సిమ్లా : గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ని అతలా కుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాలకు 74 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రూ. 10వేల కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన 55 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలతోపాటు.. వరదలు రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల మూలంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. సమ్మర్‌హిల్‌లో ఓ శివాలయం సహా సిమ్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సిమ్లాలోని సమ్మర్ హిల్‌లో, రైల్వే ట్రాక్‌లలో కొంత భాగం కొట్టుకుపోయి, పట్టాలు గాలిలో వేలాడుతున్న దృశ్యాలు మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.
హిమాలయాల్లో అడ్డూ అదుపు లేకుండా నిర్మాణాలు జరపడం, తరిగిపోతున్న అటవీ విస్తీర్ణం, వాగుల దగ్గర నిర్మాణాల వల్ల తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 113 కొండచరియలు విరిగిపడటంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి)కి సంబంధించిన రూ. 2,491 కోట్ల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ)కి రూ 1,000 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.










