Jul 14,2023 15:03

హిమాచల్‌ : రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతంపై వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీతో సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. భారీ వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 145 మందికి పైగా మరణించారు. ఇందులో అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉత్తరప్రదేశ్‌ లో 14 మంది, హర్యానాలో 16, పంజాబ్‌ లో 11, ఉత్తరాఖండ్‌ లో 16 మంది మఅతి చెందారు.కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జులై 13 నుంచి 17 వరకు ఆ రాష్ట్రం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. జులై 19 వరకూ ఆ రాష్ట్రంలో తడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇప్పటి వరకూ 636 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 1,128 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,110 రోడ్లు బ్లాక్‌ అయ్యాయని ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ తెలిపింది. వర్షాలు, వరదల కారణంగా దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.