
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : విద్యార్థి అమరవీరుల ఆశయాల సాధనకై పోరాటాలు చేయాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర పిలుపునిచ్చారు. పి.డి.ఎస్.యు 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలోని యోగా వేదిక వద్ద 20 మంది విద్యార్థులతో ర్యాలీ గా వెళ్లి బిగి పిడికిలి జెండాను జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాగేశ్వర మాట్లాడుతూ నగ్జల్బరి, శ్రీకాకుళ, గోదావరి లోయ ప్రతిఘటనా పోరాటాల వెలుగులో ఉదయించిన విప్లవ విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యు అని కొనియాడారు. భూర్జువా, సంస్కరణవాద సంఘాలకు భిన్నంగా పి.డి.ఎస్.యు ఏర్పడిందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన జార్జిరెడ్డి నాయకత్వంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థులుగా నాడు ఏబీవీపీ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. వియత్నాం, క్యూబా విప్లవ పోరాటాలు చేసిన చేగువేరా సాహస స్ఫూర్తితో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారని అన్నారు. విద్యారంగ సమస్యలే కాకుండా పీడిత ప్రజల విముక్తి కావాలని కోరుకున్నారని అన్నారు. 1972 ఏప్రిల్ 14 న ఏబీవీపీ, ఆర్ ఎస్ ఎస్ మతోన్మాద గూండాలు కామ్రేడ్ జార్జిరెడ్డిని ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో కిరాతకంగా హత్య చేశారని, అనంతరం ఓయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో 1974 అక్టోబర్ 12, 13 తేదీలలో జరిగిన ప్రధమ మహాసభలో పి.డి.ఎస్.యు ఏర్పడిందని తెలిపారు. నేడు దేశంలో మోదీ ప్రభుత్వం బరితెగించి విద్యారంగాన్ని కాషాయికరించడానికి, సనాతన ధర్మాలను భోదించడానికి, మనువాద భావాజాలాన్ని విద్యార్థుల మెదళ్ళలోకి ఎక్కించడానికి పూనుకుంటుందని అన్నారు. యూనివర్సిటీలను మతోన్మాద కేంద్రాలుగా మారుస్తున్నారని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రధాని మోదీకి డూడూ బసవన్నలా తలూపడం తప్ప చేస్తుంది ఏమి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్, ఆదిల్, అనిల్ కుమార్, మహేష్, ఇర్ఫాన్, బాలు, రాజ్ కుమార్, దినేష్, మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.