ప్రజాశక్తి-అనంతపురం :వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం అనంతపురం జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వి.రాంభూపాల్, పండ్లతోటల రైతుసంఘం నాయకులు శివారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. ఇటీవల జిల్లాలోని మిడ్‌పెన్నార్, పెనుకచర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బైరవానితిప్ప ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం వల్ల దిగువనున్న పరివాహక ప్రాంతాల్లో వేరుశనగ, వరి, మిరప, తదితర పంటలు దెబ్బతిన్నాయి. పామిడి, కల్లూరు, ఇల్లూరు, గార్లదిన్నె, తదితర గ్రామాల్లో నీట మునిగిన పంటలను రైతు సంఘం నాయకులు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. వరద నీరు ఉధృతంగా రావడంతో పరివాహక ప్రాంతంలో ఉన్న తమ భూముల్లోకి నీరు వచ్చి పంట మొత్తం దెబ్బతిందని నాయకుల ఎదుట రైతులు వాపోయారు. ఇసుక మేటలు వేయడంతో సాగుకు అనువుగా లేకుండా పోయాయని, వీటిని తిరిగి సాగుకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఎకరానికి రూ.40వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.రాంభూపాల్ మాట్లాడుతూ.. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి, పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పెనుకచర్లలో ఉద్యానపంటలు సైతం దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. పై సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం నాయకులు ఓ.నల్లప్ప, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.










