Jan 26,2023 06:31

ప్రపంచంలోని పెట్టుబడులలో ఎక్కువ శాతాన్ని దేశంలోకి ఆకర్షిస్తామని, తద్వారా 2025 నాటికి ఐదు లక్షల డాలర్ల ఆర్థికాభివృద్ధిని సాధిస్తామని, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళతామని, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని (సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే మాటను ఎపుడో చాప కిందికి నెట్టేశారు) మోడీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్నది. ప్రభుత్వ రంగం అవసరం లేదని, ప్రైవేటు రంగంతోనే దేశాభివృద్ధ్ధిని సాధిస్తామని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయటం, జాతీయ ద్రవ్యీకరణ పథకం ద్వారా లీజుకివ్వటం తదితర విధానాల ద్వారా ఆర్థికవ్యవస్థ మొత్తాన్ని బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థల చేతులలో పెడుతున్నారు. ప్రపంచంలోనూ, దేశంలోనూ బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థలు వ్యవహరిస్తున్న తీరును గమనించకుండా లేదా గమనించినా తమ యజమానులైన ద్రవ్య పెట్టుబడిదారుల ప్రయోజనాలను నెరవేర్చటం, హిందుత్వ విధానాలను ముందుకు తీసుకుపోవటంలో భాగంగా ఈ విధానాలను అమలు జరుపుతున్నారు.
బహుళజాతి కంపెనీల్లో భారీ తొలగింపులు
కేవటం లాభాలను పెంచుకోవాలనే లక్ష్యంతో, ప్రస్తుతం ప్రపంచ దేశాలను చుట్టుముడుతున్న సంక్షోభాన్ని, ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపుతూ బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొన్ని బడా సంస్థలు ఏ విధంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయో చూద్దాం. బడా సంస్థలలో ఒకటైన అమెజాన్‌ 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగులలో 6 శాతం. సాఫ్ట్‌వేర్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ 8,000 (10 శాతం) మందిని తొలగించింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 1.86 లక్షల మంది ఉద్యోగులలో 5.35 శాతం మందిని తొలగించింది. ట్విట్టర్‌ 50 శాతం మందిని తొలగించింది. తన ఆస్థిలో 90 శాతం దానం చేసినట్లు గొప్పగా ప్రచారం చేసుకున్న మార్క్‌ జుకర్‌బర్గ్‌ పోటీ పెరిగి ఆదాయం తగ్గిందనే పేరుతో మెటా (ఫేస్‌బుక్‌) నుండి 11,000 మంది (13 శాతం) ఉద్యోగులను లే ఆఫ్‌ చేశాడు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌ ఆ సంస్థలోని 3,700 మందిని (మొత్తం ఉద్యోగులలో 50 శాతం), భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులలో 90 శాతం మందిని లే ఆఫ్‌ చేశాడు. ప్రపంచంలో పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఒకటైన మైక్రోసాఫ్ట్‌ 3000 మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవాలన్న పేరుతో అమెరికన్‌ కంపెనీ హెచ్‌పి 2025 నాటికి 6,000 మందిని (మొత్తం ఉద్యోగులలో 10 శాతం) తొలగించటానికి పథకం రూపొందించింది. అదే పేరుతో జొమాటో 2022లో 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. బెటర్‌ డాట్‌కాం సంస్థ 2021 డిసెంబరు నుండి 4,100 మందిని తొలగించింది. ప్రపంచంలో అతి పురాతనమైన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ 3,800 మందిని లే ఆఫ్‌ చేసింది. ఇదే దారిలో ... రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, రాబిన్‌హుడ్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూనిలివర్‌, టెస్లా...వంటి అనేక సంస్థలు లే ఆఫ్‌ చేశాయి. దేశంలో విద్యారంగంలోని అతి పెద్ద కంపెనీ అయిన బైజూస్‌ 2500 మంది ఉద్యోగులకు లే ఆఫ్‌ ఇచ్చింది. ఈ సంస్థలన్నీ శత కోటీశ్వరుల చేతులలోనే ఉన్నాయి. లాభాలు సంపాదిస్తున్నాయి. అయినప్పటికీ కేవలం లాభాలను మరింతగా పెంచుకోవటం కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంకా దేశంలోనూ, ప్రపంచ దేశాలలో ఉన్న వేలాది ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి.
ఉన్నవారినే తొలగిస్తుంటే కొత్త ఉద్యోగాలు ఎలా?
ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. కాని నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పించటానికి కాకుండా ఇప్పటికే ఉద్యోగులుగా ఉన్నవారి ఉద్యోగాలు ఊడిపోవటానికి మోడీ ప్రభుత్వ విధానాలు దారితీస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరిస్తామని మోడీ ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు ఉద్యోగులను ఏ విధంగా తొలగిస్తున్నాయో పైన చూశాం. ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రైవేటీకరిస్తే వాటిని స్వంతం చేసుకున్న పెట్టుబడిదారులు లాభాలను మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో వాటిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులను తొలగిస్తారు. ఫలితంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు నిరుద్యోగుల జాబితాలో చేరటంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ప్రైవేటీకరణ వలన దేశంలోకి పెట్టుబడులు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కాని బడా పెట్టుబడిదారులు దేశంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పరిశ్రమలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు దేశంలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారంటే మా రాష్ట్రంలో పెట్టండి అంటే మా రాష్ట్రంలో పెట్టండి అని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటపడటం చూస్తున్నాం. ప్రైవేటీకరణ వలన పెట్టుబడులు వస్తాయనటం ఎంత బూటకమో ఇది స్పష్టం చేస్తున్నది. దేశంలోకి పెట్టుబడులు రావటం వలన కొత్త పరిశ్రమలు ఏర్పాటైతే అభివృద్ధి జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. కాని ఉన్న పరిశ్రమలు ప్రభుత్వం నుండి ప్రైవేటు వారి చేతుల్లోకి పోతే ఎలా అభివృద్ధి జరుగుతుంది? ప్రైవేటు సంస్థలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తుంటే కొత్తవారికి ఉద్యోగాలెలా వస్తాయి?
నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల మధ్య వ్యత్యాసం ఏమిటనేది ఇపుడు స్పష్టంగా కనిపిస్తున్నది. సంక్షోభం పేరుతో ప్రైవేటు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నా ఒక్క ప్రభుత్వరంగ సంస్థ కూడా ఉద్యోగులను తొలగించలేదు. కారణం ప్రభుత్వరంగ సంస్థలు కేవలం లాభాల కోసం మాత్రమే కాక, సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నాయి. అందువలన ప్రైవేటు సంస్థల వలె కార్మికులు, ఉద్యోగులను తొలగించటం లేదు. ఉద్యోగులను తొలగించకపోయినప్పటికీ ఆ సంస్థలు నష్టాలపాలు కావటం లేదు. కేవలం లాభాలు తగ్గటం మాత్రమే జరుగుతుంది. ప్రైవేటు సంస్థలకు ఏ సామాజిక బాధ్యత లేదు కాబట్టే లాభాలు వస్తున్నప్పటికీ ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులు, కార్మికులను తొలగిస్తున్నాయి.
కార్పొరేట్‌ సంస్థలతో అభివృద్ధి, ఉద్యోగ కల్పన జరగదు. బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థలకు మన దేశాభివృద్ధి పట్టదు. వారికి లాభాలే ప్రధానం. లాభాలు వస్తాయనుకుంటే అభివృద్ధిని అడ్డుకోవటానికి, దేశాభివృద్ధిని దెబ్బ తీయటానికి వారేమాత్రం వెనుకాడరు. ఉద్యోగాల కల్పన సంగతి అటుంచి తమకు లాభాలు వస్తున్నప్పటికీ వాటిని ఇంకా పెంచుకోవటం కోసం ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తారు. లాభాల కోసం దేశానికి ద్రోహం చేయటానికి, ప్రజలను కష్టాలలో ముంచటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అటువంటి వారిని నమ్ముకొని దేశాన్ని అభివృద్ధి చేస్తామని, ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పటం అంటే ''కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదిన'' చందం అవుతుంది.
దేశంలో అభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగం తగ్గాలన్నా పెద్దసంఖ్యలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడాలి. వాటికి ముడి సరుకులు, మార్కెట్‌, రుణాలు తదితరాలలో ప్రభుత్వం సహకారం అందించాలి. బడా సంస్థల నుండి ఎదురయ్యే పోటీ నుండి రక్షణ కల్పించాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంత ఎక్కువగా ఏర్పాటైతే అంత ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశాభివృద్ధి జరుగుతుంది.
ఆ విధంగా దేశాభివృద్ధి జరగటం, నిరుద్యోగం తగ్గటం జరుగుతుంది మినహా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులపై ఆశలు పెంచుకొన్నంత కాలం నిరుద్యోగం తగ్గదు. దేశాభివృద్ధి జరగదు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మార్చటం ద్వారానే ఇది సాధ్యమౌతుంది.

kotireddy

 

 

 

           ఎ. కోటిరెడ్డి