొందరు కాంట్రాక్టర్లు రకరకాల రూపాల్లో అవినీతికి తెరలేపారు. లే అవుట్‌లు ఎక్కడ వేస్తారో తెలుసుకొని అక్కడ ముందే పేదరైతులతో తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి, అదే భూములను నెలల తేడాలోనే లక్షల లాభాలకు అమ్ముకోవడం లేదా తమ భూములకు విలువ వచ్చేటట్లు లేఅవుట్‌లు నిర్ణయించడం చేశారు. ఈ రూపంలో రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి అవకాశాలు లేని చోట పట్టణానికి దూరంగా, శ్మశాన స్థలాలు, వంకలకు, వాగులకు దగ్గరగా వున్న స్థలాలు, నివాసాలు ఏర్పాటు చేసుకోలేని కొండగుట్టల్లో లేఅవుట్‌లు వేశారు. ఈ కారణాల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్‌లలో రాష్ట్రంలో 12 శాతం ఇప్పటికే రద్దు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామాల్లో ఇచ్చిన మూడు సెంట్ల స్థలంలో కట్టిన సెంటున్నర ఇంటిని మినహాయించి మిగిలిన సెంటున్నర స్థలం జగనన్న ఇంటికి తీసుకున్నారు. జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాల కల్పన పేరుతో మట్టి రోడ్లు, విద్యుత్‌, బోరు, ట్యాంకు లాంటి పేర్లతో కాంట్రాక్టర్లు లాభపడ్డారు.

  • 90 రోజుల్లో ఇంటి పట్టా

ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్లు వద్దనుకుంటే అర్జీ పెట్టుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చాలా మంది పేదలు మంజూరైన ఇళ్లు వద్దని ఇంటి స్థలం కోసం అర్జీలు పెట్టుకున్నారు. వీరిని మరల వడబోసి రాష్ట్రంలో సుమారు 3 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఇందులో ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఇంటి స్థలం ఇవ్వలేదు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పాలక పార్టీలు పేదల జీవిత అవసరాలను పాచికలుగా వాడుకుంటున్నాయి. అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలను రహదారిగా ఎంచుకుంటున్నాయి. గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేస్తున్నట్లు నటిస్తూ, కోతలు పెడుతున్నాయి. హామీల అమలును ప్రశ్నించడం ప్రజల్లో పెరిగిన వెంటనే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. విధానాల వల్ల వస్తున్న సమస్యలు...పాలకులు మారడం ద్వారా పరిష్కారం కావు, విధానాలే మారాలి. అందుకు ప్రజాచైతన్యమే పరిష్కారం.

problems-of-home-less-people-housing-scheme-in-ap--article-prajasakti-rambhupal

 

 

వి రాంభూపాల్, 
/వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /