Mar 29,2023 17:23

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రపంచం గర్వించదగ్గ గొప్ప రచయిత, పాత్రికేయుడు, సినీ మాటల రచయిత స్వర్గీయ కె.ఎన్.వై.పతంజలి పేర ప్రతి ఏటా కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక వారు అందించే పురస్కారం ఈ సంవత్సరం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉందని పురస్కార గ్రహీత ప్రముఖ రచయిత, కవి, గంటేడ గౌరునాయుడు అన్నారు. పతంజలి జయంతి సందర్భంగా బుధవారం నాడు స్థానిక  కంటోన్మెంట్ గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పురస్కార ప్రదానం సభలో ముందుగా పతంజలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పతంజలి రచనలకు విజయనగరం జిల్లా కేంద్ర బిందువుగా ఉండేదని తన రచనా ప్రవాహం, మాటల తూటాలతో వ్యవస్థ లో కుళ్లును కడిగే ప్రయత్నం చేశారని తెలుగు సాహిత్య చరిత్రలో పతంజలి ఎవ్వరికన్నా తక్కువ కాదని ప్రతి రచయతకి విమర్శకులు ఉండేవారని ఒక్క పతంజలి కి మాత్రమే గొప్ప స్నేహితులు ఉండేవారని అన్నారు, నేటి తరం విద్యార్థులు పతంజలి రచనలు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మరో రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతు   గురజాడ గిరీశం ని సృష్టిస్తే పతంజలి గోపాత్రుడ్ని సృష్టించి విభిన్న తరహలో ప్రజముందు కి తెచ్చారని ప్రజల భాష, గుండె ఘోష తెలిసిన రచయిత కాబట్టే అందరి మన్ననలు పొందారని రచనలో చమత్కారం పతంజలి కథకి ఆయువు పట్టుగా ఉండేదని అన్నారు,పతంజలి ప్రపంచం గర్వించదగ్గ రచయిత అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదని కితాబిచ్చారు. వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అధ్యక్షత వహించిన ఈ సభలో పతంజలి సతీమణి శ్రీమతి ప్రమీలా, అల్లుడు రామకృష్ణ రాజు,డాక్టర్ మోహన్, వేదిక కార్యదర్శి ఎన్.కె.బాబు,వి.ఎమ్.కె.లక్ష్మణరావు, సీనియర్ పాత్రికేయుడు ఎలిశెట్టి సురేష్, హోటల్ మయూరి అధినేత బాబూరావు, చీకటి దివాకర్,కందాల సాయిబాబా,గురజాడ ఇందిరా,చీకటి చంద్రిక,కాంచన, దవడ కొండబాబు,కొతంశెట్టి శ్రీనివాసరావు, గిడుతూరి పైడితల్లీ,ఇప్పలవలస గోపీ,రామచంద్ర రాజు,గాయకుడు డప్పుశ్రీను,జక్కు రామకృష్ణ, స్కూల్ ప్రిన్సిపాల్ షేకర్, పెద్ద సంఖ్యలో రచయిత లు పాల్గొన్నారు