ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2023 సంవత్సరానికి జర్నలిజంలో 'ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అవార్డు ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్‌ను వరించింది. ఇండెక్స్ ఆన్ సెన్సార్‌షిప్ ఈ అవార్డును శుక్రవారం ప్రకటించింది. ''అధికార పార్టీకి చెందిన ప్రభావవంతమైన నేతలు ప్రచారంలో పెట్టే తప్పుడు సమాచారాన్ని సవాలు చేసినందుకు జుబేర్ చాలా బెదిరింపులను ఎదుర్కొన్నారు'' అని సంస్థ తెలిపింది. ఇండెక్స్ ఆన్ సెన్సార్‌షిప్ అనేది లండన్ కేంద్రంగా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పని చేసే సంస్థ. బ్రిటన్ రాజధాని లండన్‌లో జరిగిన వేడుకలో విజేతలను సత్కరిస్తారు. ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఈ అవార్డును స్వీకరించడం గురించి జుబేర్ స్పందిస్తూ తమ యువ సహోద్యోగులకు ఇది ''ఆశాజ్యోతి' అని అన్నారు. ''నేను పని చేసేటప్పుడు.. నాపై దాడి జరిగినప్పుడు, దూషణలకు గురైనప్పుడు, జైలు శిక్షకు గురైనప్పుడు నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు'' అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో జుబేర్ ఆరు కేసులు, ఢిల్లీలో ఒక కేసును ఎదుర్కొని జైలు పాలైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలయ్యారు.