ప్రజాశక్తి-విజయనగరం కోట : 29న ప్రముఖ కవి, గేయ రచయిత గంటేడ గౌరునాయుడికి పతంజలి పురస్కారం ఇవ్వనున్నట్లు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. ఈరోజు ఉదయం స్థానిక గురజాడ అప్పారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడు, అనేక పత్రికలకి సంపాదకులు గా పనిచేసిన స్వర్గీయ కె.ఎన్.వై. పతంజలి పేరున ప్రతి ఏడాది అందించే పురస్కారం ఈనెల 29న బుధవారం ఉదయం గురజాడ పబ్లిక్ స్కూల్లో ప్రఖ్యాత రచయిత ఉత్తరాంధ్ర యాస బాసలతో అనేక కధలు, యువకులకు మార్గసందేశం అందించే పాడుదమా స్వేచ్ఛా గీతం లాంటి గొప్ప జాతీయ గీతం రాసిన గంటేడ గౌరునాయుడికి అంద చెయ్యడం జరుగుతుందని పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. గురువారం గురజాడ అప్పారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేదిక ప్రతినిధుల కమిటీ గౌరునాయుడి పేరుని సూచించిందని ఆయన అన్నారు. స్నేహ కళా సాహితీని స్థాపించి ఉత్తరాంధ్ర నుండి ఎందరో కవుల్ని కధకుల్ని తయారు చేసిన ఘనత గౌరునాయుడి మాస్టారికే దక్కుతుందని భీశెట్టి అన్నారు వేదిక కార్యదర్శి ఎన్. కె.బాబు మాట్లాడుతూ పతంజలి పేరుతో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రముఖ రచయితలు మోహన్, మహర్షి, దేవిప్రియ,సతీష్ చంద్ర, చింతికింది, అట్టాడ అప్పలనాయుడు, పప్పు అరుణలకు అందచేసామని, 2023లో గంటేడ గౌరునాయుడికి ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. 29న ఉదయం 10 గంటలకి జరిగే రాష్ట్ర స్థాయి పురస్కార ప్రదానం కార్యక్రమంలో సాహితీవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, పాల్గొని సభని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వేదిక ప్రతినిధులు జలంత్రి రామచంద్రరాజు, ఇప్పలవలస గోపీ, గురజాడ వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










