ఈ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల ప్రధాన డిమాండ్‌ను ఒప్పుకునేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తోంది. చట్టాలను, హెచ్చరికలను లెక్కచేయని అహంభావమిది. భారతదేశం లోని శ్రామిక శక్తిలో సుమారు 50 శాతం వ్యవసాయం మీద ఆధారపడుతుంది. మూడింట, రెండొంతుల జనాభా (70 శాతం గ్రామీణ ప్రజలు) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ ఆదాయాలపై ఆధారపడుతుంది. నిరసన చేస్తున్న రైతుల దృఢ నిశ్చయం,
విశాల ప్రాతిపదికన వారికి లభిస్తున్న ప్రజల మద్దతు...ఈ సారి ఈ రైతు ఉద్యమం చాలా భిన్నమైనదని చెప్తున్నాయి.
రెండు వారాల క్రితం 20 లక్షలకు పైగా రైతులు ప్రారంభించిన భారీ ముట్టడిలో మన దేశ రాజధాని ఉంది. రైతు కుటుంబాలకు చెందిన యువకులు, వృద్ధులు, మహిళలతో పాటు, పిల్లలు కూడా ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో ఆరుబయట రోడ్లపై మకాం వేశారు. కోవిడ్ మహమ్మారిని కూడా లెక్క చేయకుండా తమ వారినందరినీ వదిలేసి, కొన్ని నెలలకు సరిపడా ఆహార పదార్థాలను వెంట తీసుకొని, సుదీర్ఘ కాలంపాటు ప్రయాణం చేసి వచ్చారు.
ఢిల్లీకి పొరుగున వున్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన కొన్ని వేల మంది రైతులు....తమ కష్టాలను, బాధలను ప్రజలకు తెలియజేయాలని తమ వాహనాలపై దేశ రాజధాని వైపు వచ్చినప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో, తరువాత ఈ నిరసనలు మరింతగా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఐక్యత చెదిరిపోతున్న ఛాయలు ఏ కోశానా కనిపించడం లేదు. నిరసనకారుల డిమాండ్లకు, డిసెంబర్ 8న ''భారత్ బంద్''కు రైతులిచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా 500 పైగా రైతు సంఘాలు మద్దతు పలికాయి. ఈ పిలుపుకు కార్మిక సంఘాలు, వివిధ ప్రతిపక్ష పార్టీల నుండి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
ఒకవైపు కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు రైతులతో, భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయానికి బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి సంప్రదింపులు జరుపకుండానే కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను హడావుడిగా ఆమోదింపచేసుకుంది. దాంతో ఈ అత్యవసర నిరసనల వెల్లువ ప్రారంభమైంది.
పైకి చూడడానికి ఈ చట్టాలు, నిరపాయకరంగా లేదా రైతులకు లాభసాటిగా కూడా కనిపిస్తాయి. అవి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలపై ఉన్న పరిమితులను సడలిస్తూ, నిత్యావసరాల సరుకుల చట్టం-1955 కింద నిల్వ చేసుకోడానికి ఉన్న అవరోధాలను తొలగిస్తాయి. అంతేగాక, రాతపూర్వక ఒప్పందాలపై ఆధారపడి ఒప్పంద వ్యవసాయానికి అనుమతిస్తాయి.
రైతులు ఈ కొత్త చట్టాలను చూసే దృష్టి చాలా భిన్నంగా ఉంది. ఈ 'ఆధునిక' చట్టాలు, రాజకీయంగా మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యాపార దిగ్గజాల నాయకత్వంలో, భారతదేశ వ్యవసాయంలో దోచుకుతినే కార్పొరేట్ వ్యాపారీకరణకు మార్గం సుగమం చేస్తాయని వారు భయపడుతున్నారు. రైతులను దెబ్బ తీసే వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలు, ఒప్పంద వ్యవసాయం, ఉత్పత్తులను నిల్వ చేసే పరిమితులపై ఈ చట్టాలు సమర్థవంతంగా నియంత్రణను ఎత్తివేస్తాయని కొందరు వాదిస్తున్నారు. వీటి వల్ల తాము ఘోరంగా దెబ్బతింటామని సన్న, చిన్నకారు రైతులు భయపడుతున్నారు.
బహుశా ఇవి అనేక మంది రైతులకు అంగీకారం కాని ప్రభుత్వ యొక్క చివరి చర్యలు అయి ఉంటాయి. రైతుల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుండడం వలన వారి నిరసనలు మరింత ఉధృతం అయ్యాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారం లోకి రావడానికి ముందే నిజ, వ్యవసాయ ఆదాయాలు నిరంతరం క్షీణిస్తూ ఉండేవి. వాస్తవానికి, రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను (వ్యవసాయానికి అయిన మొత్తం ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి ఇవ్వడం) కల్పించడం ద్వారా ఐదేళ్ళలో వారి ఆదాయాలు రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసిన తర్వాత మోడీ మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించడంలో రైతులు చాలా కీలకమైన పాత్రను పోషించారు.
కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో మోడీ విఫలం అయ్యారు. అంతేకాకుండా రైతులు అంతకు ముందున్న ప్రభుత్వం కల్పించిన ధర కంటే (తమ ఉత్పత్తులకు అయ్యే ఖర్చు కంటే కూడా) తక్కువ ధరను ప్రస్తుత ప్రభుత్వంలో పొందారు. వ్యవసాయ రంగానికి మోడీ చేసిన ఇతర అనేక వాగ్దానాల డొల్లతనం కూడా బయటపడడంతో ఆయన పాలన పట్ల రైతులు విశ్వాసాన్ని కోల్పోయారు.
ఇటీవల కాలంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పతనం కావడం వలన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గి పోయాయి. 2016 నవంబర్ లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఆ తరువాత అనాలోచితంగా జరిగిన జాతీయ వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) లాంటి తప్పుడు నిర్ణయాలు...అసంఘటిత రంగానికి చెందిన ఆర్థిక కార్యకలాపాలు నాశనం కావడానికి, ప్రజల జీవనోపాధికి హాని కలిగించడానికి దోహదం చేశాయి.
ఉపాధిని, డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక విధానాన్ని అనుసరించక పోవడం వలన ఆదాయాలు, వినియోగం రెండూ క్షీణించి, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావం వల్ల...రైతులు వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవడం, మార్కెట్‌కు వాటిని తీసుకుని పోవడం కష్టతరంగా తయారైంది. పైగా, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 2019లో ధరల స్థాయి కంటే తక్కువ స్థాయిలోనే వుండిపోయాయి.
ఈ కొత్త చట్టాలతో ప్రజా ఆహార సేకరణ వ్యవస్థకు మూడుతుందేమోనని రైతులు సందేహిస్తున్నారు. కొన్ని లోపాలు వున్నప్పటికీ, ఆ వ్యవస్థ రైతులకు కొన్ని ప్రాథమిక రక్షణ చర్యలను సమకూర్చుతుంది. నియంత్రించబడిన మార్కెట్ యార్డుల గుత్తాధిపత్యాన్ని నిలిపి వేసిన బీహార్ లాంటి రాష్ట్రాల్లో పంటల ధరలు ఎంఎస్‌పి (కనీస మద్దతు ధర) కంటే బాగా తక్కువకు పడిపోయాయి.
కొత్త చట్టాల లోని ఒక చట్టం, కమీషన్ ఏజెంట్ల లాంటి 'మధ్య దళారుల' ప్రమేయం లేకుండా చేస్తుంది. కానీ రైతులు అలాంటి వారితో ఏర్పరచుకునే సంబంధాలు (కొనుగోలు చేసే సమయంలో ''క్వాలిటీ కంట్రోల్'' లాంటి వివిధ పద్ధతులను ఉపయోగించి వారికి చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించకుండా ఉండే ముక్కూమొహం తెలియని కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల కంటే కూడా) అవసరమైనప్పుడు కొన్ని రాయితీలను, సౌకర్యాలను పొందడానికి వీలు కల్పిస్తాయి.
పర్యావరణ అవరోధాలు, ప్రతికూల వాతావరణ మార్పుల ప్రభావం, కలుషిత నీరు, నీటి కొరత, రసాయనిక ఎరువులపై ఆధారపడి చేసే వ్యవసాయం వలన కలిగే భూసార క్షీణత గురించి రైతులు ఆందోళన చెందుతున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మోడీ ప్రభుత్వ విధానాలు ఈ సమస్యలను మరింత జటిలం చేస్తాయని వారు భయపడు తున్నారు.
ఇప్పటివరకు, ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న నిరసనలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసింది. ప్రభుత్వం ఇప్పుడు ఆగ్రహంగా ఉన్న రైతులతో మాట్లాడాలనుకుంది. మొదట ప్రభుత్వం నిరసన కార్యక్రమాలను పట్టించుకోలేదు. తరువాత రైతులు ప్రమాదకరమైన వ్యతిరేక శక్తుల మార్గదర్శకత్వంలో తప్పుదోవ పడుతున్నారని పేర్కొంది. ఆ తర్వాత సిక్కు రైతులు 'జాతి వ్యతిరేకులు' కాబట్టి, వారు 'తీవ్రవాదులు' అని అర్ధం వచ్చే విధంగా పేర్కొంటూ, శాంతియుతంగా జరుగుతున్న నిరసనలను అనాగరికంగా అణిచివేసేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వానుకూల ప్రధాన ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు గత ఆరు సంవత్సరాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారిపై దూకుడుగా దాడి చేసినట్లే, అవి రైతుల డిమాండ్లను కూడా బలహీనపరచి, వారిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల ప్రధాన డిమాండ్‌ను ఒప్పుకునేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇప్పటికే కొంతమంది నిరసనకారులు చలిలో చనిపోయారు కాబట్టి, బహిరంగ నిరసనలు నెమ్మదిగా బలహీనపడి నిరుత్సాహంగా ముగుస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
కానీ చట్టాలను, హెచ్చరికలను లెక్కచేయని అహంభావమిది. భారతదేశం లోని శ్రామిక శక్తిలో సుమారు 50 శాతం వ్యవసాయం మీద ఆధారపడుతుంది. మూడింట, రెండొంతుల జనాభా (70 శాతం గ్రామీణ ప్రజలు) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ ఆదాయాలపై ఆధారపడుతుంది. నిరసన చేస్తున్న రైతుల దృఢ నిశ్చయం, విశాల ప్రాతిపదికన వారికి లభిస్తున్న ప్రజల మద్దతు...ఈ సారి ఈ రైతు ఉద్యమం చాలా భిన్నమైనదని చెప్తున్నాయి.
జయతీ ఘోష్

(వ్యాసకర్త జెఎన్‌యు ప్రొఫెసర్, ప్రముఖ ఆర్థికవేత్త)










